పడిపోతున్న భూగర్భ జలాలు.. సాగునీటి కోసం..రైతుల తండ్లాట!

పడిపోతున్న భూగర్భ జలాలు.. సాగునీటి కోసం..రైతుల తండ్లాట!
  •    పడిపోతున్న భూగర్భ జలాలు.. ‘సాగర్‘ ​నీళ్లూ వచ్చే చాన్స్​ లేదు
  •     ఎండుతున్న పంటలు.. తూములు ఓపెన్​ చేసేందుకు రైతుల యత్నం
  •     అడ్డుకునేందుకు తూముల దగ్గర లష్కర్లు కాపలా
  •     సాగర్ నీళ్లు తాగు అవసరాలకే అంటున్న అధికారులు

నేలకొండపల్లి మండలం ఆచార్యగూడెంకు చెందిన రైతు చిర్రా లక్ష్మయ్య తనకున్న ఎకరంన్నర భూమిలో రూ.40 వేల పెట్టుబడి పెట్టి వరి సాగు చేశాడు. బావిలో నీరు, సాగర్​కాల్వ నీటిని నమ్ముకొని పంట వేశాడు. కానీ 20 రోజుల వరకే నీరు సరిపోయింది. బావిలో నీళ్లు లేక, కాల్వ నీరు రాక ఎండిన పంటను పశువుల మేతగా మేపాడు. సాగర్​ఆయకట్టు కింద చాలా మంది రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. 

ఖమ్మం, వెలుగు :  నాగార్జునసాగర్ ఆయకట్టు కింద పొలాలు సాగు చేసుకున్న రైతులు, ఆ పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నారు. ఒక పక్క భూగర్భ జలాలు పడిపోతుండడం, మరోపక్క సాగర్​ నీళ్లు వచ్చే అవకాశం లేక తలలు పట్టుకుంటున్నారు. బోర్లు,  బావుల్లో నీరు లేకపోవడంతో ఏదో రకంగా సాగర్ నీటిని రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు జిల్లాలకు తాగునీటి కోసం సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్​ కు రిలీజ్ చేసిన నీటిని రైతులు దారి మళ్లించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. 

సాగర్​ నుంచి ప్రధాన కాల్వ ద్వారా వస్తున్న నీటిని తూములు తెరిచి నీటిని మళ్లించుకునేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా, వారిని అడ్డుకునేందుకు నీటిపారుదల శాఖ  అధికారులు ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల కింద పాలేరు పాత కాల్వ దగ్గర గేట్లను రైతులు బలవంతంగా ఎత్తగా పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతల మధ్య అదే రోజు సాయంత్రానికి గేట్లను బంద్​ చేయించారు. మళ్లీ రెండ్రోజుల కింద తూములను ఓపెన్​ చేసే ప్రయత్నం చేయగా కూసుమంచి పోలీసులు వారి నుంచి రేంచీలు, పానాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సాగర్​ కాల్వలపై డ్యూటీలు చేసే లష్కర్లకు రాత్రి, పగలు తూముల దగ్గర పక్కాగా కాపలా ఉంటున్నారు. 

ఆయకట్టు కింద ఈసారి లక్షన్నర ఎకరాల్లో సాగు.. 

సాగర్​ ఆయకట్టు కింద ఖమ్మం జిల్లాలోని 17 మండలాల్లో రెండున్నర లక్షల ఎకరాల భూములున్నాయి. ఈ ఏడాది వర్షాల్లేకపోవడం, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువ నుంచి కూడా వరద రాకపోవడంతో శ్రీశైలం, సాగర్​ ప్రాజెక్టుల్లో నీరు డెడ్​ స్టోరేజీకే పరిమితమయ్యాయి. దీంతో ఆయకట్టు రైతులు ఈసారి ఆరు తడి పంటలు వేసుకోవాలని ముందుగానే అధికారులు సూచించారు. అయినా దీనిపై విస్తృతంగా ప్రచారం చేయకపోవడంతో రైతులు నార్లుపోసుకున్నారు. తమ బోర్లు, బావుల్లో ఉన్న నీటితో పాటు మూడు నాలుగు తడులైనా సాగర్​ నీళ్లు రాకపోతాయా అంటూ వరి సాగు చేశారు. 

ఈ సీజన్​ లో ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1,56,406 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 85,408 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇంకా 50,317 ఎకరాల్లో వరి నార్లు పోసి ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా 60,082 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మరో 7,361 ఎకరాల్లో పెసర్లు సాగయ్యాయి. మిగతా పంటలన్నీ వందల ఎకరాల్లోపు సాగు చేశారు.

రైతుల రెక్వెస్.. 

ఇటీవల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్​ జిల్లాలకు తాగునీరు అందించేందుకు గాను పాలేరు రిజర్వాయర్​ కు సాగర్​ నుంచి నీటిని విడుదల చేశారు. సాగర్​ నుంచి 3,800 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినా, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తూములు, కాల్వల్లో నీటిని రైతులు విడుదల చేసుకోవడంతో 400 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చింది. మొత్తం 1.5 టీఎంసీల నీరు కేటాయించి విడుదల చేయగా 0.7 టీఎంసీలు మాత్రమే పాలేరు రిజర్వాయర్​ కు చేరినట్లు తెలుస్తోంది. 

ఇవి కేవలం తాగునీటికి ఉపయోగించినా సమ్మర్​ సీజన్​ మొత్తం సరిపోవని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం తమ పంటలను కాపాడేందుకు మూడు, నాలుగు తడుల కోసం నీటిని రిలీజ్​ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

పాలేరు పాత కాల్వలకు నీటిని విడుదల చేయాలి

పాలేరు పాత కాల్వ ఆయకట్టు కింద ఆరు ఎకరాల్లో వరి పంటేసిన. బోర్లు, బావుల్లో  నీళ్లు తగ్గినయ్. పంటకు నీళ్లు చాలక ఎండుతోంది. పాలేరు పాత కాల్వ నుంచి కనీసం ఐదు రోజులు నీళ్లను విడిస్తే వందలాది మంది  రైతులకు మేలు చేసినట్లే. 
 
శ్రీనివాసరెడ్డి, రైతు, జక్కేపల్లి