
- రోజుకు 5 వేల మంది రాకపోకలకు అనుమతి
- కారిడార్ పై ఇండియా, పాక్ అంగీకారం
- రావీ నదిపై బ్రిడ్జి నిర్మాణానికి పాక్ ఓకే
న్యూఢిల్లీ: రెండు ప్రముఖ సిక్కు ఆధ్యాత్మిక క్షేత్రాలైన డేరా బాబా నాయక్ సాహిబ్(ఇండియా), గురుద్వారా దర్బార్ సాహిబ్(పాకిస్థాన్)ను కలిపే ‘కర్తార్ పూర్ కారిడార్’ ప్రాజెక్టుకు సంబంధించి రెండు దేశాలు కీలక అవగాహన కుదుర్చుకున్నాయి. భక్తివిశ్వాసాలపై పరిమితులు విధించబోమన్న ఇండియా.. ఏడాది పొడవునా రోజుకు 5వేల మంది యాత్రికుల్ని అనుమతిస్తామని తెలిపింది. వీసా అవసరం లేకుండానే భక్తులు రెండువైపులా రాకపోకలు సాగించొచ్చన్న అంగీకారానికొచ్చాయి. కారిడార్ పై రెండో విడత చర్చల్లో భాగంగా అటారీ–వాఘా సరిహద్దు వద్ద ఆదివారం ఇండియా, పాక్ అధికారుల బృందాలు సుమారు 2 గంటలపాటు భేటీ అయ్యాయి. ఇండియా డెలిగేషన్కు హోం మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ(ఇంటర్నల్ సెక్యూరిటీ) ఎస్సీఎల్ దాస్ నాయకత్వం వహించగా, పాక్ ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ తమ టీమ్ ను లీడ్ చేశారు. రెండు దేశాల మధ్య ఏయే అంశాలు ప్రస్తావనకొచ్చాయో, వేటిపై అంగీకారం కుదిరిందో భేటీ తర్వాత దాస్ మీడియాకు వివరించారు.
బ్రిడ్జి నిర్మాణానికి పాక్ ఓకే
రెండు దేశాలను కలిపే కర్తార్ పూర్ కారిడార్లో.. జీరోలైన్ వద్ద రావీ నదిపై వంతెన నిర్మాణం చాలా కీలకమైంది. ఇండియా వైపు ఇప్పటికే పనులు చకచకా సాగుతున్నా, పాక్ మాత్రం బ్రిడ్జి కాకుండా కాజ్ వే నిర్మించాలని భావించింది. వర్షాకాలంలో రావీ వరద ఆ ప్రాంతాన్ని ముంచెసే ప్రమాదముంది కాబట్టి కాజ్ వే బదులు బ్రిడ్జి కడితేనే బెస్ట్ అన్న ఇండియా సూచనను పాక్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ‘‘అన్ని కాలాల్లోనూ భక్తులు రాకపోకలు సాగించేలా జీరోలైన్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి పాక్ సరేనంది’’అని దాస్ వెల్లడించారు. గురునానక్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 12లోపే కారిడార్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కర్తార్ పూర్ కారిడార్ ను త్వరగా ఆపరేషనలైజ్ చేయడానికి తాము కమిట్ మెంట్ తో ఉన్నామని పాక్ అధికారి ఫైజల్ తెలిపారు.
చావ్లాను తప్పించారు
రెండో విడత చర్చల ప్రతినిధి బృందంలో నుంచి ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాను పాక్ పక్కన పెట్టింది. చర్చల బృందంలో చావ్లాకు చోటు కల్పించడంపై ఇండియా అసహనం వ్యక్తం చేసింది. కర్తార్పూర్ కారిడార్పై మార్చి 14న తొలి విడత చర్చలు జరగ్గా, చావ్లా పేరు కారణంగా ఏప్రిల్2న జరగాల్సిన రెండో విడత చర్చలు వాయిదా పడ్డాయి. అతణ్ని డ్రాప్ చేయడంతో ప్రక్రియ తిరిగి మొదలైంది.