పాలమూరులో కరువు నివారణకు రూ.100 కోట్లు

పాలమూరులో కరువు నివారణకు రూ.100 కోట్లు
  • తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాల గుర్తింపు కోసం కేంద్రం సర్వే
  • దేశ వ్యాప్తంగా 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు గుర్తింపు
  • తెలంగాణలో మూడు జిల్లాలను ఐడెంటిటీఫై చేసిన సెంట్రల్​ సర్కార్
  • మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్​ జిల్లాలకు నిధులు మంజూరు

మహబూబ్​నగర్/మక్తల్, వెలుగు: కరువు, వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు​ జిల్లాలో కరువు నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత పదేండ్లలో ఎక్కువ సార్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాలను గుర్తించేందుకు కొద్ది రోజుల కింద కేంద్రం సర్వే చేపట్టింది. ఈ సర్వేలో దేశంలోని 12 ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు తేలింది. ఈ 12 జిల్లాల్లో కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సూచనలు చేసింది. 

దీంతో ఒక్కో జిల్లాకు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల చొప్పున మంజూరు చేసింది. అయితే ఈ 12 జిల్లాల్లో తెలంగాణలోని మూడు జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్  జిల్లాలే కావడం గమనార్హం.​ 

పదేండ్ల వర్షాపాతం ఆధారంగా..

మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్​ జిల్లాల్లో పదేండ్ల వర్షపాతం  ఆధారంగా కేంద్రం సర్వే చేపట్టింది. 2014 నుంచి 2023 వరకు ఈ జిల్లాల్లోని మండలాల వారీగా ఏఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది? లోటు వర్షపాతం ఎంత? లోటు వర్షపాతానికి గల కారణాలు? తదితర విషయాలపై  రిపోర్టు తీసుకుంది. అలాగే వ్యవసాయశాఖతో పాటు దాని అనుబంధ శాఖలు, గ్రౌండ్​ వాటర్​, రెవెన్యూ డిపార్ట్​మెంట్లకు చెందిన ఆఫీసర్లు 2021, 2022లో ఫీల్డ్​ సర్వేలు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయాయి? నీటి లభ్యత పరిస్థితి ఏంటి? అనే వివరాలను సేకరించి, కేంద్రానికి రిపోర్టు పంపారు. 

కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆ రిపోర్టులో వివరించారు. 2018లో కూడా మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన అగ్రికల్చర్​ ఆఫీసర్  కూడా ఈ రెండు జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్రానికి నివేదికను అందజేశారు. వీటన్నిటి ఆధారంగా కేంద్రం తాజాగా ఈ మూడు జిల్లాల్లో కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. రూ. వంద కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీగా చేయగా.. సర్వే రిపోర్ట్​ ఆధారంగా ఏఏ జిల్లాకు ఎంత నిధులు కేటాయించాలనే దానిపై త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి.

నీటి వనరులు పెంచడమే లక్ష్యం..​

కేంద్రం మంజూరు చేసిన నిధులను ఈ మూడు జిల్లాల్లో నీటి వనరులు పెంపొందించడం, వ్యవసాయ అభివృద్ధి కోసం వెచ్చించనున్నారు. ప్రధానంగా సాగు భూములను డెవలప్​ చేయనున్నారు. ఇందు కోసం ప్రతి రైతు పంట సాగుకు ముందు భూసార పరీక్షలు చేయించుకునేలా వారికి అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ ద్వారా అవగాహన కల్పించనున్నారు. ఎరువులు వాడే విధానంతో పాటు రైతులకు విత్తనాల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. 

వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్న మండలాల్లో ఫామ్​ పాండ్స్, చెక్​ డ్యామ్​లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఎక్కడి నీటిని అక్కడే ఆపి భూగర్భ జలాలను పెంపొందించనున్నారు. దీని వల్ల బోర్లు కూడా రీ చార్జ్  కానున్నాయి. అలాగే గుట్టల పొంటి కాంటూర్​ ట్రెంచ్​లను ఏర్పాటు చేసి గ్రామాల శివారు ప్రాంతాల్లో సాగునీటి లభ్యత ఉండేలా చేయనున్నారు.

యాక్షన్​ ప్లాన్​ వస్తుంది..

2014 నుంచి ఉమ్మడి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్​ తీసుకుంది. గతేడాది ఇందుకు సంబంధించిన ఫైనల్​ రిపోర్టును అందజేశాం. దాని ఆధారంగా మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్​ జిల్లాలను తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలుగా గుర్తించారు. త్వరలో యాక్షన్​ ప్లాన్, గైడ్​ లైన్స్​​వస్తాయి. దాని ఆధారంగా బడ్జెట్​ను దేనికి వాడాలనే విషయం స్పష్టమవుతుందని మహబూబ్​నగర్​ డీఏవో - వెంకటేశ్ తెలిపారు. 

పాలమూరుకు భారీ సాయం..

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాని మోదీ భారీ సాయం అందించారు. తీవ్ర  వర్షాభావ పరిస్థితులు ఉన్న పాలమూరు, నారాయణపేట, నాగర్​కర్నూల్​ జిల్లాలకు రూ.వంద కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మూడు జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. రైతు ఆదాయ భద్రతకు నిధులను వినియోగించుకోవచ్చు. ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు కేంద్రానికి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు, ప్రజల తరఫున  మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.