గ్రేటర్ పరిధిలో ఎండిపోయిన చెరువులు 33: పీసీబీ రిపోర్ట్

గ్రేటర్ పరిధిలో ఎండిపోయిన చెరువులు 33: పీసీబీ రిపోర్ట్
  • అభివృద్ధి పేరుతో పూడ్చివేతలు.. అదును చూసి కబ్జాలు
  • కొన్ని చెరువులు రికార్డుల్లో ఉన్నా ఫిజికల్‌‌గా కనిపిస్తలేవని వెల్లడి
  • భారీ వర్షాలు కురిసినా ఎండిపోయాయంటే కబ్జాకు గురైనట్లే: పర్యావరణవేత్తలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో చెరువులు మాయమవుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో కనుమరుగైపోగా.. ఉన్నవి కూడా కబ్జాకు గురైతున్నాయి. రోజురోజుకూ కుంచించుకుపోయి.. చివరికి రికార్డుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి.ఇటీవల పీసీబీ (పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​) రిలీజ్ చేసిన రిపోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో 33 చెరువులు ఎండిపోయాయని, కొన్ని రికార్డుల్లో తప్ప ఎక్కడున్నాయో తెలియడం లేదని, ఇంకొన్ని కబ్జాకు గురయ్యాయని పీసీబీ చెప్పింది. భారీ వర్షాలు కురిసినా చెరువులు ఎండిపోయాయంటే.. అవి కబ్జాకు గురైనట్లేనని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనావాసాల్లో ఉన్న ప్రతి చెరువు కూడా ఎంతో కొంత కబ్జాకు గురైందని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. ప్రజాప్రతినిధుల అండతో కబ్జాకోరులు చెలరేగిపోతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ఒకవైపు నుంచి పూడ్చుకుంటూ వచ్చి.. కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు వేసి.. బిల్డింగులు కడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. తమ కళ్ల ముందే కనుమరుగు అవుతున్న చెరువుల గురించి స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎకరాల విస్తీర్ణంలో ఉండే చెరువులను చిన్న కుంటలుగా మార్చేసి, కబ్జా చేస్తున్నారంటూ తరచూ నిరసనలు చేపడుతున్నారు.

ఉన్న వాటినీ పట్టించుకుంటలే

శివార్లతో కలుపుకుంటే హైదరాబాద్‌‌ పరిధిలో ఒకప్పుడు 1,500కు పైగా చెరువులు ఉండేవి. కాలక్రమంలో చాలా వరకు కనుమరుగయ్యాయి. పోయినవి పోగా ఉన్న వాటినైనా కాపాడుతామని చెప్పిన జీహెచ్‌‌ఎంసీ.. తన పరిధిలో 185 చెరువులున్నట్లు కొంత కాలం కిందట ప్రకటించింది. అయితే వాటిని కూడా కాపాడడంలో ఫెయిల్ అవుతున్నది. గ్రేటర్ పరిధిలో 33 చెరువులు ఎండిపోయాయని పీసీబీ ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చింది. వీటిలో 22 చెరువులు చెత్తాచెదారంతో నిండిపోయి రూపురేఖలు కోల్పోయాయని పేర్కొంది. 

కొన్ని చెరువులు రికార్డుల్లో ఉన్నా ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించడం లేదని పీసీబీ చెప్పుకొచ్చింది. హఫీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలోని మంగళవాణి కుంట, ఖాజాగూడలోని తౌతుకుంట పేర్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ.. అవి ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని, ఖానామెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఖానామెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మసీదుబండ చెరువులు కబ్జాకు గురయ్యాయని పేర్కొంది.

35 శాతం ఎక్కువ వర్షాలు పడినా..

వానాకాలంలో సిటీలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. వర్షపాతం సాధారణం కంటే 35% ఎక్కువ నమోదైంది. అయినప్పటికీ గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 33 చెరువుల్లో చుక్కనీరు లేదని, పూర్తిగా ఎండిపోయాయని పీసీబీ తన రిపోర్టులో వెల్లడించింది.ఇందులో అంబర్ పేట్ బతుకమ్మ కుంట, షేక్ పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హకీంపేట్ కుంట, కొత్త కుంట, జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చిరన్ కుంట, ఐఎస్ సదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎర్రకుంట, లాలగూడలోని ఎర్రకుంట, బార్కాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గుర్రం చెరువు, ఈసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మంగళవాణి కుంట, హైదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కిందికుంట, మూసాపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఖైత్లాపూర్ కుంట, కూకట్ పల్లిలోని భీముని కుంట, నల్లచెరువు, బాలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అలీతలాబ్, అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మైసమ్మకుంట, బిసోన్ కుంట, మల్కాజిగిరిలోని భవానీనగర్ కుంట, అల్వాల్ లోతుకుంటలోని గోపాల్ ట్యాంక్, కౌకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కౌకూర్ కుంట, కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హెచ్ఎంటీ లేక్, గాజులరామారంలోని కొత్తకుంట, దొడ్లవానికుంట, కల్మన్నకుం ట, బోగందాని కుంట, సూరారంలోని పంతుల్ చెరువు, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎన్ఐఆర్డీ లేక్ ఉన్నాయి.
చెరువుల చుట్టూ కంచె ఏర్పాటు, మురుగునీటి మళ్లింపు, చుట్టూ వాకింగ్ ట్రాక్, లైటింగ్, తదితర పనుల కోసం జీహెచ్ఎంసీ ఐదేండ్లలో రూ.481 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో కిందటేడాది అత్యవసర మరమ్మతుల కోసం రూ.9.42 కోట్లు, మరో రూ.94.17 కోట్లతో 63 చెరువుల వద్ద వివిధ పనులు చేపట్టింది. రూ.282 కోట్ల మిషన్ కాకతీయ నిధులతో 19 చెరువుల పనులు చేపట్టారు. రూ.95.54 కోట్లతో 61 చెరువులకు వెళ్లే రోడ్లను బాగు చేసేందుకు జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

పనులు చేసేందుకే నీళ్లు ఖాళీ చేసినం

ఎకరం, రెండు ఎకరాల్లో ఉన్న చిన్న కుంటలు, చెరువులు ఎండిపోయినట్లున్నాయి. వర్షాలు కురిసిన సమయంలో నీరు చేరుతుంది. వర్షాలు తగ్గిన తర్వాత అవి ఇంకిపోతున్నాయి. కానీ పూర్తిగా డ్రై అయితే కాలేదు. కొన్ని చెరువుల మరమ్మతులు చేస్తున్నాం. అందుకోసమే కొంతమేర నీటిని ఖాళీ చేశాం. 60 చెరువుల్లోకి మురుగు నీరు రాకుండా పనులు చేస్తున్నం. - నారాయణ, జీహెచ్ఎంసీ ఈఈ

ఎందుకు ఎండిపోతున్నయ్

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెరువులను అధికారులు పట్టించుకోవడంలేదు. కొన్ని చెరువులు మాయమైనట్లు అధికారిక రిపోర్టులోనే ఉంది. చాలా చెరువులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తున్నది. నీళ్లులేక 30 చెరువులు ఎండిపోయినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వర్షాకాలంలో 35 శాతం అధిక వర్షపాతం నమోదైనా చెరువులు ఎందుకు ఎండిపోతున్నాయి. ఇట్లా జరుగుతున్నదంటే పూర్తిగా కబ్జాకు గురైనట్లేనని అనిపిస్తున్నది. చెరువుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఉన్న చెరువులు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పీసీబీ రిపోర్టుని ఎవరూ పట్టించుకోవడం లేదు.  - ప్రొఫెసర్ బీబీ సుబ్బారావు, పర్యావరణవేత్త

వాకింగ్ ట్రాక్ పేరుతో కబ్జా

మాదాపూర్ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఖానామెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న మొండికుంట చెరువును వాకింగ్ ట్రాక్ పేరుతో కబ్జా చేస్తున్నారని ఇటీవల స్థానికులు ఆందోళన చేపట్టారు. బిల్డింగ్ మెటీరియల్, ఇతర వ్యర్థాల్ని చెరువులో వేస్తూ నెమ్మదిగా దాన్ని పూడ్చివేసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. వాకింగ్ ట్రాక్ పేరుతో సగం చెరువును మాయం చేస్తున్నారని, అధికారులు ఈ తతంగాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

కబ్జాదారులకు మేలు చేసేలా

చెరువుల బ్యూటిఫికేషన్ చేపడుతున్నామని, చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌‌లు ఏర్పాటు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అభివృద్ధి పనులు చేసే ముందు చెరువుల ఎఫ్‌‌టీఎల్ బౌండరీల హద్దులను గుర్తించాల్సి ఉంది. కానీ ఇదేమీ పట్టించుకోకుండా చెరువుల మధ్య లో నుంచి ట్రాక్‌‌లు ఏర్పాటు చేస్తున్నామని మట్టిపోస్తున్నారు. దీంతో చెరువుల చుట్టూ కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు. శేరిలింగంపల్లిలోని మొండికుంట చెరువులో వాకింగ్ ట్రాక్ అంటూ మధ్యలో నుంచి మట్టిపోస్తున్నారు. ఆర్కే పురం చెరువు చుట్టూ కూడా మట్టిపోస్తున్నారు. ఇలా చెరువుల హద్దులను గుర్తించకుండా పనులు చేస్తుండడంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.

పీసీబీ ఇస్తున్న రిపోర్టులను జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదు.చెరువులు ఎండిపోతున్నాయని చెబుతున్నా బేఖాతర్ చేస్తున్నారు. చెరువులను కాపాడుకునేందుకు బల్దియాలో ఓ స్పెషల్ కమిషనర్‌‌‌‌ని నియమిస్తామని 2020 సెప్టెంబర్‌‌‌‌లో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చెరువులు, ఇతర జల వనరులను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించే బాధ్యతను స్పెషల్ కమిషనర్‌‌‌‌కి అప్పగిస్తామన్నారు. కానీ కమిషనర్‌‌‌‌ను నియమించలేదు.