హిందువని పాక్ బౌలర్ కనేరియాపై వివక్ష: షోయబ్ అక్తర్

హిందువని పాక్ బౌలర్ కనేరియాపై వివక్ష: షోయబ్ అక్తర్

పాకిస్థాన్‌‌ టీమ్‌లో ఆడిన రెండో హిందూ క్రికెటర్‌‌ డానిష్‌‌ కనేరియాపై తమ ఆటగాళ్లు జాతి వివక్ష చూపారని మాజీ పేసర్‌‌ షోయబ్‌‌ అక్తర్‌‌ చెప్పాడు. అతడు హిందువు అన్న కారణంగా మ్యాచ్‌‌ల సందర్భంగా కొందరు పాక్‌‌ క్రికెటర్లు చాలా దురుసుగా ప్రవర్తించేవారన్నాడు. ముఖ్యంగా ఫుడ్‌‌ విషయంలో చాలా ఇబ్బందికి గురి చేసేవారని తెలిపాడు. ‘హిందువైన నీవు మా ఫుడ్‌‌ ఎలా తింటున్నావని ఎగతాళి చేసేవారు. అయినా కనేరియా పెద్దగా పట్టించుకునే వాడు కాదు. కేవలం హిందువు అన్న కారణంగానే చాలా అవమానాలకు గురయ్యాడు. కానీ అదే కనేరియా ఎన్నో మ్యాచ్‌‌ల్లో పాక్‌‌ను గెలిపించాడు. ఈ విషయం ఎవరికీ గుర్తులేదు’ అని అక్తర్‌‌ అన్నాడు. ఓ పాక్ టీవీ చానెల్‌లో ‘గేమ్ ఆన్ హై’ అనే షోలో అక్తర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు.

కెప్టెన్ సైగలతో..

టీమ్ అంతా భోజనం చేసేటప్పుడు కనేరియాను తమతో కలిసి కూర్చోనిచ్చేవాళ్లు కాదని చెప్పాడు. కనేరియా రాగానే కెప్టెన్ కొందరు ప్లేయర్స్‌కి కనురెప్పలు ఎరేస్తూ సైగలు చేసేవాడని, ఆ తర్వాత వాళ్లు అతడిని అవమానించి పంపేసేవారని తెలిపాడు అక్తర్. ఓ సందర్బంలో తాను కెప్టెన్‌కు ఇది సరైన పద్ధతి కాదని చెప్పానన్నాడు. కనేరియా మంచి బౌలర్ అని, చాలా మ్యాచ్‌లలో పాక్‌ని గెలిపించాడని, అతడిని ఇలా ట్రీట్ చేయడం సరికాదని చెప్పానని షోలో వివరించాడు.

హిందువు అయినా సరే అతడిని దేశ ప్రతినిధిగా చూడాలని పలుమార్లు టీమ్‌మేట్స్‌కి చెప్పానని అన్నాడు అక్తర్. కనేరియా అద్భుతంగా బౌలింగ్ చేసిన ఏ ఒక్క సందర్భంలోనూ కనీసం అభినందనలు కూడా పొందలేకపోయాడని చెప్పాడు. ఒక్క మ్యాచ్‌లోనూ అతడికి క్రెడిట్ ఇవ్వలేదన్నాడు. 2005లో ఇంగ్లండ్‌పై జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్‌ని గెలిపించింది కనేరియానే అని, ఆ సిరీస్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందర్నీ పడగొట్టాడని తెలిపాడు అక్తర్. ఆ సిరీస్ తర్వాత కనేరియాని టీమ్ అవమానిస్తున్న తీరుపై తాను తిట్టానని చెప్పాడు.

కాగా, డానిష్ కనేరియా టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన పాక్ బౌలర్ల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు. వసీం అక్రమ్, వాఖర్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే స్టాప్ ఫిక్సింగ్ ఆరోపణలపై ప్రస్తుతం అతడిపై లైఫ్ టైమ్ బ్యాన్ ఉంది.