కెమికల్స్​​ కాదు సేంద్రియమే ఉత్తమం

కెమికల్స్​​ కాదు సేంద్రియమే ఉత్తమం

ప్రస్తుతం ఆహార పదార్థాలు రసాయనాల మయం అవుతున్నాయి. తినే ప్రతి వస్తువులోనూ కెమికల్​ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, పప్పుధాన్యాలు అనే తేడా లేకుండా అన్నింటిపైనా రసాయనాల మోతాదు పెరిగింది. వ్యవసాయంలో ఉత్పత్తి పెంచడానికి చేపట్టిన చర్యల్లో భాగంగానే రసాయనిక పురుగుమందులు, ఎరువులు పంటలపై ప్రభావాన్ని చూపి మానవ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి.

దేశంలో 86% మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అప్పులతో తిప్పలు పడుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అవకాశాలు అందుబాటులో ఉన్నా సమగ్ర వ్యవసాయ విధానాలకు దూరంగా జరిగి నష్టాల సాగుకే ఎక్కువ మంది పరిమితమైపోతున్నారు. సేద్యంలో లాభమైనా, నష్టమైనా మనం అనుసరించే విధానాన్ని బట్టే ఉంటుంది. కానీ చిన్న, సన్నకారు రైతుల నుంచి మధ్యతరగతి రైతుల వరకు సరైన విధానాలు అనుసరించకపోవడంతో ఎదురుదెబ్బలు తింటున్నారు. సాంప్రదాయక వ్యవసాయ విధానంలో పండించిన పంటను తిన్న వారు పూర్తి ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది. కానీ ఆధునిక వ్యవసాయ విధానంలో తీసుకుంటున్న చర్యలు సాంప్రదాయక సాగుపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కార్పొరేట్ రసాయనిక వ్యవసాయ విధానం మనుషుల జీవితాలపై ప్రభావాన్ని చూపుతోంది. ఆహారంలో పోషక విలువలు లేకుండా పోతున్నాయి.

పెరుగుతున్న రసాయనాల వినియోగం

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచాలన్న ఆలోచనతో సాగులో ఆధునిక పద్ధతులను ఎక్కువగా వాడుతున్నారు. పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కూడా చాలా మంది రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకుంటున్నారు. అయితే కొత్త పద్ధతులకు సంబంధించి కావలసిన సహాయ సహకారాలను రైతులు సరిగ్గా పొందలేకపోతున్నారు. పంటలను ఏ పద్ధతుల్లో పండిస్తే మంచి దిగుబడి రావడమే కాక రసాయన రహితంగా ఆహార ఉత్పత్తులు ఉంటాయనేది చెప్పడానికి ఏ అధికారులూ అందుబాటులో ఉండటం లేదు. దీంతో దళారులను, వ్యాపారులను నమ్ముకుని వారు చెప్పిన పద్ధతిలో, వారు ఇచ్చిన రసాయనిక ఎరువులు, పురుగుమందులు చల్లి రైతులు కూడా నష్టపోతున్నారు. సగటు ఉత్పత్తిని పెంచుకోవడానికి కూడా చాలా మంది రైతులు రసాయనిక ఎరువుల వాడకం వైపు చూస్తున్నాడు. దీని వల్ల సమాజానికి నష్టం జరుగుతుందనే ఆలోచన వారికి తట్టడం లేదు.

మళ్లీ సేంద్రియ సాగు రావాలె

సేంద్రియ ఉత్పత్తుల కోసం మళ్లీ పాత పద్ధతులు వాడాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. అయితే లాభసాటిగా లేకపోవడం వల్ల రైతులు సేంద్రియ వ్యవసాయం పట్ల మొగ్గు చూపడం లేదు. సేంద్రియ సేద్యంలో దిగుబడులు తగ్గుతాయని రైతు భావించినంత కాలం రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం కొనసాగుతుంది. సేంద్రియ విధానాలకు ప్రాచుర్యం లభించడం వల్ల ముందు సాగు ఖర్చులు తగ్గి, నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. నేల ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా పర్యావరణానికి ఎలాంటి హానీ కలుగదు. అందువల్ల సేద్యాన్ని లాభసాటిగా మలుచుకోగలిగే విధానాన్ని రైతు రూపొందించుకోవాలి. ఇందుకు కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా వ్యవసాయ నిపుణులు అందించాలి. సేంద్రియ సేద్య పద్ధతులను ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రభుత్వపరంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు వివరించాలి. సాంప్రదాయ సేద్య రీతుల్ని అనుసరించిన రైతుల విజయగాథలను వారికి తెలియజేయాలి. వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రభుత్వపరంగా పంటలను కొనుగోలు చేసేలా చట్టాలు రూపొందిస్తే రైతు ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

సారం కోల్పోతున్న పంట పొలాలు

రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేల సారాన్ని కోల్పోయి రైతుకు ఆశించిన మేర పంట దిగుబడి రావడం లేదు. నిస్సారమైన వ్యవసాయ భూములు, చీడపీడలు, పురుగుమందులు తట్టుకునే శక్తిని సంపాదించుకున్న ప్రతిసారి అంతకంటే గాఢత కలిగిన మందులు చల్లాల్సి వస్తోంది. దేశీయ వంగడాలను వదిలి బీటీ వంటి ఉత్పత్తులను పండించాలని కార్పొరేట్ శక్తులు రైతుపై ఒత్తిడి తేవడం వల్ల కూడా రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. దీని వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు రాకుండాపోతున్నాయని ఆందోళన పెరుగుతోంది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండించే కూరగాయలు, ఆకుకూరలు, ఇతరత్రా పంటలపై కలుషిత నీటి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇటువంటి పంటలను ప్రజలు తినడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమీపంలోని కర్మాగారాల నుంచి విడుదలవుతున్న రసాయనిక పదార్థాలతో భూమి నాణ్యత కోల్పోతోంది. ఇక రసాయనిక వ్యర్థాలను కాల్వల్లో వదిలిపెట్టడం వల్ల దిగువన పంటలకు ఆ నీటినే వాడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు కూడా కలుషితమవుతున్నాయి. ఇప్పటికే 98 శాతం మంది రైతులు పంటలపై విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ప్రత్యామ్నాయం లేక కలుషిత నీటి వనరులను వాడి పంట పండిస్తున్నారు. -డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, పీఆర్వో, ఆర్స్ట్ అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్.

ఇవి కూడా చదవండి..

నేటి యువతకు నేతాజీనే స్ఫూర్తి

కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 న్యూస్ రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు