
- ఔట్ సోర్సింగ్ చేతుల్లో!
- తహసీల్దార్, ఎంపీడీవోల నుంచి ఐఏఎస్‌ల దాకా అందరి వద్దా వీళ్లదే కీ రోల్
- ఐడీ, పాస్‌వర్డులూ వీరికి షేర్ చేస్తున్న కొందరు ఆఫీసర్లు
- ధరణి పోర్టల్‌ను రూపొందించిన ఐటీ ఏజెన్సీ చేతుల్లోనే ఆపరేటర్లు
- ఐటీ సేవలన్నింటినీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకే అప్పగిస్తున్న ప్రభుత్వం
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనతో తెరపైకి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారం
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవా నడుస్తున్నది. పేరుకు చిన్న జీతం, చిన్న కొలువులా కనిపించినా.. చాలా ప్రభుత్వ శాఖల్లోని ముఖ్య సమాచారం వీరి చేతుల్లో ఉంటున్నది. తహసీల్దార్, ఎంపీడీవోల నుంచి ఐఏఎస్‌ల దాకా అందరి దగ్గర వీళ్లే కీలకంగా మారారు. వీళ్లలో కొందరు ఉద్యోగులు ఆఫీసర్లకు ఆసరాగా ఉంటూనే తమపని కానిచ్చేస్తున్నారు. టెక్నికల్ విషయాల్లో ఆఫీసర్ల అవగాహన లేమిని అదనుగా చేసుకుని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఆఫీసర్లు ఎంతో నమ్మకంతో షేర్ చేసిన ఐడీ, పాస్ వర్డులనూ కొందరు ఆపరేటర్లు దుర్వినియోగం చేస్తున్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ రాజశేఖర్ రెడ్డిదే కీలక పాత్ర కావడంతో వివిధ ముఖ్యమైన శాఖలకు ఉద్యోగులను సమకూరుస్తున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై రాష్ట్రంలో చర్చ సాగు తున్నది. ల్యాండ్ రికార్డులు, కీలకమైన డాక్యుమెంట్ల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏండ్లుగా ఔట్ సోర్సింగే..
రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో పేపర్ రహిత ఈ– పాలన నడుస్తున్నది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఎంఎస్ వర్డులో, ఎక్సెల్ షీట్‌లో రిపోర్టులు పంపడం, పీపీటీలు రూపొందించడం లాంటి పనులను కింది స్థాయి ఆఫీసర్లు డిక్టేట్ చేస్తూ డేటా ఎంట్రీ ఆపరేటర్లతో చేయిస్తున్నారు. దీంతో ఆయా పనులకు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నీషియన్ల అవసరం పెరిగింది. ప్రభుత్వం ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాల్సి ఉండగా.. పది, పదిహేనేండ్లుగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే తీసుకుంటున్నది. ఇలా మండల స్థాయిలో తహసీల్దార్ ఆఫీసుల్లో ధరణి ఆపరేటర్లుగా, ఎంపీడీఓ ఆఫీసుల్లో ఈ - పంచాయతీ ఆపరేటర్లుగా, విద్య, వైద్యం, వ్యవసాయం, బీసీ, ఎస్సీ, గిరిజన, స్టాటిస్టిక్స్ తదితర డిపార్ట్ మెంట్ల ఆఫీసర్ల దగ్గర కంప్యూటర్ ఆపరేటర్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే పని చేస్తున్నారు.
రెవెన్యూ శాఖలో వీళ్లదే హవా
రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. మాన్యువల్‌గా ఉన్న రికార్డులన్నింటినీ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎల్ఆర్ఎంఎస్) అనే పోర్టల్‌లో ఎంట్రీ చేశారు. ఇదే పోర్టల్ తర్వాత ధరణిగా అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్ నిర్వహణను ప్రభుత్వం అప్పట్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ఎఫ్ఎస్) అనే సాఫ్ట్‌వేర్ సంస్థకు అనుబంధంగా ఉన్న టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు అప్పగించింది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే నాటికే అన్ని తహసీల్దార్, కలెక్టరేట్, సీసీఎల్ఏ ఆఫీసుల్లో 600 మంది ధరణి ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. వీళ్లను టెర్రాసిస్ కంపెనీలో మెయిన్ డైరెక్టర్‌కు చెందిన ఈ– సెంట్రిక్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా రిక్రూట్ చేసుకోగా, పారాడిగ్మ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ద్వారా జీతాలు ఇస్తున్నారు. ఈ కంపెనీలోనూ టెర్రాసిస్‌లో, ఈ–సెంట్రిక్ లో డైరెక్టర్ గా ఉన్న వ్యక్తే మెయిన్ డైరెక్టర్‌గా ఉండడం గమనార్హం. ప్రస్తుతం తహసీల్దార్ ఆఫీసు నుంచి సీసీఎల్ఏ వరకు భూరికార్డుల నిర్వహణలో ధరణి ఆపరేటర్ల పాత్ర కీలకంగా మారింది. ఇదే అదనుగా వారు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రజలు వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం మీ సేవలో అప్లై చేసుకుటే చాలా చోట్ల ఆఫీసర్ల యూజర్ ఐడీ, పాస్ వర్డు తీసుకుని వీళ్లే ఓకే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాది కాలంలోనే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి, మెదక్ జిల్లా కౌడిపల్లి తహసీల్ ఆఫీసుల్లో ధరణి ఆపరేటర్లు ఏసీబీకి చిక్కిన ఘటనలు వీరి దందాను వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూముల డేటా ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారింది. భవిష్యత్‌లో ఎప్పుడైనా భూరికార్డుల ట్యాంపరింగ్ జరిగితే బాధ్యులు ఎవరని, సామాన్య రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘‘ఔట్‌సోర్స్, ఇన్‌సోర్స్, మన్నుసోర్స్, మశానం సోర్స్ అని పెట్టిన్రు. నిజంగా ఏదైనా వారం రోజులో, నెల రోజులో చేసే పనైతే టెంపరరీగా చేయిస్తే తప్పులేదు. కానీ సంవత్సరాల తరబడి చేసే ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అని పేరు పెట్టి అర్ధాకలితో చంపుతున్నరు. తెలంగాణలో అట్లా ఉండొద్దని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ మేం రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నం’’
- 2017 మార్చిలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
పోర్టల్స్ నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు కంపెనీలకే
ఐటీ రంగంలో మేటి అని ప్రచారం చేసుకుంటున్న రాష్ట్రంలో వివిధ శాఖలకు సాఫ్ట్ వేర్లు, పోర్టల్స్ రూపకల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఐటీ కంపెనీలకే అప్పగిస్తున్నది. పైకి టీఎస్ టీఎస్ ద్వారా వివిధ పోర్టల్స్ కు రూపకల్పన చేసినట్లు ప్రకటిస్తున్నా.. టీఎస్ టీఎస్ దగ్గర సొంత వనరులు, సిబ్బంది లేకపోవడంతో ఇతర ఐటీ కంపెనీలపై ఆధారపడుతున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్ సైట్లు, పోర్టల్స్ ను రూపొందించడం, మెయింటైన్ చేయడం ఇతర కంపెనీలకే అప్పగిస్తున్నది. మెజార్టీ ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్స్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ సంస్థలు మెయింటైన్ చేస్తున్నాయి. కానీ అత్యంత కీలకమైన భూరికార్డుల నిర్వహణకు సంబంధించి ధరణి పోర్టల్ ను ఐఎల్ఎఫ్ఎస్‌కు అప్పగించడంపై గతంలోనే విమర్శలు వెల్లువెత్తాయి.