రాజ్ నాథ్ సింగ్ మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి : పాక్

రాజ్ నాథ్ సింగ్ మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి : పాక్

భారత్ ఎల్లప్పుడు తమను బెదిరిస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతుందని పాక్ ఆర్మీ మీడియా వింగ్ అధికారి అన్నారు.  భారత్‌ ఏదైనా దుస్సాహాసానికి పాల్పడితే వారి చర్యలను తిప్పి కొట్టేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు. పాక్ ప్రతీ అంశంలోనూ ఎంతో సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని.. అయితే భారత్‌  తమను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతోందన్నారు. అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. జమ్ము కశ్మీర్‌పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయాల క్రమంలో పాకిస్తాన్‌ అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.

అయితే ప్రధాన దేశాలన్నీ కశ్మీర్‌ అంశంలో భారత్‌ను సమర్థించడంతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని కశ్మీర్‌ కమిటీ శనివారం అత్యవసరంగా భేటీ అయ్యింది. సమావేశం అనంతరం పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీతో కలిసి గఫూర్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా… అణ్వాయుధాల విషయంలో భారత్‌ వైఖరి మారవచ్చంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను గమనించాల్సిందిగా ప్రపంచ దేశాల నాయకులకు విఙ్ఞప్తి చేశారు. దాయాది దేశాల మధ్య ఘర్షణకు కశ్మీర్‌ కేంద్రంగా ఉందని, తమ దేశ భద్రత ప్రస్తుతం కశ్మీర్‌ తో ముడిపడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.