నియంత పాలన అంతమైంది: టపాసులు పేల్చి ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు

నియంత పాలన అంతమైంది: టపాసులు పేల్చి ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నియంత పాలన అంతమై.. ప్రజాస్వామ్యం గెలిచిందని... కాంగ్రెస్ గెలుపు ఆర్టీసీ గెలుపుగా భావిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.  డిసెంబర్ 5వ తేదీ మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.  

కేసీఆర్ ఆర్టీసీతో అన్ని శాఖల ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశాడని... అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పామని అన్నారు. పరిగి ఎమ్మేల్యే గా గెలుపొందిన రామ్మోహన్ రెడ్డి.. మంత్రిగా పరిగి తిరిగి వస్తారని ఆర్టీసీ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతమొందించేందుకు ఆర్టీసీ కార్మికులంతా శపథం చేసుకొని కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేశారని తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ హన్మంతు ముదిరాజ్ అన్నారు.

పదేళ్ళ కేసీఆర్ పాలన బ్రిటిష్ పాలనగా కొనసాగిందని.. యూనియన్లు రద్దు చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఆయన  విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో ఆర్టీసీ ఇంకా బలోపేతం అవుతుందని హన్మంతు ఆశాభావం వ్యక్తం చేశారు.