‘గ్రే’ లిస్ట్‌‌లోనే పాకిస్తాన్‌‌

‘గ్రే’ లిస్ట్‌‌లోనే పాకిస్తాన్‌‌

పాక్‌‌కు ప్రపంచ దేశాల
ఆర్థిక సాయంపై ప్రభావం
టెర్రరిస్టులకు డబ్బు చేరవేతపై ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ అసంతృప్తి

ఇస్లామాబాద్‌‌: అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌‌కు మరోసారి గట్టిదెబ్బ తగిలింది. టెర్రరిస్టులకు డబ్బు సాయం చేయడంపై పాకిస్తాన్‌‌ తీరు మారలేదని ఫైనాన్షియల్‌‌ యాక్షన్‌‌ టాస్క్‌‌ ఫోర్స్‌‌ (ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ దేశాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ‘గ్రే’ లిస్టులోనే కొనసాగించాలని ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ నిర్ణయించింది. టెర్రరిస్టులకు డబ్బు సాయం చేయడం, మనీ లాండరింగ్‌‌ అంశాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌‌ను ఆదేశించింది. ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ అనేది టెర్రరిస్టులకు ఆర్థికసాయాన్ని కంట్రోల్‌‌ చేసే ఇంటర్నేషనల్‌‌ సంస్థ. ఇది ఇచ్చే గ్రేడ్‌‌ల ఆధారంగానే చిన్న దేశాలకు ప్రపంచ దేశాల నుంచి  సాయం అందుతుంది. పారిస్‌‌లో మంగళవారం జరిగిన మీటింగ్‌‌లో పాకిస్తాన్‌‌లో మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌‌పై ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ రివ్యూ చేసింది. టెర్రరిజంపై పాకిస్తాన్‌‌ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని, మరో 4 నెలల సమయం ఇచ్చి చూస్తామని, పరిస్థితిలో మార్పు లేకుంటే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్‌‌ ఇచ్చింది.

దీనిపై పాకిస్తాన్‌‌ ఆర్థిక శాఖ ప్రతినిధి ఒమర్ హమీద్ ఖాన్ మాట్లాడుతూ.. ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ పరిశీలించిన రిపోర్టులో నిజాలు లేవన్నారు. అంతకుముందు ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ మీటింగ్‌‌లో పాకిస్తాన్‌‌ ఎకనామిక్‌‌ ఎఫైర్స్‌‌ మినిస్టర్‌‌ హమ్మద్‌‌ అజార్‌‌ మాట్లాడుతూ.. ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ సూచించిన 27 గైడ్‌‌లైన్స్‌‌లో 20 అంశాలను అమలు చేశామని చెప్పగా.. కేవలం ఆరింటినే పాకిస్తాన్‌‌ ఫాలో అయిందని ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ చెప్పింది. పాకిస్తాన్‌‌ తీసుకున్న చర్యలపై మనదేశం అసంతృప్తి వ్యక్తం చేయగా చైనా, టర్కీ, మలేషియా సంతృప్తి వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ఈ నాలుగు నెలల కాలంలో పాకిస్తాన్‌‌ను గ్రే లిస్ట్‌‌లోంచి డార్క్​ గ్రే లిస్టులోకి మార్చాలని ఎఫ్‌‌ఏటీఎఫ్‌‌ భావిస్తోంది. దీనిపై శుక్రవారం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతమున్న గ్రే లిస్టును కొనసాగించినా, డార్క్​గ్రేలోకి మార్చినా పాకిస్తాన్‌‌కు ఐఎంఎఫ్, వరల్డ్‌‌ బ్యాంక్‌‌, యురోపియన్‌‌ యూనియన్‌‌ నుంచి నిధులు అందడం కష్టంగా మారుతుంది.