రైతులకు తడిసి మోపెడవుతున్న సుతిలీలు, టార్పాలిన్లు, హమాలీ చార్జీలు

రైతులకు తడిసి మోపెడవుతున్న సుతిలీలు, టార్పాలిన్లు, హమాలీ చార్జీలు

మహబూబ్​నగర్, వెలుగు: వరి సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడులు పోను ఏమి మిగలడం లేదు. పంటను కోసింది మొదలు అమ్ముకునే దాకా ప్రతి దానికి పైసలు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు.  ప్రభుత్వం వడ్ల సెంటర్ల వద్ద సౌలతులు కల్పించకపోవడంతో ఖర్చులన్నీ రైతులే పెట్టుకుంటున్నారు. సుతిలీలు, టార్పాలిన్లు తెచ్చుకోక తప్పడం లేదు. మిల్లర్లు వివిధ కారణాలు చూపుతూ తరుగు తీయడంతో నష్టపోతున్నారు.

నష్టాలన్నీ రైతులపైనే..

మహబూబ్​నగర్​ జిల్లాలో 190 ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల ద్వారా వడ్లను కొంటున్నారు. అయితే వడ్లను జోకే సమయంలో నిర్వాహకులు రైతులకు కొర్రీలు పెడుతున్నారు. కాంటా చేసిన వడ్ల సంచులను మిల్లులకు తరలిస్తే తాలు, తేమ పేరుతో మిల్లర్లు క్వింటాల్​పై మూడు, నాలుగు కిలోలు తరుగు తీస్తున్నారని, ఈ భారం తమపై పడుతుందని ఆ నష్టాన్ని రైతులపై రుద్దుతున్నారు. ఈ క్రమంలో వడ్ల సెంటర్ల వద్ద కాంటాలు చేసే సమయంలోనే బస్తాకు 40 కిలోల వడ్లు నింపాల్సి ఉండగా, ఒక్కో సెంటర్​లో ఒక్కో తీరుగా వడ్లు జోకుతున్నారు. మహబూబ్​నగర్​ మండలంలో బస్తాకు 42 కిలోలు, హన్వాడ, మిడ్జిల్​ మండలాల్లో బస్తాకు 41 కిలోలు జోకుతుంటే, అడ్డాకుల మండలంలో బస్తాకు 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. ఇలా క్వింటాల్​పై ప్రతి సెంటర్​లో మూడు నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు.  

సుతిలీలు కొంటున్నరు..

వడ్లను జోకి వాటిని గోనె సంచుల్లో వేసి కుట్టేందుకు సుతిలీలను, రైతులు తెచ్చిన వడ్లను ఆరబెట్టేందుకు టార్పాలిన్లను గతంలో సెంటర్లే రైతులకు ఫ్రీగా సమకూర్చేవి. 2021లో ఆయా జిల్లాల మార్కెటింగ్​ శాఖలు సప్లై చేయాలని సర్క్యూలర్​ వచ్చింది. ప్రస్తుతం సెంటర్లకు సుతిలీలు, టార్పాలిన్లు సప్లై చేయడం లేదు. 50 వడ్ల బస్తాలు కుట్టేందుకు కిలో సుతిలీ అవసరం కావడంతో, రైతులు రూ.140 పెట్టి బయటి నుంచి కొంటున్నారు. సెంటర్ల వద్ద టార్పాలి న్లు అందుబాటులో ఉన్నా.. అవి కాంటా చేసిన వడ్ల మీద కప్పడానికే వాడుతున్నారు. కాంటా చేయని వడ్ల కోసం రైతులే బయటి నుంచి టార్పాలిన్లు కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఇందుకు గాను రోజుకు ఒక్కో చోట రూ.20 నుంచి రూ.30 చెల్లిస్తున్నారు.

క్వింటాల్​కు హమాలీ చార్జి రూ.50 పైనే..

హమాలీ చార్జీలను కూడా పెంచేశారు. రూల్​ ప్రకారం క్వింటాల్​ వడ్లను సంచుల్లో ఎత్తితే రూ.5.65 తీసుకోవాల్సి ఉంది. కానీ ఎక్కడా ఈ రూల్​ పాటించడం లేదు. జిల్లాలోని అన్ని సెంటర్ల వద్ద హమాలీలు 40 కిలోల బస్తా ఎత్తినందుకు రూ.20 నుంచి రూ.23 వరకు, ఇలా క్వింటాల్ బస్తా ఎత్తితే రూ.50 వరకు రైతుల నుంచి తీసుకుంటున్నారు. హమాలీ పైసలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తే, వారి సంచులను లారీల్లోకి ఎత్తకుండా లేట్​ చేస్తున్నారు. 

రూ.4 వేలు అయినయ్..

నాకున్న నాలుగు ఎకరాల్లో వరి వేసిన. 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్​ను రూ.2,050 చొప్పున సొసైటీలో అమ్మిన. వడ్లు లారీల్లోకి ఎక్కించేందుకు 40 కిలోల బస్తాకు రూ.20 చొప్పున క్వింటాల్​కు రూ.50 హమాలీ కింద చెల్లించిన. కేవలం హమాలీ ఖర్చులే రూ.4 వేల దాకా అయినయ్.    - రాములు, రైతు, మిడ్జిల్


పరేషాన్ అవుతున్నాం

వరి పంట పండించి అమ్ముకునేందుకు కష్టాలు పడుతున్నాం. 40 కిలోల వడ్లకు రెండు కిలోల తరుగు తీస్తున్నారు. ప్రతి ఒక్కరూ రైతునే ముంచుతున్నారు. మళ్లీ వరి పంట వేయాలంటేనే భయమేస్తుంది. అసలు ఈ పంటలేయడం వద్దు. పరేషాన్​ కావడం వద్దనిపిస్తోంది. 
- బేడి గోపాల్, రైతు, మహమ్మదాబాద్