
GST Council Meet: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రెండు రోజుల పాటు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడు స్టార్ట్ అయ్యింది. రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో 33 మంది సభ్యుల కమిటీ జీఎస్టీ విధానంలో మార్పులపై చర్చిస్తారు. ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగంలో జీఎస్టీ కొత్త సంస్కరణల్లో కేవలం రెండు స్లాబ్ రేట్లు మాత్రమే ఉంటాయని ప్రకటించిన తర్వాత జరుగుతున్న తాజా సమావేశంపై ఇండస్ట్రీ నుంచి ప్రజల వరకు అందరి చూపు కొనసాగుతోంది.
కొత్తగా తీసుకొచ్చే స్లాబ్స్ నవరాత్రి నుంచి అమలులోకి వస్తాయని కొన్ని ప్రముఖ వార్తా సంస్థల్లో కథనాలు వచ్చినప్పటికీ దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో విపక్ష రాష్ట్రాలకు చెందిన సభ్యులు జీఎస్టీ ఆదాయం తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేట్ల తగ్గింపు వల్ల తమ ఆదాయాలు తగ్గుతాయని వారు అంటున్నారు. అయితే దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను కేంద్రం ఆఫర్ చేస్తుందనే విషయాలపై రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జీఎస్టీలో మార్పులు చేయటం వల్ల తెలంగాణకు దాదాపు ఏడాదికి రూ.7వేల కోట్ల వరకు ఆదాయం కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్ల ఆదాయం ప్రస్తుత నిర్ణయాల కారణంగా రూ.60వేల కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం మార్పుల తర్వాత కేవలం 5 శాతం, 18 శాతం పన్ను రేట్లు మాత్రమే మిగులుతుండగా.. సిన్ గూడ్స్ లగ్జరీ గూడ్స్ కోసం 40 శాతం స్లాబ్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ALSO READ : IPO News: నిమిషాల్లో డబ్బు డబుల్ చేసిన ఐపీవో.. ఇన్వెస్టర్లకు తొలి రోజే సూపర్ లాభాలు
జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం కారణంగా ఎఫ్ఎంసీజీ, ఆటో, సిమెంట్ రంగాలకు లాభం చేకూరనుందని తెలుస్తోంది. మెుత్తానికి ఆర్థిక మంత్రి గురువారం జీఎస్టీ గురించి చేయనున్న ప్రకటన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.