- ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదంటున్న బీఆర్‌ఎస్ లీడర్లు
- బీఆర్‌ఎస్ తరపున వచ్చే నెల పాదయాత్ర చేస్తామంటూ ప్రకటన
- పదేండ్లు అధికారంలో ఉన్నా ఎందుకు పూర్తి చేయలేదని కాంగ్రెస్ లీడర్ల ప్రశ్న
- రాజకీయం కోసమే పాదయాత్ర డ్రామా ఆడుతున్నారంటూ ఎదురుదాడి
మహబూబ్‌నగర్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (పీఆర్‌ఎల్‌ఐ)పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ అధికారిలోకి వచ్చి రెండున్నరేండ్లైనా ‘పాలమూరు’ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. మరో వైపు బీఆర్‌ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టును 50 శాతం కూడా పూర్తి చేయలేకపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్‌కు దిగారు. పాలమూరు ప్రాజెక్ట్‌ను రాజకీయాలకు వాడుకునేందుకు పాదయాత్ర పేరుతో డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడుతున్నారు.
పదేండ్లు పట్టించుకోని గత ప్రభుత్వం
పీఆర్‌ఎల్‌ఐ పనులకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వెన వద్ద 2015 జూన్ 15న అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ స్కీం కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను మూడేండ్లలో పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తామని ప్రకటించారు. ఏడాది తర్వాత 2016 మేలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేసి, 2021లో జాతికి అంకితం చేసిన కేసీఆర్.. ‘పాలమూరు’ పనులను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. 2023 డిసెంబరు 3 వరకు ఈ ప్రాజెక్ట్ కింద కేవలం 50 శాతం పనులను మాత్రమే పూర్తి చేశారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు పూర్తి చేయగా.. వీటి కింద ప్రధాన కాల్వల పనులు పెండింగ్‌లో పెట్టారు.
కర్వెన పూర్తయినా.. రివిట్‌మెంట్ పూర్తి కాలేదు. ఒక్క కెనాల్‌ను కూడా నిర్మించలేదు. ఈ స్కీంకు ప్రధానమైన ఉదండాపూర్ రిజర్వాయర్‌కు, కర్వేన రిజర్వాయర్‌కు లింక్ కలిపే కెనాల్ పనులు టేకప్ చేయలేదు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు ఎక్కడిక్కడ పెండింగ్‌లో పెట్టగా... భూ బాధితులకు పూర్తి స్థాయి పరిహారం చెల్లించడంలోనూ నిర్లక్ష్యం వహించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పనులను సైతం గాలికొదిలేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌లో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసంపూర్తిగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఒక పంప్‌ను ఆన్ చేసి, మరుసటి రోజే బంద్ పెట్టారు.
వచ్చే నెలలో బీఆర్‌ఎస్ పాదయాత్ర
ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం పట్టుబట్టి నిధులు సాధించుకున్న లీడర్లు పనులు చేయించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. కొందరు లీడర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి.. చెరువుల్లో మట్టి, ఇసుక దందాలకు తెరలేపారు. పనుల విషయాన్ని గాలికి వదిలేయడంతో మూడేండ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పదేండ్లైనా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ‘పాలమూరు’ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ తరఫున వచ్చే నెలలో పాదయాత్ర చేస్తామంటూ ప్రకటించారు.
స్పీడందుకున్న పనులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలమూరు పనుల్లో కదలిక వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో నిత్యం సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నార్లాపూర్‌లో కేవలం రెండు మోటార్లను మాత్రమే ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్ వచ్చాక అదనంగా మరో నాలుగు మోటార్లను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచారు. ఈ రిజర్వాయర్ నుంచి ఏదుల వరకు పెండింగ్‌లో ఉన్న సుమారు రెండు కిలోమీటర్ల కెనాల్ పనులను ప్రారంభించారు. ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద ఐదు మోటార్లను చొప్పున సిద్ధం చేశారు. భూ బాధితులకు పరిహారం చెల్లింపుతో పాటు ఇతర అవరోధాలను అధిగమించి, రిజర్వాయర్ కట్ట పనులను ఇటీవల ప్రారంభించారు.
ఒక్క ఎకరాకు నీళ్లు ఇయ్యలే
గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్ట్ పేరుతో సుమారు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయడానికి 2015లోనే జీవో వచ్చినా కేంద్ర జలసంఘానికి డీపీఆర్ ఇవ్వడానికి గత ప్రభుత్వం ఏడేండ్లు నాన్చింది. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 2ను టార్గెట్‌గా పెట్టుకున్నారు.
యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, పాలమూరు
