పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్

పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్

మునుగోడు బై పోల్ కు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. హస్తం పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా స్రవంతికి నియోజకవర్గంలో ఉన్న గుర్తింపు దృష్ట్యా.. ఆమెవైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మునుగోడు బైపోల్ కు సంబంధించి పాల్వాయి స్రవంతితో పాటు కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాస్ నేత పేర్లను ప్రతిపాదిస్తూ ఓ నివేదికను పార్టీ అధిష్టానానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పంపించింది. అయితే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఎంపిక చేసేందుకే అధిష్టానం మొగ్గుచూపడం గమనార్హం. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రకటన వెలువడడంతో.. రేపు గాంధీ భవన్ లో ఆ పార్టీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు ఆధ్వర్యంలో మీటింగ్ జరుగనుంది. మునుగోడు లో కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం దక్కని మిగతా ముగ్గురు అభ్యర్థులకు నేతలు సర్దిచెప్పనున్నారు. దీనిపై వారితో చర్చలు జరుపనున్నారు. 

మాణిక్కం ఠాగూర్ ట్వీట్ 

‘‘మునుగోడు బై పోల్ కు పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఖరారు చేశారు’’ అని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సోనియాగాంధీ తీసుకునే ప్రతి నిర్ణయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుంది. అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కూడా అదే స్ఫూర్తితో తెలంగాణ కాంగ్రెస్ జనాల్లోకి తీసుకెళ్లాలి. మునుగోడులో మళ్లీ గెలవాలి’’ అని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. 

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. 

ఇక మునుగోడు అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆకస్మిక బై పోల్ వచ్చింది. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో చేరారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా ఈ బై పోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంతకుముందు దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్స్ లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. బీజేపీ నుంచి రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈనేపథ్యంలో ఎలాగైనా మునుగోడు బై పోల్ లో గెలవాలనే కృత నిశ్చయంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈక్రమంలో ఇప్పటికే వామపక్షాలతో చేతులు కలిపింది. అయితే మునుగోడు బై పోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా ప్రకటన వెలువడలేదు.