భార‌త్‌లో కోటి దాటిన క‌రోనా టెస్టులు.. ఐదు రోజుల్లో ప‌ది ల‌క్ష‌ల ప‌రీక్షలు

భార‌త్‌లో కోటి దాటిన క‌రోనా టెస్టులు.. ఐదు రోజుల్లో ప‌ది ల‌క్ష‌ల ప‌రీక్షలు

దేశంలో ఇప్పటి వ‌ర‌కు చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య కోటి దాటాయ‌ని భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్‌) తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,80,596 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 24,248 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా కోటి4 వేల 101 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా 6,97,413 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని ఐసీఎంఆర్ పేర్కొంది. గ‌డిచిన 14 రోజుల్లో స‌గ‌టున రోజుకు 2 ల‌క్ష‌ల 15 వేల 655 శాంపిల్స్ చొప్పున పరీక్షించిన‌ట్లు తెలిపింది. గ‌డిచిన ఐదు రోజుల్లో ప‌ది ల‌క్ష‌ల టెస్టులు చేసిన‌ట్లు చెప్పింది.

భారీగా పెరిగిన టెస్టింగ్ సామ‌ర్థ్యం

దేశంలో క‌రోనా టెస్టుల సామ‌ర్థ్యం భారీగా పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,105 క‌రోనా టెస్టింగ్ ల్యాబ్స్‌ ఐసీఎంఆర్ ఆమోదం పొందాయి. వీటిలో 788 ప్ర‌భుత్వ ల్యాబ్స్, 317 ప్రైవేటు ల్యాబ్స్ ఉన్నాయి. ఈ మొత్తంలో 592 ఆర్టీ పీసీఆర్ ల్యాబ్స్, 421 ట్రూనాట్ ల్యాబ్స్, 92 సీబీ నాట్ ల్యాబ్స్ అని ఐసీఎంఆర్ తెలిపింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డంతో పాటు వైర‌స్ సోకిన వారి ప్రాణాల‌ను కాపాడేందుకు ఉన్న ఏకైక మార్గం టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానం మాత్ర‌మేన‌ని, దీనిని ప‌క్కాగా అమ‌లు చేయాల‌ని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు సూచించింది. అన్ని రాష్ట్రాలు టెస్టింగ్ కెపాసిటీని పెంచాల‌ని, క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న ప్ర‌తి వ్య‌క్తికి టెస్టు చేయించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. కాంటాక్ట్ ట్రేసింగ్ మెకానిజం, కంటైన్మెంట్ చ‌ర్చ‌ల‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని సూచించింది ఐసీఎంఆర్. అలాగే అన్ని ఆస్ప‌త్రులు ర్యాపిట్ యాంటీ జెన్ టెస్టులు చేయాల‌ని, అందులో క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండి నెగ‌టివ్ వ‌చ్చిన వారిని ఆర్టీ పీసీఆర్ టెస్టు త‌ప్ప‌నిస‌రి అని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా టెస్టింగ్‌లో టాప్ – 5 రాష్ట్రాలు: త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌.