ఓం శాంతి.. పద్మశ్రీ అవార్డు గ్రహీత 'అమ్మ' కన్నుమూత

ఓం శాంతి.. పద్మశ్రీ అవార్డు గ్రహీత 'అమ్మ' కన్నుమూత

శక్తి దేవాలయాల గర్భగుడిలో మహిళలు పూజలు చేసుకునేందుకు వీలుగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన 'అమ్మ'గా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగలర్(82) అక్టోబర్ 19న అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళనాడులోని మేల్మరువత్తూరులో తన నివాసంలో ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఆధ్యాత్మిక గురువుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన దేశానికి చేసిన ఆధ్యాత్మిక సేవలకు గాను 2019లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.

'అమ్మ' బంగారు అడిగలర్‌ కన్నుమూయడం పట్ల తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "గొప్ప ఆధ్యాత్మిక గురువు, విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంస్కరణలకు ఆయన చేసిన కృషి మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!" అని గవర్నర్ అన్నారు.

అడిగలర్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, ఆయన సేవలకు నివాళులు అర్పిస్తూ ఆధ్యాత్మిక నాయకుడి అంత్యక్రియలకు రాష్ట్ర గౌరవాన్ని ప్రకటించారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత డీఎంకే పార్టీ అన్ని కులాల వారికి దేవాలయాల్లో పూజారులుగా ఉండేలా అధికారం ఇచ్చినప్పుడు, బంగారు అడిగలర్‌ చేసిన ఆధ్యాత్మిక విప్లవం, ఆలయాల గర్భ గ్రహంలో మహిళలను పూజ చేసేందుకు అనుమతించడం అభినందనీయమని స్టాలిన్‌ అన్నారు. బంగారు అడిగలర్ సామాజిక ప్రయోజనం కోసం ఆధ్యాత్మికతను విప్లవాత్మకంగా మార్చారన్న ఆయన.. గర్భగుడి లోపల ప్రార్థన చేయడానికి మహిళలకు అనుమతించేందుకు చాలా కృషి చేశారని ఎంకే స్టాలిన్ అన్నారు.

బంగారు అడిగలర్ ఎవరు?

ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన బంగారు అడిగలర్‌కు ఆధ్యాత్మికత పట్ల అపారమైన మక్కువ ఉండేది. ఇది అతనిని ఆరాధన, సోది, ఆధ్యాత్మిక సేవ కోసం ఎక్కువ సమయం కేటాయించడానికి దారితీసింది. ఇది కాలక్రమంలో ఆయన్ని గురువుగా పరిణామం చెందేలా చేసింది. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన అడిగలర్.. ఆయనస్త్రీలకు ఇచ్చిన ప్రాముఖ్యత, పూజలను సులభంగా, సరళంగా చేయడం వల్ల అతని పబ్లిక్ ఇమేజ్ చాలా పెరిగింది. శక్తి ఆరాధనకు గుర్తుగా ఎర్రని వస్త్రాలను ఉపయోగించే అతని భక్తులు ఆయనను 'అమ్మ' (తల్లి) గా గౌరవిస్తారు. దాంతో పాటు అడిగలర్ వైద్య సదుపాయాలను తీసుకువచ్చారు, ప్రజలకు సేవ చేయడానికి విద్యా సంస్థలను స్థాపించారు. తమిళనాడు, కర్నాటకలతో పాటు కొన్ని విదేశాల్లో కూడా ఆయనకు పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. దేశానికి చేసిన ఆధ్యాత్మిక సేవలకు గానూ 'అమ్మ'కి 2019లో పద్మశ్రీ అవార్డు లభించింది.