చల్లటి ఐస్ యాపిల్..తాటిముంజలు

చల్లటి ఐస్ యాపిల్..తాటిముంజలు

‘‘పొద్దు పొద్దునే పొలం గట్లెంబడి పోయి అప్పుడే దించిన తాటికల్లు తాగుతుంటే మస్తు అనిపిస్తది రా. సల్లగ అమృతం లెక్క గొంతులోకి పోతాంది రా” అంటరు తాటికల్లు ప్రియులు. అయితే, ఆ చెట్టు నుంచి వచ్చే కల్లు మాత్రమే కాదు కాయలు కూడా మస్త్‌‌ టేస్ట్‌‌ ఉంటయ్‌‌. ఎండాకాలం వచ్చిందంటే మామిడిపండ్లతో పాటు అందరికీ తాటి ముంజలు కూడా యాదికొస్తయ్‌‌. తెల్లగ, మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటయ్‌‌. చూడనీకి, తిననీకి మంచిగ అనిపించే ఆ ముంజల్లో మస్తు పోషకాలు కూడా ఉన్నయ్‌‌. వేసవిలో ఒళ్లు చల్లగ ఉండేందుకు కూడా దోహదపడతయ్‌‌. ఇంగ్లీష్‌‌ల వీటిని ఐస్‌‌ యాపిల్స్‌‌ అంటరు.

చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేలా ఉండే ముంజలంటే ఇష్టపడని వారెవరు! ముంజలు శరీరానికి మంచి చేయడంతో పాటు బోలెడు పోషకాలు కూడా ఇస్తాయి. వేసవి వేడి నుంచి మనల్ని కాపాడతాయి. అందుకే, వీటిని ‘ఐస్‌‌ యాపిల్‌‌’ అని అంటారు. తమిళనాడులో ‘నుంగు’, కన్నడలో ‘తాటి నుంగు’ అని పిలుస్తారు. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే ఎక్కువగా దొరికే ముంజలు ఇప్పుడు నగరాల్లో కూడా బాగానే దొరుకుతున్నాయి.  

పోషకాలు మస్తు..
తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. వీటిల్లో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు ఏ, బి, సిలు ఉంటాయి. వాటితో పాటు జింక్‌‌, పొటాషియం లాంటి మినరల్స్‌‌ కూడా ఉంటాయి. ఎండాకాలంలో డీ హైడ్రేషన్‌‌ అవ్వకుండా ఉంటుంది. ముంజలు తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు రావు. ఎసిడిటీ, మలబద్దకం లాంటి వ్యాధులు ఉన్నా.. తగ్గిపోతాయి. చిన్నపిల్లలు, వృద్ధులకు ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా దోహదపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. తాటి ముంజలు రకరకాల ట్యూమర్స్,  బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి అంటున్నారు.  

తాటిముంజలే మేలు..

తాటి ముంజల్లో అనేక పోషక విలువలున్నాయి. ​ప్రకృతి ప్రసాదించిన ముంజలు ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకునే  పండ్ల కంటే చాలా మంచివి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
                                                                                                      -డాక్టర్​ గోపినాథ్