అకాల వర్షం..అన్నదాత ఆగం..

అకాల వర్షం..అన్నదాత ఆగం..
  • బోధన్ సెగ్మెంట్​లో తడిసిన వడ్లు
  • ఎడపల్లిలో మొలకెత్తిన 4 వేల క్వింటాళ్ల ధాన్యం
  • ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో నేలవాలిన వరి పంట
  • తడిసిన వడ్లు కొంటామని  కలెక్టర్ భరోసా  

నిజామాబాద్, వెలుగు:  మొంథా తుఫాన్​ ప్రభావంతో కురిసిన అకాల వర్షం  రైతులను కన్నీరు పెట్టిస్తోంది.  బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లారేదాకా వర్షం కురిసింది. అమ్మేందుకు సిద్ధం చేసిన వడ్లు తడువగా, చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. వాతావరణ పరిస్థితుల వల్ల కాంటా వేయాల్సిన వడ్లు మొలకెత్తడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి బోధన్​ సెగ్మెంట్​లోని మూడు మండలాల్లో పర్యటించారు. రైతులు ఆందోళన చెందవద్దని తడిసిన ధాన్యాన్ని కొంటామని రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గోవింద్​ ఆర్మూర్ డివిజన్​లో పర్యవేక్షించి పంట నష్టం వివరాలను సేకరించారు.

బిక్కుబిక్కుమంటున్న రైతులు..

మొంథా తుఫాన్ సమాచారం తెలిసినప్పటి నుంచి జిల్లా రైతులు బిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు.  రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో  మంగళవారం నుంచి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నిలిపివేశారు. వడ్ల లోడింగ్​, అన్​లోడింగ్​ ఆగిపోవడంతో కొనుగోలు సెంటర్లలోనే వడ్ల కుప్పలు ఉండగా వాటిని కాపాడుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.  

బోధన్, రూరల్​ సెగ్మెంట్​లోని మండలాల్లో ఆరబెట్టిన వడ్లు మళ్లీ తడిసి మొలకెత్తాయి.  ఎడపల్లి మండలంలో సుమారు 4 వేల బస్తాల వడ్లు మొలకలు రావడంతో అన్నదాతలు కన్నీరుపెడుతున్నారు.  

రెండోసారి దాడి..

జిల్లాలో వానాకాలం 5.60 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, ఆగస్టు చివరలో కురిసిన భారీ వర్షాలకు 28,131 ఎకరాల పంట నష్టం వాటిల్లింది.  4.42 లక్షల ఎకరాల్లో సాగైన వరి సాగు కాగా,  నెల రోజులుగా వరి కొస్తున్నారు. రెండోసారి వర్షం కురువడంతో ఆర్మూర్​, బాల్కొండ, రూరల్ సెగ్మెంట్ లోని మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నీటమునిగింది. వరి పంట నేలవాలి గింజలు రాలిపోయాయి. 

తడిసిన వడ్లు కొంటాం

తుఫాన్​ ప్రభావంతో తడిసిన వడ్లు కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు.  ధాన్యం ఆరబెట్టాక కాంటాలు పెట్టించి బాయిల్డ్​ రైస్​ మిల్స్​కు పంపుతాం. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు జాగ్రత్తలు పాటించాలి. వడ్ల కుప్పలు, బస్తాలపై టర్పాలిన్లు కప్పుకోవాలి.
‌‌- వినయ్​కృష్ణారెడ్డి, కలెక్టర్​

జిల్లాలో భారీ వర్షం  ​

జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లారే దాకా భారీ వర్షం కురిసింది. ఆలూర్​లో అత్యధికంగా 144 మి.మీ, ఆర్మూర్ 131,  కమ్మర్​పల్లి మండలంలో 117 మి.మీ,  నందిపేట మండలంలో 113,  కమ్మర్​పల్లిలో 107, డొంకేశ్వర్​లో 98, భీంగల్​ 95.4, వేల్పూర్94.9, జక్రాన్​పల్లి 92.8, నవీపేట 92.6, బాల్కొండ 84, మోర్తాడ్​ 83.4, మాక్లూర్​ 74, ముప్కాల్​ 71.9, నిజామాబాద్ రూరల్​లో 60.9, డిచ్​పల్లి 58, సిరికొండ 56.1, ధర్పల్లి 53.9,  ​ ఎర్గెట్ల 52 మి.మీల వర్షం పడింది. మొత్తం 33 మండలాల్లో 1739 మి.మీ వర్షం కురవగా ఏవరేజ్ వర్షాపాతం 52.7 మి.మీలు నమోదైంది.