ఢిల్లీ సీఎం​ కేజ్రీవాల్​ ఇంటికి  కోటి 70 లక్షల ఫర్నీచర్ కొనిచ్చిన

ఢిల్లీ సీఎం​ కేజ్రీవాల్​ ఇంటికి  కోటి 70 లక్షల ఫర్నీచర్ కొనిచ్చిన

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్ ఇంటికి దాదాపు రూ.కోటి 70 లక్షల విలువైన ఫర్నీచర్ తానే కొనిచ్చినట్లు మనీలాండరింగ్ కేసులో మండోలి జైళ్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్​ వాట్సాప్ చిత్రాల ద్వారా వాళ్లకు నచ్చిన ఫర్నీచర్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కేజ్రీవాల్ అధికార నివాసంలో ఫర్నీచర్ కోసం జరిగిన బిడ్డింగ్, హై ఎండెడ్ ఫర్నీచర్ కు తానే డబ్బులు చెల్లించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ జరిపించాలని శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్​గవర్​కు మూడు పేజీల లేఖ సుఖేశ్​ రాశారు. రూ.45 లక్షలతో 12 సీట్ల డైనింగ్ టేబుల్, కేజ్రీవాల్, అతని పిల్లల బెడ్ రూంలో రూ.34 లక్షల విలువైన డ్రెసింగ్ టేబుల్, రూ.18 లక్షల విలువ చేసే ఖరీదైన అద్దాలు, రూ.28 క్షలతో రగ్గులు, బెడ్ స్ప్రెడ్స్, మెత్తలు, రూ. 45 లక్షల ఖరీదైన మూడు గోడ గడియారాలు, వీటితో పాటు మరిన్ని విలువైన సామాన్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు.

ఇటలీ, ఫ్రాన్స్ కు చెందిన ఈ ఇంపోర్టెడ్ ఫర్నీచర్ ను తన కంపెనీ న్యూస్ ఎక్ర్ ప్రెస్ పోస్ట్ అండ్ ఎల్ఎస్ ఫిషరీస్ నుంచి ఢిల్లీ, ముంబై బిల్స్ తో కొనుగోలు చేసినట్లు తెలిపారు. తన స్టాఫ్ రిషబ్ షెట్టి ద్వారా ఈ ఫర్నీచర్ ను సీఎం అధికారిక నివాసంలో ఇన్​స్టాల్ చేసినట్లు పేర్కొన్నారు. చెన్నై లోని తన నివాసానికి మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ వచ్చినప్పుడు ఇంట్లోని ఫర్నీచర్ ను ఫొటోలు తీసుకున్నారన్నారు. ఆ పిక్స్ కేజ్రీవాల్ కు చూపించడంతో అలాంటి ఖరీదైన ఫర్నీచర్ తనకు కావాలని సీఎం పట్టుబట్టారని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలోని ఖరీదైన ఫర్నీచర్ పై ఎంక్వైరీ చేసి, ఆ వస్తువులను రికవరీ చేయాలని కోరారు. ఈ వస్తువులకు సంబంధించిన బిల్స్, సంబంధిత డాక్యుమెంట్స్​ను దర్యాప్తు సంస్థలకు అందజేస్తానని సుఖేశ్​చెప్పారు. కాగా, కేజ్రీవాల్ నివాసంలో కోట్ల రూపాయల ఫర్నీచర్ స్కామ్​జరిగినట్టు విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుఖేశ్ చంద్ర శేఖర్ లేఖ సంచలనంగా మారింది.