
వాషింగ్టన్: మైనింగ్ కేసులో ఇంటర్నేషన్ కంపెనీలు బార్రిక్ గోల్డ్ కార్పొరేషన్, ఆంటోఫాగస్టా పీఎల్సీకు 40 వేల కోట్ల రూపాయలు జరిమానాగా చెల్లించాలని ప్రపంచబ్యాంకు ట్రిబ్యునల్ పాకిస్థాన్ ను ఆదేశించింది. 2011లో బార్రిక్, ఆంటోఫాగస్టా ‘రెకో డిక్’ అనే ప్రాంతం నుంచి బంగారం, రాగి మైనింగ్ చేసేందుకు పాకిస్థాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీన్నుంచి వచ్చే 50 ఏళ్లలో ఏటా 2 లక్షల టన్నుల రాగి, 2.5 లక్షల ఔన్సుల బంగారం వెలికి తీయొచ్చని రెండు కంపెనీలు అంచనా వేశాయి. ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోని రెకో డిక్ పై రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసి, ప్రాథమికంగా పనులు చేపట్టేందుకు రెడీ చేశాయి. ఇంత చేశాక పాకిస్థాన్, మైనింగ్ లైసెన్సును కంపెనీలకు ఇచ్చేందుకు నిరాకరించింది.
దాంతో అవి ప్రపంచబ్యాంకు ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. కేసును పలు మార్లు విచారించిన ట్రిబ్యునల్ బార్రిక్, ఆంటోఫాగస్టాలకు నష్ట పరిహారంగా రూ.26 వేల కోట్ల చెల్లించాలని ఆదేశించింది. ఇన్ని రోజులు పనులు చేపట్టకుండా అడ్డుకున్నందుకు రూ.12.5 వేల కోట్లను వడ్డీగా చెల్లించాలని చెప్పింది. ఇతరత్రా ఖర్చుల కింద మరో 1100 కోట్ల చెల్లించాలని సూచించింది. పాకిస్థాన్ కు ఈ మైనింగ్ కేసులో పడిన జరిమానా, ఇటీవల ఆదేశం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) నుంచి తీసుకున్న అప్పుతో దాదాపుగా సమానం. ఇటీవల ఐఎంఎఫ్ పాకిస్థాన్ కు రూ. 42 వేల కోట్లను ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రిబ్యునల్ తీర్పుపై మరో పిటిషన్ వేయాలని పాకిస్థాన్ యోచిస్తోంది. అంత డబ్బు చెల్లించే స్థోమత లేదు కనుక మైనింగ్ ప్రాజెక్టును బార్రిక్, ఆంటోఫాగస్టాలకే అప్పజెప్పాలని కూడా భావిస్తోందని తెలిసింది.