పారామెడికల్​ ప్లేస్​లో ‘హెల్త్ కేర్‌‌‌‌’

పారామెడికల్​ ప్లేస్​లో ‘హెల్త్ కేర్‌‌‌‌’

ఇకపై దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం
దేశ, రాష్ట్ర స్థాయిలో అలైడ్ అండ్ హెల్త్‌‌ కేర్
ప్రొఫెషనల్ కౌన్సిళ్లు కోర్సులకు కామన్
అడ్మిషన్, ఎగ్జిట్ టెస్ట్‌ పరిశీలిస్తున్న

హైదరాబాద్, వెలుగు: దేశంలో కొత్త పారామెడికల్ విద్యా విధానం అమల్లోకి రానుంది. ఎంబీబీఎస్ తరహాలో దేశవ్యాప్తంగా ఒకే పాలసీని తీసుకురానున్నారు. ఈ మేరకు రూపొందించిన ‘అలైడ్‌‌ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్‌‌’బిల్లుకు లోక్‌‌సభ గతంలోనే ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై సెలెక్ట్ కమిటీ తాజాగా తన నివేదికను రాజ్యసభకు అందించింది. ప్రస్తుత బడ్జెట్​ సమావేశాల్లోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది, అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఎంసీఐ తరహాలో ఏహెచ్​సీఐ

‘అలైడ్ అండ్ హెల్త్‌‌ కేర్‌‌‌‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’(ఏహెచ్‌‌సీఐ) పేరిట ఎంసీఐ తరహాలో ఓ కౌన్సిల్‌‌ను ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఫిజియోథెరపి, అక్యుపేషనల్ థెరపి, ఆప్టోమెట్రి, న్యూట్రిషన్, మెడికల్ లాబోరేటరీ, రేడియోథెరపి టెక్నాలజీ వంటి 53 హెల్త్ ప్రొఫెషనల్ కోర్సులు ఈ కౌన్సిల్ పరిధిలోకి వస్తాయి. ‘పారామెడికల్ కోర్సు’లకు బదులు అలైడ్ అండ్ హెల్త్ కేర్‌‌‌‌ ప్రొఫెషనల్ కోర్సులుగా వీటిని పిలుస్తారు. ఈ కోర్సుల సిలబస్, డ్యురేషన్‌‌, ఎలిజిబులిటీ, ఎంట్రన్స్‌‌, ఎగ్జామినేషన్‌‌ వంటివన్నీ ఏహెచ్‌‌సీఐ రూపొందిస్తుంది. ప్రస్తుతం ఒక రాష్ట్రంలో చేసిన పారామెడికల్ కోర్సు, మరో రాష్ట్రంలో ఆమోదించడం లేదు. దీంతో చాలా మంది ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థ ఉండడం వల్ల ఈ కోర్సులు చేసిన స్టూడెంట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జాతీయ స్థాయిలో కోర్సుకు గుర్తింపు ఉండడంతో ఇతర దేశాల్లోనూ ఉపాధి పొందేందుకు చాన్స్​ ఉంటుంది.

పారామెడికల్ బోర్డులకు చెల్లు చీటీ

ఏహెచ్‌‌సీఐ రూపొందించిన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలోనూ అలైడ్‌‌ అండ్ హెల్త్ కేర్ కౌన్సిల్స్‌‌ను ఏర్పాటు చేయాలి. ఈ కౌన్సిల్ ఏర్పడగానే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న పారామెడికల్ బోర్డులు రద్దవుతాయి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌‌ కాలేజీల ఏర్పాటుకు ఈ కౌన్సిల్‌‌ వద్ద అనుమతి తీసుకోవాలి. ఆయా కాలేజీలు నిబంధనల ప్రకారం ఉన్నాయా, స్టాండర్డ్స్ పాటిస్తున్నాయా లేదా కౌన్సిల్‌‌ పర్యవేక్షించాలి. సెంట్రల్ కౌన్సిల్ రూపొందించిన నిబంధనలన్నీ పాటించేలా చర్యలు తీసుకోవాలి. సడెన్‌‌ ఇన్‌‌స్పెక్షన్స్‌‌, నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించడం, గుర్తింపు రద్దు చేసే అధికారం స్టేట్ కౌన్సిళ్లకు ఉంటుంది. ఈ కౌన్సిళ్ల ద్వారానే అడ్మిషన్ల ప్రక్రియ, ఎగ్జామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కోర్సు పూర్తయిన తర్వాత స్టూడెంట్లు తమ సర్టిఫికెట్లను స్టేట్‌‌ కౌన్సిల్‌‌లో రిజిస్ర్టేషన్ చేసుకుని, యూనిక్ రిజిస్ర్టేషన్‌‌ ఐడీ పొందాలి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌‌ రిజిస్టర్లను మెయింటెయిన్ చేయనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు.

కామన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్‌‌

ప్రస్తుతం పారామెడికల్ కోర్సుల ఎలిజిబులిటీ, ఎంట్రన్స్ విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌‌ఎస్‌‌సీ అర్హతతో ల్యాబ్ టెక్నీషియన్‌‌ కోర్సు చేయొచ్చు. మరికొన్ని రాష్ర్టాల్లో ఇంటర్​ అర్హతగా ఉంది. దీంతో ఓ రాష్ట్రంలో చేసిన కోర్సుకు మరో రాష్ట్రంలో గుర్తింపు దక్కడం లేదు. ఇకపై దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమల్లోకి తేనుండటంతో కోర్సు స్థాయిని బట్టి జాతీయ స్థాయిలో కామన్‌‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌‌ నిర్వహించనున్నారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో పాసైతేనే కోర్సు సర్టిఫికెట్ రిజిస్ర్టేషన్‌‌ చేస్తారు.

అవకాశాలు పెరుగుతయి

కొత్త వ్యవస్థతో హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కోర్సుల స్టాండర్డ్స్‌‌ ఇంప్రూవ్ అవుతయి. అమెరికా, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా సహా పలు దేశాల్లో ఈ తరహా వ్యవస్థ ఉంది. నేషనల్ లెవల్‌‌లో ఒకే వ్యవస్థ ఉండడం వల్ల ఎంప్లాయ్‌‌మెంట్ అవకాశాలు కూడా పెరుగుతయి. ఇక్కడ కోర్సు సర్టిఫికెట్లతో విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకునే చాన్స్​ ఉంటుంది.                                                                                – డాక్టర్ గంగాధర్‌‌‌‌, ప్రొఫెసర్, నిమ్స్‌‌

మరిన్ని వార్తల కోసం