ORR టోల్ ఫీజు రాత్రికి రాత్రి రూ. 20 కోట్లు పెరగడంతో అధికారుల ఆశ్చర్యం

ORR టోల్ ఫీజు రాత్రికి రాత్రి రూ. 20 కోట్లు పెరగడంతో అధికారుల ఆశ్చర్యం
  • ఔటర్ టోల్ గోల్​మాల్?
  • నెలకు రూ.40 కోట్ల ఇన్​కమ్ వస్తున్నట్టు గతంలో ఈగిల్ సంస్థ రిపోర్టు
  • దాని ఆధారంగా రూ.7,380 కోట్లకే ఐఆర్బీకి 30 ఏండ్ల లీజు 
  • ఇప్పుడు ప్రతినెల రూ.60 కోట్లకు పైగా ఆదాయం 
  • ఇంతమొత్తం ఎట్ల పెరిగిందని హెచ్ఎండీఏ అధికారుల్లో చర్చ 
  • ఈగిల్ తప్పుడు రిపోర్టు ఇచ్చిందా? అని అనుమానాలు 

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టోల్ టెండర్లలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఔటర్​పై టోల్ వసూలుతో నెలకు రూ.40 కోట్ల ఆదాయం వస్తున్నదని గతంలో ఈగిల్ సంస్థ రిపోర్టు ఇవ్వగా, ఔటర్ ను లీజుకు తీసుకున్న ఐఆర్బీ ఇన్​ఫ్రా సంస్థకు మాత్రం ఇప్పుడు నెలకు రూ.60 కోట్లకు పైనే ఆదాయం వస్తున్నది. దీంతో దీనిపై హెచ్ఎండీఏలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.

గతంతో పోలిస్తే ఇంత ఆదాయం ఇప్పుడెలా పెరిగింది? ఈగిల్ సంస్థ తప్పుడు రిపోర్టు ఇచ్చిందా? ఆదాయాన్ని తక్కువ చేసి చూపిందా? ఒకవేళ అప్పట్లోనే రూ.60 కోట్ల దాకా ఆదాయం వచ్చి ఉంటే, మిగిలిన రూ.20 కోట్లు ఏమైనట్టు? అవి ఎవరికి చేరినట్టు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం కేవలం రూ.7,380 కోట్లకే 30 ఏండ్ల పాటు ఔటర్​ను ఐఆర్బీ ఇన్​ఫ్రాకు లీజుకు ఇవ్వడంపై గతంలోనే విమర్శలు రాగా.. ఇప్పుడు ఔటర్​పై టోల్ ఆదాయం భారీగా పెరగడంతో టెండర్లపై మరోసారి చర్చ జరుగుతున్నది. 

గతంలో ఔటర్ పై టోల్​వసూలు నిర్వహణ ఈగిల్ సంస్థ చూసుకునేది. అయితే ఔటర్ ను లీజుకు ఇవ్వాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించగా, టోల్ వసూలుతో నెలకు ఎంత ఆదాయం వస్తున్నదో నివేదిక ఇవ్వాలని ఈగిల్ సంస్థను హెచ్ఎండీఏ అధికారులు కోరారు. నెలకు రూ.40 కోట్ల వరకు ఆదాయం వస్తున్నదని ఆ సంస్థ రిపోర్టు ఇవ్వగా, దాని ఆధారంగా గత ప్రభుత్వం లెక్కలు వేసుకుని ఔటర్ లీజు కోసం టెండర్లు పిలిచింది.

ఇందులో భాగంగా రూ.7,380 కోట్లకు 30 ఏండ్ల పాటు ఔటర్ ను ఐఆర్బీ ఇన్ ఫ్రాకు లీజుకు ఇచ్చింది. అయితే ఐఆర్బీ సంస్థ చేతికి ఔటర్ వెళ్లిన తర్వాత టోల్ ఆదాయం పెరిగిపోయింది. ఆ సంస్థకు పోయినేడాది నవంబర్ లో రూ.56.6 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అలాగే డిసెంబర్ నాటికి ఆదాయం మరో రూ.7 కోట్లు పెరిగి ఏకంగా రూ.63.6 కోట్లకు చేరిందని చెప్పారు. 

అధికారుల ఆశ్చర్యం.. 

ఐఆర్బీ సంస్థ లీజుకు తీసుకున్న తర్వాత ఔటర్ ఆదాయం పెరిగిపోవడంతో హెచ్ఎండీఏ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఆ సంస్థ లీజుకు తీసుకోగానే ఇంత భారీ స్థాయిలో ఆదాయం ఎలా పెరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఐఆర్బీ సంస్థకు నెలకు రూ.60 కోట్లకు పైనే ఆదాయం వస్తుండగా, గతంలో నెలకు రూ.40 కోట్లే ఆదాయం వస్తున్నదని ఈగిల్ సంస్థ నివేదిక ఎందుకు ఇచ్చింది? ఒకవేళ తప్పుడు నివేదిక ఇచ్చిందా? అప్పట్లో లేని ఆదాయం.. 

ఇప్పుడెట్ల పెరుగుతుంది?

మిగిలిన రూ.20 కోట్లు ఏమైనట్టు? అవి గత ప్రభుత్వంలో ఎవరికి చేరేవి? అని అధికారులు చర్చించుకుంటున్నారు. 

మొదట్లోనే వివాదం.. 

ఓఆర్ఆర్ టోల్ టెండర్ల వ్యవహారం అప్పట్లోనే వివాదాస్పదమైంది. అయినప్పటికీ గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఐఆర్బీ ఇన్​ఫ్రా సంస్థకు తక్కువ మొత్తానికే ఔటర్ ను లీజుకు ఇచ్చింది. కేవలం రూ.7,380 కోట్లకే 30 ఏండ్ల పాటు ఔటర్ ను ఐఆర్బీ ఇన్ ఫ్రాకు కట్టబెట్టింది. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. 30 ఏండ్ల పాటు లీజుకు ఇస్తే దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, కానీ బీఆర్ఎస్ తక్కువ మొత్తానికే ఐఆర్బీకి ఔటర్ ను కట్టబెట్టిందని, దీనివల్ల ప్రభుత్వానికి వేల కోట్లలో నష్టం వస్తుందని, ఇందులో అక్రమాలు జరిగాయని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి.
 

ALSO READ :- కవిత మేనల్లుడు శ్రీ శరణ్ చేసే వ్యాపారం ఏంటి? లావాదేవీలు ఏంటి?