పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి పాక్ శరణార్థి

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి పాక్ శరణార్థి

పాక్ కంటే భారత్‌లోనే బాగుంది

దేశంలో పౌరసత్వ చట్టం అమలుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ మహిళా శరణార్థి సిద్ధమయింది.

నీతా సోధా అనే మహిళ రాజస్థాన్‌లో నివసిస్తోంది. ఆమె ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో నట్వారా ప్రాంతం నుంచి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. నీతా 18 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడింది. నీతాకు నాలుగు నెలల క్రితమే భారత పౌరసత్వం లభించింది. దాంతో ఆమె పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడానికి లైన్ క్లీయరయింది.

‘నేను 18 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాను. కానీ, నాకు 4 నెలల క్రితమే భారత పౌరసత్వం లభించింది. దాంతో ఇప్పుడు నేను సర్పంచ్ ఎన్నికలలో పోటీచేస్తున్నాను. మా మామయ్య మా ఊరి రాజకీయాలలో చురుకుగా ఉంటాడు. నా రాజకీయం ప్రయాణంలో ఆయనే నాకు మార్గదర్శకుడు’ అని నీతా తెలిపారు.

గ్రామంలో మహిళా సాధికారత, అందరికీ మెరుగైన విద్య అందించాలని తాను కోరుకుంటున్నట్లు నీతా తెలిపారు. ‘మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. మెరుగైన విద్య, ఆస్పత్రుల కోసం కృషి చేస్తాను. ముఖ్యంగా గ్రామాభివృద్ధి మరియు గ్రామ శ్రేయస్సు కోసం ఎక్కువగా కృషిచేస్తాను. మహిళలకు వేతనాలు పెరిగేలా ప్రయత్నిస్తాను’ అని నీతా తెలిపారు.

భారతదేశంతో తనకున్న 18 ఏళ్ల అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. ‘మహిళలకు మరియు విద్యకు పాకిస్తాన్‌లో కంటే భారతదేశంలోనే సముచిత స్థానం కల్పిస్తున్నారు. నేను ఇక్కడకు వచ్చినప్పటి నుండి నాకు ఇక్కడి ప్రజల నుండి గొప్ప మద్దతు లభించింది. ఆ మద్ధతే నాకు ముందుకు సాగడానికి సహాయపడింది’ అని సోధా అన్నారు.