పార్లమెంట్​ సమావేశాలు ముందే ముగిసినయ్​

పార్లమెంట్​ సమావేశాలు ముందే ముగిసినయ్​
  • షెడ్యూల్ కంటే 6 రోజుల ముందే ఉభయసభలు నిరవధికంగా వాయిదా  
  • క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నిర్ణయం 

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ కంటే 6 రోజుల ముందుగానే ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఈ నెల 7న మొదలైన శీతాకాల సమావేశాలు 29 వరకూ జరగాల్సి ఉండగా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన సమావేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం మేరకు సమావేశాలను శుక్రవారమే ముగించారు. క్రిస్మస్ పండుగ, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో సమావేశాలను ముగించాలని ఉభయసభల్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో మొత్తం 13 సిట్టింగ్​లలో ఏడు బిల్లులు పాస్ అయ్యాయని, 97% ప్రొడక్టివిటీ నమోదైందని స్పీకర్ వెల్లడించారు. రాజ్యసభలో 13 సిట్టింగ్ లలో 102% ప్రొడక్టివిటీ నమోదైందని చైర్మన్ జగ్​దీప్ ధన్​కర్ తెలిపారు. రాజ్యసభ మొత్తం 64.50 గంటల పాటు నడిచిందన్నారు. చైనాతో గొడవ అంశంపై చర్చ చేపట్టాలంటూ ఉభయసభల్లోనూ ప్రతిపక్షాల సభ్యులు నిరసనలు చేయగా, ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఇదే అంశంపై ఉభయసభలు అనేక సార్లు వాయిదాపడ్డాయి. కాగా, పార్లమెంట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే ముగియడం వరుసగా ఇది ఎనిమిదోసారి.

సోనియా కామెంట్లపై రాజ్యసభలో వాగ్వాదం

న్యాయవ్యవస్థను చట్టవిరుద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఈ నెల 21న చేసిన కామెంట్లపై శుక్రవారం రాజ్యసభలో చైర్మన్ జగ్​దీప్ ధన్​కర్​కు కాంగ్రెస్ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాను చేసిన ప్రమాణానికి న్యాయం చేశానని, సోనియా కామెంట్లపై స్పందించకపోతేనే తన రాజ్యాంగబద్ధమైన విధిని సరిగ్గా నిర్వర్తించనట్లు అయ్యేదని చైర్మన్ అన్నారు. న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా మంత్రులు మాట్లాడేందుకు అనుమతించారని, సభలో పక్షపాతం చూపుతున్నారని సోనియా అనడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. చైర్మన్ కామెంట్లను లీడర్ ఆఫ్ ది హౌస్ పీయూష్ గోయల్ సమర్థించగా, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఖర్గే, కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ, బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, తదితరులు ఖండించారు. బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించడం సరికాదని ఖర్గే అన్నారు. చైర్మన్ కామెంట్లను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. అయితే, ఖర్గే డిమాండ్​ను చైర్మన్ తోసిపుచ్చారు.