
- అడ్డగోలు నిర్ణయాలతో ఉస్మానియా వర్సిటీ ఆగమాగం
- పీహెచ్డీ కోర్సు ఫీజులను ఒకేసారి పదిరెట్లు పెంచిన ఓయూ అధికారులు
- రెండు నెలలుగా స్టూడెంట్లు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవట్లే
- గతంలో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళనలు, నిరసనలపై ఆంక్షలు
- వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్‌గా వర్సిటీ
సికింద్రాబాద్, వెలుగు: ఉద్యమాల గడ్డ, చారిత్రక ఉస్మానియా వర్సిటీ కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. వర్సిటీ అధికారులు తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలను స్టూడెంట్లు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నా.. వాటినే అమలు చేస్తున్నారు. ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న అధికారులు.. వారికి ప్రభుత్వం పెంచిన 30 శాతం జీతాలను ఇప్పటికీ అమలు చేయలేదు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరసనలు, ఆందోళనలపై ఆంక్షలు విధిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. తాజాగా పీహెచ్ డీ కోర్సు ఫీజులను పది రెట్లు పెంచడంపై స్టూడెంట్లు మండిపడుతున్నారు.
పరిశోధనలకు దూరమయ్యే పరిస్థితులు
ఏడేండ్ల తర్వాత పీహెచ్డీ నోటిఫికేషన్ రాగా.. ఎంతో కష్టపడి చదివి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి అర్హత సాధించిన తమపై ఫీజుల పెంపు నిర్ణయం ఆర్థిక భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల భారాన్ని మోయలేని గ్రామీణ ప్రాంత పేద స్టూడెంట్లు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల పరిశోధనలకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని సీనియర్ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. ఫీజుల పెంపును నిరసిస్తూ స్టూడెంట్లు 2 నెలలుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు అప్పు చేసి ఫీజులు చెల్లించి అడ్మిషన్లు పొందగా, మరికొందరు ఇప్పటికీ డీన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
మరెక్కడా లేని విధంగా..
గ్రామీణ ప్రాంత పేద స్డూడెంట్లకు తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అందిస్తుందని ఉస్మానియా యూనివర్సిటీకి పేరుంది. దేశంలోని అనేక వర్సిటీలు పీజీ, పీహెచ్డీ లాంటి కోర్సులకు ఫీజులు పెంచినా.. ఓయూ మాత్రం స్వల్పంగా ఫీజులు పెంచి విద్యను అందించింది. అయితే గత రెండేళ్లుగా ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే పీజీ, ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజులు పెంచిన అధికారులు తాజాగా పీహెచ్డీ కోర్సులకు ఒక్కసారిగా పది రెట్లు ఫీజులు పెంచేశారు. ఆర్ట్స్, సోషల్‌సైన్స్, మేనేజ్మెంట్, లా, ఎడ్యుకేషన్, ఓరియంటల్ లాంగ్వేజెస్ వంటి కోర్సులకు రూ.2 వేలు ఉన్న ఫీజులను అమాంతం రూ.20 వేలుగా.. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు రూ.2,500లు ఉన్న ఫీజును రూ.25 వేలకు పెంచారు. ఈ పెంపు వల్ల పీహెచ్డీ కోర్సులో అడ్మిషన్ పొందిన స్టూడెంట్ తన కోర్సు పూర్తయ్యే నాటికి కేవలం ట్యూషన్ ఫీజుగా రూ.లక్ష నుంచి రూ.లక్షా 25 వేలు చెల్లించాలి. దీనికి అదనంగా హాస్టల్ ఫీజులు, థీసిస్‌కు, ఫీల్డ్‌వర్క్‌కు అదనంగా ఖర్చులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక వర్సిటీలు, ఇనిస్టిట్యూట్ ఫెలోషిప్స్ అందిస్తున్న వర్సిటీల్లో కూడా ఇంత మొత్తంలో ఫీజులు లేవని స్టూడెంట్లు పేర్కొంటున్నారు. ఇనిస్టిట్యూట్ ఫెలోషిప్స్ కూడా ఓయూ అందించడం లేదని, దీంతో పెద్ద మొత్తంలో ఫీజులు ఎలా చెల్లిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే చెల్లిస్తుందంటున్న అధికారులు
దేశంలోని చాలా యూనివర్సిటీలు అనేక రకాల కోర్సుల ఫీజులను పెంచాయి. దీంతో పీహెచ్డీ కోర్సులకు పెంచడం సరైన నిర్ణయమేనని ఉస్మానియా వర్సిటీ అధికారులు అంటున్నారు. చాలా ఏండ్లుగా పీహెచ్డీ అడ్మిషన్ఫీజులు పెంచలేదని, అందుకే ఈ సారి పెంచాల్సి వచ్చిందంటున్నారు. పెంచిన ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే ప్రభుత్వం స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లలో కొంతమందికి మాత్రమే ట్యూషన్ ఫీజులు చెల్లిస్తోంది. అలాంటప్పుడు అడ్మిషన్ పొందిన మిగతా పేద విద్యార్థుల పరిస్థితి ఏంటనే దానిపై అధికారుల నుంచి క్లారిటీ లేదు.
స్టాండింగ్ కమిటీ నిర్ణయంతోనే ఫీజులు పెంచాం
అన్ని విభాగాల డీన్స్, స్టాండింగ్ కమిటీ నిర్ణయం తర్వాతే పీహెచ్డీ కోర్సుల ఫీజులను పెంచాం. ఈ విషయాన్ని స్టూడెంట్లకు ముందే చెప్పాం. వార్షికాదాయం తక్కువగా ఉన్న స్టూడెంట్లు స్కాలర్షిప్, ఫెలోషిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలి.
– ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ,
రిజిస్ట్రార్, ఓయూ పెంచిన ఫీజులు తగ్గించాలి
పీహెచ్డీ కోర్సులకు ఫీజులు పెంచడం వల్ల గ్రామీణ ప్రాంత స్టూడెంట్లపై ఆర్థిక భారం పడుతుంది. ఫీజులను తగ్గించాలని అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఎన్నో ఏండ్ల తర్వాత విడుదలైన పీహెచ్డీ నోటిఫికేషన్లో అర్హత సాధించి సీటు పొందినా.. పెంచిన ఫీజుల కారణంగా పేద స్టూడెంట్లు కోర్సులో చేరలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు స్పందించి ఫీజులను తగ్గించాలి.
– నెల్లి సత్య, రీసెర్చ్ స్టూడెంట్, ఓయూ