పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ వద్ద ఉన్న అవుట్ పోస్ట్ ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్ లోకి ఎవరు వెళ్లాలన్నా అవుట్ పోస్ట్‌ను దాటి లోపలికి వెళ్లాల్సి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఇనుప కంచెను తొలగింపజేశారు. మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తుండగా అవుట్ పోస్ట్ వద్ద వాహనాలు నిలపకుండా ఇద్దరు పోలీసులను సెక్యూరిటీగా ఉంచారు. గురువారం అర్ధరాత్రి దొంగలు పడి అవుట్ పోస్ట్ అల్యూమినియం ఫ్రేమ్స్ తొలగించి ఎత్తుకెళ్లారు. అడ్డుగా ఉన్న గ్లాసులను ధ్వంసం చేశారు. మధు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
