మ‌న పోరాటం వ్యాధిపైనే.. వ్య‌క్తుల‌పై కాదు

మ‌న పోరాటం వ్యాధిపైనే.. వ్య‌క్తుల‌పై కాదు

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన‌ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ వైర‌స్ వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి తోటివారు తుమ్మినా ద‌గ్గినా జ‌నం విచిత్రంగా చూస్తున్నారు. కొన్ని చోట్ల‌ ఈ వైర‌స్ బారిన‌ప‌డి… చికిత్స పొందిన త‌ర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వ‌చ్చిన వారిని ఇరుగు పొరుగు పూర్తిగా దూరం పెడుతున్నారు. ఆ కుటుంబాన్ని అంట‌రానివారిలా చూస్తున్నారు. ఈ ప‌రిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం స్పందించింది. క‌రోనా వైర‌స్ గురించి ప్ర‌జ‌లు అన‌వ‌స‌ర భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని కోరారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్. ప్ర‌పంచమంతా కరోనా మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తోంద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

కోలుకున్న వారితో ప్రమాదం లేదు

ప్ర‌స్తుతం స‌మాజం పోరాటం క‌రోనా వ్యాధిపైనే కానీ దాని బారిన‌ప‌డిన వ్య‌క్తుల‌పై కాద‌ని చెప్పారు ల‌వ్ అగ‌ర్వాల్. క‌రోనాపై ప్ర‌జ‌లు లేనిపోని భ‌యాల‌తో దాడుల‌కు పాల్ప‌డొద్ద‌ని కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్నారు. క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి ద్వారా వైర‌స్ వ్యాపించ‌ద‌ని, వాస్త‌వాని వారి ప్లాస్మా ద్వారా పేషెంట్ల‌కు చికిత్స అందించి మ‌రిన్ని ప్రాణాల‌ను నిల‌బెట్టొచ్చ‌ని చెప్పారు. దీనిని ప్ర‌జ‌లంతా అర్థం చేసుకోవాల‌ని కోరారు. అలాగే డాక్ట‌ర్లు, శానిటేష‌న్ వ‌ర్క‌ర్లు, పోలీసులు త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా మ‌న‌కు సేవ చేస్తున్నార‌ని, వారిపై దాడులు చేయ‌డం త‌గ‌ద‌ని చెప్పారు. ఎవ‌రైనా దాడుల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

28 రోజులుగా 16 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్

భార‌త్ లో ప్ర‌స్తుతం క‌రోనా పేషెంట్ల రిక‌వ‌రీ 22.17 శాతంగా ఉంద‌ని చెప్పారు ల‌వ్ అగ‌ర్వాల్. గ‌డిచిన 14 రోజుల్లో దేశంలోని 25 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో కొత్త‌గా ఒక్క క‌రోనా కేసు కూడా రాలేద‌ని తెలిపారు. 16 జిల్లాల్లో 28 రోజులుగా కొత్త కేసులు న‌మోదుకాలేద‌న్నారు.