హనుమకొండ జిల్లాలో ముందస్తు హడావుడి

హనుమకొండ జిల్లాలో ముందస్తు హడావుడి
  • బీఆర్ఎస్​లో సిట్టింగులకు దీటుగా ఆశావహుల ప్రయత్నాలు
  •  అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ తెరపైకి కొత్త ముఖాలు
  • హైకమాండ్​ దృష్టిలో పడేందుకు పోటాపోటీ కార్యక్రమాలు

హనుమకొండ, వెలుగు: ఎలక్షన్​ఇయర్ ​కావడం, ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతుండడంతో హనుమకొండ జిల్లాలోని అన్ని పార్టీల లీడర్లు అలర్ట్ అయ్యారు. అధికార బీఆర్ఎస్​తో పాటు ప్రతిపక్ష నేతలంతా టికెట్ల వేటలో పడ్డారు. ఓవైపు ప్రజల్లో తిరుగుతూనే మరోవైపు తమ గాడ్​ఫాదర్స్​ను ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా మారారు. ఈసారి సిట్టింగులకే టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఎమ్మెల్యేల్లో ఏదో మూల అనుమానం లేకపోలేదు. ఇందుకు తగ్గట్లే రూలింగ్ ​పార్టీలోని ఆశావహులు తెర వెనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాల్లోనూ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఉన్న నేతలకు తోడు కొత్త ముఖాలు తెరపైకి వస్తుండడంతో హనుమకొండ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.

పరకాలలో పట్టుబిగిస్తున్న ప్రతిపక్షాలు 

పరకాల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు పట్టుబిగిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్​ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హ్యాట్రిక్ కొట్టేందుకు  రెడీ అవుతుండగా, ఈసారి ఆయనను ఎలాగైనా ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్​ రెడీ అవుతున్నాయి. బీజేపీ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి పెసరు విజయచందర్​ రెడ్డి టికెట్​ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. కాగా కొద్దిరోజుల కింద బీఆర్ఎస్​ నుంచి మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి బీజేపీలో జాయిన్​ అయ్యారు.  ఎమ్మెల్యే టికెట్ కోసమే పార్టీ మారారనే ప్రచారం జరిగినా తాను ఎమ్మెల్యే పోటీలో ఉండనని, పార్టీ అభ్యర్థి కోసం కష్టపడతానని స్వయంగా ఆయనే వివిధ సందర్భాల్లో చెప్పారు. ఇక టికెట్​ విజయ్​చందర్​రెడ్డికే ఇస్తారని అంతా భావిస్తుండగా.. తాజాగా ఇండియన్​ మెడికల్ అసోసియేషన్​ రాష్ట్ర​ అధ్యక్షుడు, వరంగల్ లోని గార్డియన్​ హాస్పిటల్​ అధినేత డా.కాళీప్రసాద్​రావు పేరు తెరమీదికి వచ్చింది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్​ ఈటల రాజేందర్​ కు సన్నిహితుడు కావడంతో కాళీప్రసాదే పోటీలో ఉంటారని ప్రచారం జోరందుకుంది. మరోవైపు చల్లా ధర్మారెడ్డి హుజూరాబాద్​ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్​ను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో చల్లా ధర్మారెడ్డిపై ప్రతీకారం కోసం ఈటల జమునను పరకాల నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్​ పార్టీ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి  ఇనుగాల వెంకట్రామ్​ రెడ్డి టికెట్​ఆశిస్తున్నారు. పరకాల అంటే కొండా దంపతుల పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ.. కొండా ఫ్యామిలీ వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తుందని ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. అనూహ్యంగా తెరపైకి వేరే పేర్లేమీ రాకుంటే ఇనుగాల వెంకట్రామ్​ రెడ్డికి లైన్​ క్లియర్​ అయినట్టే. దీంతో వెంకట్రామ్​రెడ్డి కూడా తనవంతుగా ప్రచారం మొదలుపెట్టారు.

దాస్యంతో ఢీ అంటే ఢీ

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్​కు తెలంగాణ  ఉద్యమనాయకుడిగా పేరుంది. 2009 నుంచి ఇప్పటివరకు నాలుగు టర్మ్​ లు, 14 ఏండ్లుగా ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్​ పోటీ పడుతున్నాయి. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ  వివిధ సమస్యలు, సందర్భాలను అందిపుచ్చుకుని అధికార పార్టీపై పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు కూడా తనవంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలాఉంటే బీజేపీ సీనియర్​ నేత, మాజీ ఎంపీ చాడ సురేశ్​రెడ్డి కూడా టికెట్​ రేసులో  ఉండే అవకాశం ఉందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్​ లో హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్​నాయిని రాజేందర్​రెడ్డి, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి మధ్య వరంగల్ వెస్ట్​ టికెట్​విషయంలో వైరం నడుస్తోంది. నిరుడు కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ వరంగల్​ లో  రైతు సంఘర్షణ సభ నిర్వహించే సందర్భంలో ఇద్దరి మధ్య ఇంటర్నల్ ఫైట్​ ఎక్కువ కావడంతో హైకమాండ్ ​జంగాకు నోటీసులు ఇచ్చింది. వరంగల్ పశ్చిమలో కార్యక్రమాలు చేపట్టొద్దని సూచించింది. దీంతో కొద్దిరోజులు సైలెంట్​ అయిన ఆయన మళ్లీ వరంగల్​ వెస్ట్ టికెట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు పార్టీలో సీనియర్​ నాయకుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్​ రెడ్డి, మాజీ మేయర్​ ఎర్రబెల్లి స్వర్ణ పేర్లు వినిపిస్తున్నాయి.  ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలు, డబుల్​ బెడ్​ రూం ఇండ్లు, అధికార పార్టీ నేతల కబ్జాలు, సీఎం కేసీఆర్​ మాట ఇచ్చి అమలుకు నోచుకోని  హామీలను ప్రచార అస్త్రాలుగా చేసుకుని జనాల్లోకి వెళ్తున్నాయి. అధికార పార్టీ నేతలేమో ప్రభుత్వ కార్యక్రమాలు,  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రచారం చేసుకుంటున్నారు.

సొంత పార్టీ నేతలతో టెన్షన్

వరంగల్​ పశ్చిమ, పరకాల నియోజవర్గాల్లో సిట్టింగ్​ఎమ్మెల్యేలకు  సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పి మొదలైంది. వరంగల్ వెస్ట్​ లో ఎమ్మెల్యేగా దాస్యం వినయ్​ భాస్కర్​ ఉండగా..  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈసారి ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్​కు నియోజకవర్గంలో పాజిటివ్​ వేవ్స్​ ఎక్కువగానే ఉన్నా.. పల్లా రాజేశ్వర్​రెడ్డి సీఎం కేసీఆర్​కు  సన్నిహితుడు కావడంతో చివరి నిమిషంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక పరకాలలో చల్లా ధర్మారెడ్డి సిట్టింగ్​ఎమ్మెల్యే కాగా.. అక్కడ ఉద్యమకారుడు, రైతు రుణ విమోచన కమిషన్​ చైర్మన్​ నాగుర్ల వెంకటేశ్వర్లు టికెట్​ ఆశిస్తున్నారు. ఇటీవల తరుచూ పరామర్శలకు వెళ్తూ జనాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రతిపక్ష పార్టీల్లో టికెట్​ ఆశిస్తున్న నేతలు కూడా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళ ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా వాళ్లు అభ్యర్థికి సహకరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2018 ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు

పరకాల నియోజకవర్గం
చల్లా ధర్మారెడ్డి(బీఆర్ఎస్)     1,05,903
కొండా సురేఖ(కాంగ్రెస్)    59,384
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం
దాస్యం వినయ్​భాస్కర్(బీఆర్ఎస్)     81,006
రేవూరి ప్రకాశ్​రెడ్డి(టీడీపీ)    44,555

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
అనుకూల అంశాలు 
గ్రామస్థాయిలో ప్రతిపక్ష పార్టీలకు బలమైన క్యాడర్​ లేకపోవడం
కుల సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వడం
ప్రతికూల అంశాలు 
తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రజల మనిషిగా కన్నా  
కాంట్రాక్టర్ గానే  పేరుండటం
ప్రభుత్వంపై వ్యతిరేకత, 
చాలా చోట్ల డబుల్ బెడ్​ రూం ఇండ్లు పంచకపోవడం
దళితబంధు పార్టీ నేతలకే 
 పరిమితం చేయడం

ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​
అనుకూల అంశాలు 
ఉద్యమకారుడు  అనే పేరు
తరచూ ఏదో ఒక కార్యక్రమంతో ఓటర్లకు దగ్గరవడం
వివిధ యూనియన్లు, కుల సంఘాల సపోర్ట్​
ప్రతికూల అంశాలు 
పేదలకు డబుల్​ బెడ్​రూం ఇండ్లు పంచకపోవడం
అనుచరులపై కబ్జా ఆరోపణలు
చాలా ప్రాంతాల్లో రోడ్లు డ్యామేజ్​ కావడం
 సిటీలో పెండింగ్​ పనులు

జిల్లాలోని ఓటర్ల వివరాలు
నియోజకవర్గం         మొత్తం ఓటర్లు    పురుషులు    మహిళలు
పరకాల                        2,07,810                1,02,019       1,05,788    
వరంగల్ పశ్చిమ        2,66,825                1,32,761        1,34,053

మిగతా పార్టీలూ రెడీ
అధికార బీఆర్ఎస్​, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలతో మిగతా పార్టీలు కూడా పోటీకి సై అంటున్నాయి. మునుగోడు ఎన్నికల్లో అధికార పార్టీతో కలిసి పని చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు జనాల్లో వెళ్లేందుకు రెడీ అయ్యాయి. మార్చి 17 నుంచి పాదయాత్ర చేపట్టేందుకు సీపీఐ సిద్ధమైంది.  ఇప్పటికే వై‌‌ఎస్సార్​ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన వస్తుండడంతో తమ బలాన్ని అంచనా వేసి పరకాల, వరంగల్​ పశ్చిమంలో కూడా క్యాండిడేట్లను పోటీలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీఎస్పీ కూడా తనవంతు ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​పాదయాత్ర చేపట్టగా.. వీలున్నప్పుడల్లా ఇక్కడి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.  


సొంత పార్టీ నేతలతో టెన్షన్

వరంగల్​ పశ్చిమ, పరకాల నియోజవర్గాల్లో సిట్టింగ్​ఎమ్మెల్యేలకు  సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పి మొదలైంది. వరంగల్ వెస్ట్​ లో ఎమ్మెల్యేగా దాస్యం వినయ్​ భాస్కర్​ ఉండగా..  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఇక్కడ పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈసారి ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్​కు నియోజకవర్గంలో పాజిటివ్​ వేవ్స్​ ఎక్కువగానే ఉన్నా.. పల్లా రాజేశ్వర్​రెడ్డి సీఎం కేసీఆర్​కు  సన్నిహితుడు కావడంతో చివరి నిమిషంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక పరకాలలో చల్లా ధర్మారెడ్డి సిట్టింగ్​ఎమ్మెల్యే కాగా.. అక్కడ ఉద్యమకారుడు, రైతు రుణ విమోచన కమిషన్​ చైర్మన్​ నాగుర్ల వెంకటేశ్వర్లు టికెట్​ ఆశిస్తున్నారు. ఇటీవల తరుచూ పరామర్శలకు వెళ్తూ జనాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రతిపక్ష పార్టీల్లో టికెట్​ ఆశిస్తున్న నేతలు కూడా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళ ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా వాళ్లు అభ్యర్థికి సహకరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.