మైనారిటీ గురుకులాల్లో ప్రిన్సిపాళ్లపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం

మైనారిటీ గురుకులాల్లో ప్రిన్సిపాళ్లపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం
  • అకాడమిక్ కో ఆర్డినేటర్లు, విజిలెన్స్ ఆఫీసర్ల ఇష్టారాజ్యం
  • గత బీఆర్ఎస్  సర్కారు హయాంలో వారి నియామకం
  • రెగ్యులర్  ఎంప్లాయీస్ పై బయటివారి అజమాయిషీ ఏమిటని ప్రిన్సిపాళ్ల ఆవేదన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్  గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్  సర్కారు హయాంలో అకాడమిక్  కో ఆర్డినేటర్, విజిలెన్స్  ఆఫీసర్ల పేరిట ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులు.. తనిఖీల పేరిట బెదిరింపులకు దిగడం, క్లాసుల టైంలో వచ్చి టీచర్లతో గంటల తరబడి మీటింగ్స్  పెట్టడం, వారి జాబ్ చార్ట్ లో లేని అధికారాలను చలాయించడం వివాదాస్పదంగా మారింది. మైనారిటీ గురుకులాలను తనిఖీలు చేసేందుకు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్  మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ (డీఎండబ్ల్యూఓ), రీజినల్  లెవల్  కో ఆర్డినేటర్ ఉన్నప్పటికీ.. అకాడమిక్  కో ఆర్డినేటర్, విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులు ఎందుకనే చర్చ కూడా జరుగుతోంది. అంతేకాకుండా  గ్రూప్ 2 స్థాయిలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగం సాధించిన తమపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అజమాయిషీ ఏమిటని ప్రిన్సిపాళ్లు ప్రశ్నిస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన మైనారిటీ గురుకులాల్లో ప్రిన్సిపాళ్లకే  కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్  చేస్తున్నారు.

రిటైర్డ్ ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగం

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల సొసైటీల్లో లేని అకాడమిక్  కో ఆర్డినేటర్లు, విజిలెన్స్ ఆఫీసర్లను కేవలం మైనారిటీ వెల్ఫేర్  గురుకులాల్లోనే గత బీఆర్ఎస్  సర్కారు నియమించింది. గతంలో పోలీస్, సంక్షేమ శాఖల్లో పనిచేసి రిటైర్  అయిన వారితో విజిలెన్స్  ఆఫీసర్  పోస్టులను ఔట్ సోర్సింగ్  పద్ధతిలో భర్తీ చేసింది. అలాగే డిగ్రీ అర్హత కలిగిన వారిని అకాడమిక్  కో ఆర్డినేటర్లుగా నియమించింది. ఇలా జిల్లాకొకరి చొప్పున 33 జిల్లాలకు 33 మందిని అకాడమిక్  కో ఆర్డినేటర్లను, 33 మంది విజిలెన్స్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.34 వేల చొప్పున జీతం, వెహికల్  అలవెన్స్ కలిపి రూ.లక్షకుపైగా చెల్లిస్తున్నారు. వారిలో అకాడమిక్  రంగంతో సంబంధం లేనివారే ఎక్కువగా ఉన్నారు. టీచర్  ట్రైనింగ్ కోర్సు చదవని అకాడమిక్  కో ఆర్డినేటర్లు చివరికి పేపర్  కరెక్షన్ ఎలా చేయాలో కూడా ట్రెయిన్డ్  టీచర్లకు ఆదేశాలు, సూచనలు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో దందా

మైనారిటీ గురుకులాలను తరచూ తనిఖీ చేసే విజిలెన్స్ ఆఫీసర్లు.. హాస్టళ్లలో ఆహారం, పారిశుద్ధ్యం విషయంలో చిన్నచిన్న లోపాలను కూడా ఎత్తిచూపి హెడ్డాఫీసుకు రిపోర్టు ఇస్తామంటూ ప్రిన్సిపాళ్లను బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని గురుకులాల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్  పోస్టులను ఔట్ సోర్సింగ్  పద్ధతిలో భర్తీచేసే త్రిసభ్య కమిటీలో విజిలెన్స్ ఆఫీసర్లు సభ్యులుగా ఉంటున్నారు. ఇందులోనూ వారి పెత్తనమే ఎక్కువగా ఉంటోందని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుడు ఆగస్టులో ఎలక్ట్రీషియన్, డిప్యూటీ పోస్టుల భర్తీకి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో కరీంనగర్  విజిలెన్స్ ఆఫీసర్  అక్రం పాషాను ఉద్యోగం నుంచి తొలగించారు.