కరాచీలో పాకిస్థాన్ మిసైల్ పరీక్ష!

కరాచీలో పాకిస్థాన్ మిసైల్ పరీక్ష!

జమ్ముకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత.. పాకిస్థాన్ తన వైఖరిలో మార్పును చూపిస్తోంది. చర్చలు సహా.. భారత్ తో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంపేసుకుంటున్న పాకిస్థాన్ .. తాజాగా.. మరో కీలకమైన చర్యకు దిగింది. కరాచీ దగ్గర్లోని సోన్ మియానీ ఏరియాలో మిసైల్ టెస్టు జరుపుతోంది.

సోన్ మియానీ ప్రాంతంలో మిసైల్ టెస్ట్ ఫైర్ చేయడానికి రెడీ అయింది పాకిస్థాన్. ఇందుకు సన్నాహకంగా పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ – సీఏఏ… నోటమ్(NOTAM-నోటీస్ టు ఎయిర్ మెన్) ను విడుదల చేసింది. వైమానిక దళానికి, నావికా దళానికి హెచ్చరికలు పంపింది. ఆగస్ట్ 31 వరకు కరాచీలోని గగన తలంపై నిషేదాజ్ఞలు జారీచేసింది.

నోటమ్ ప్రకారం… కరాచీ మీదుగా ఉన్న 3 ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ లను విమానయాన సంస్థలు వాడుకోకూడదు. ఈ గగన తలాన్ని మూసివేయడంపై సీఏఏ ఎటువంటి కారణాలు చెప్పలేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులను దారి మళ్లించింది.

ఇండియా వైపు గగన తలాన్ని పూర్తిగా మూసివేసినట్టు పాకిస్థాన్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌద్రీ మంగళవారం చెప్పారు. ఆప్ఘనిస్థాన్ తో వాణిజ్య సంబంధాల్లో భాగంగా.. పాకిస్థాన్ గగన తలాన్ని ఇండియా వాడుకోవడంపైనా నిషేధం విధించాలనుకుంటున్నట్టుగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారని చెప్పారు.

నేతల కామెంట్లు.. ఏవియేషన్ అథారిటీ నిర్ణయం తర్వాత… కరాచీలో మిసైల్ టెస్టుకు పాకిస్థాన్ సిద్ధపడినట్టు సమాచారం అందుతోంది.