మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన దుబ్బరి కార్తీక్(23) ఇంటర్ పూర్తి చేసిన తర్వాత 2021లో పాలమూరు వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఐదేళ్ల కోర్సులో జాయిన్ అయ్యాడు. ఈ నెల 17న వైవా ఎగ్జామ్ ఉండడంతో కార్తీక్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన రికార్డ్స్‌తో పాటు పరీక్ష రాయడానికి సమ్మర్ హాలిడేస్ అనంతరం సోమవారం రాత్రి 10 గంటలకు వర్సిటీకి వచ్చాడు.
36వ నంబర్లోని తన గదికి వెళ్లి అతని స్నేహితుడితో కలిసి నిద్రపోయాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన కార్తీక్ 33వ నంబర్ గదిలోకి వెళ్లి, ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు బెడ్ షీట్‌తో ఉరేసుకున్నాడు. అతడిని అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడితండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. కాగా, మృతుడిది నిరుపేద కుటుంబ కావడంతో అంత్యక్రియలకు ఆర్థికసాయం చేయాలని వర్సిటీ వీసీ శ్రీనివాస్‌ను కార్తీక్ పేరెంట్స్ కోరారు.
