ఇండియాలో వివక్ష, హింస.. పెరుగుతున్నయ్ : రాహుల్​ గాంధీ

ఇండియాలో వివక్ష, హింస.. పెరుగుతున్నయ్ : రాహుల్​ గాంధీ

లండన్​: యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్​గాంధీ మరో సారి వివాదాస్పద కామెంట్లు చేశారు. అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇండియాలో వివక్ష, హింస పెరుగుతున్నాయని అన్నారు. ఈ అంశంపై యూరోపియన్ యూనియన్​లో కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. యూరప్​పర్యటనలో ఉన్న రాహుల్ ​శుక్రవారం బ్రస్సెల్స్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. చైనా బెల్ట్ ​అండ్​రోడ్ ప్రాజెక్టు, ఉక్రెయిన్​ సంక్షోభం, జీ20 సమిట్ తదితర అంశాలపై స్పందించారు. ‘‘ఇండియాలో జీ20 సమిట్ జరగడం మంచి పరిణామం. అయితే దానికి ప్రతిపక్ష నేతను పిలవకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. దేశంలో సగానికిపైగా ప్రజలకు ప్రతినిధిగా ఉన్న నాయకుడికి ప్రభుత్వంలో ఉన్న వారు కనీస విలువ ఇవ్వడంలేదని దీంతో స్పష్టమవుతున్నది. వారెందుకలా చేస్తున్నారు.. వాళ్ల ఆలోచన విధానం ఏంటి? అనే దానిపై దేశ ప్రజలు ఆలోచించాలి. ఇండియాలో హింస, వివక్ష పెరుగుతున్నాయ్. ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరుగుతున్నది. ఈ విషయం అందరికి తెలుసు’’ అని రాహుల్ అన్నారు.

ప్రజాస్వామ్యయుతమైన ఉత్పత్తి మోడల్ తేవాలె

నిర్బంధంతో కూడిన చైనీస్ ఉత్పత్తి నమూనాకు ప్రత్యమ్నాయంగా ఇండియా, అమెరికా, యూరప్ కలిసి ఒక బలమైన ఉత్పత్తి మోడల్​ను రూపొందించాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. ప్రపంచం మొత్తానికి ఒక నిర్ధిష్టమైన విజన్​ను చైనా ప్రతిపాదిస్తున్నదని తెలిపారు. చైనా ప్రపంచ మాన్యూఫాక్చర్​సెంటర్​గా మారడంతో ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) అనే ఆలోచనను ముందుకు తీసుకొస్తున్నదని పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​2013లో బీఆర్ఐని ప్రతిపాదించారని చెప్పారు. ‘మాన్యుఫ్యాక్చరింగ్​లో మన వైపు నుంచి ఎలాంటి అల్టర్నేటివ్​విజన్​ కనిపించడం లేదు. అయితే ఆ విజన్ ప్రజాస్వామ్యయుతమైన, పర్యవరణ హితమైనదై ఉండాలి. అయితే నిర్బంధ వాతావరణంలో సాధ్యమైనంత ఎఫెక్టివ్ గా ఉత్పత్తి చేసేలా చైనా తన మోడల్​ను తయారు చేసుకుంది. అక్కడ ప్రజలకు ఎలాంటి ఫ్రీడమ్ లేదు. వారి స్వేచ్ఛను కట్టుబాటు చేస్తున్నారు. అయితే, రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛతో ప్రజాస్వామ్యయుత పరిస్థితులలో మాన్యుఫాక్చర్ చేసే అల్టర్నేట్ ​మోడల్​ను మనం అందించగలం. ఈ విషయంలో అమెరికా, యూరప్, ఇండియా మధ్య చాలా సహకారం జరగాలి. దీనిపై ముందుకెళ్లే విషయం ఫోకస్​ పెంచాల్సి ఉంది’ అని రాహుల్ అన్నారు.

అన్ని దేశాలతో సంబంధాలు..

రష్యా- ఉక్రెయిన్‌ వివాదంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరితో ప్రతిపక్షాలు పూర్తిగా ఏకీభవిస్తున్నాయని, ఇండియా చాలా పెద్ద దేశం కావడం వల్ల అన్ని దేశాలతో సంబంధాలు ఉంటాయన్నారు. ‘‘ఉక్రెయిన్ సంక్షోభంపై ఇండియా అనుసరిస్తున్న వైఖరికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయని నేను భావిస్తున్నాను. దౌత్యం, చర్చల ద్వారా ఘర్షణను ముగించాలని రష్యా, ఉక్రెయిన్‌లకు ఇండియా చాలాసార్లు పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో పలుమార్లు మాట్లాడి, చర్చలతో వివాదం పరిష్కరించుకోవాలని కోరారు. రష్యా, అమెరికా సహా  ఏ దేశంతోనైనా బంధాలు కలిగి ఉండే హక్కు ఇండియాకు ఉంది” అని అన్నారు.