భూ కబ్జాలకు పాల్పడుతున్న రౌడీషీటర్‌పై పీడీ యాక్టు.. సెంట్రల్ జైలుకు తరలింపు

భూ కబ్జాలకు పాల్పడుతున్న రౌడీషీటర్‌పై పీడీ యాక్టు.. సెంట్రల్ జైలుకు తరలింపు
  • రామకృష్ణ యాదవ్‌పై కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 14 క్రిమినల్ కేసులు
  • భార్యను రాజకీయాల్లోకి దింపి యధేచ్చగా దౌర్జన్యాలు

కర్నూలు: భూ ఆక్రమణలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ రామకృష్ణ యాదవ్  పై కర్నూలు జిల్లా పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు.  రామకృష్ణ యాదవ్‌పై కర్నూలు జిల్లాతోపాటు పొరుగున ఉన్న తెలంగాణ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం 14 క్రిమినల్ కేసులు ఉన్న రామకృష్ణ యాదవ్ ను పోలీసులు పీడీ యాక్టు కింద అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం మొదలైన నేపధ్యంలో పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా పెట్టిన పోలీసులు క్రిమినల్ కేసులున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఏవరైనా చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే పిడి యాక్టు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలిస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి స్పష్టం చేశారు.

భార్యను రాజకీయాల్లో దింపి.. ఆమె పేరు చెప్పి అధికారులపై ఒత్తిడి తెచ్చి..

రౌడీ షీటర్ రామకృష్ణ యాదవ్ (44)  తండ్రి పేరు  జి. వెంకటేశ్వర్లు.  ఇతని స్వస్ధలం కర్నూలు నగర శివార్లలోని నేషనల్ హైవే-44ను ఆనుకుని ఉన్న స్టాంటన్ పురం  గ్రామం. సుమారు 17 ఏళ్ల క్రితం  హైవే శివార్లలో ఉన్నఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న సమయంలో  భార్య లక్ష్మిదేవిని రాజకీయాల్లో దింపాడు. బడా నేతలను ప్రసన్నం చేసుకుని వారి అండతో ఎంపీపీ సీటును సాధించుకున్నాడు. భార్య లక్ష్మిదేవి కర్నూలు మండలాధ్యక్షురాలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో యధేచ్చగా దౌర్జన్యాలు ప్రారంభించాడు. బడాబాబుల అండ ఉందని భావించి అప్పట్లో అనేక మంది మౌనం వహించారు. అధికారులు కూడా చూసీ చూడనట్లు ప్రేక్షకపాత్ర పోషించారు. దీంతో రామకృష్ణ ఆగడాలకు అంతులేకుండా పోయింది. రాజకీయ నేతల ప్రాపకంతో అధికారం రుచి చూసిన రామకృష్ణ వెనుదిరిగి చూడలేదు. భార్య పేరుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి దందాలు చేశాడు. అడ్డుకునేవారే లేకపోవడంతో జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటేశాడు. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్ర పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా యధేచ్చగా దౌర్జన్యాలకు పాల్పడ్డాడు.  ఏమాత్రం మెత్తగా కనిపించినా .. వెంటనే విశ్వరూపం చూపించేవాడు. ఆగడాలు శృతి మీరడంతో  రామకృష్ణ యాదవ్  పై కర్నూలు జిల్లాతో పాటు  జోగులాంబ(తెలంగాణ రాష్ట్రం) జిల్లాలో మొత్తం 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.  కర్నూలు పట్టణంలోని అన్ని పోలీసు స్టేషన్లతోపాటు.. గద్వాల జిల్లాలోని ఉండవల్లి పోలీసుస్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ రుచి మరిగి ఫోర్జరీలు, తప్పుడు దస్తావేజులను  సృష్టించి అమాయకుల భూములను ఆక్రమించుకోవడం, బాధితులను కోర్టుల లాగి కాలపయాపన చేస్తూ మనోవేదన కు గురి చేయడం, బాధితుల భూములను సెటిల్ మెంట్ ద్వారా గాని, బలవంతంగా లాక్కోవడమే పనిగా పెట్టుకోవడంతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చట్ట వ్యతిరేక కార్యకలపాలపై  కర్నూలు మరియు జోగులాంబ జిల్లాలో 14 కేసులలో పలు సార్లు రిమాండుకు పోయి వచ్చినా ఇతని  ప్రవర్తనలో మార్పు రాలేదు . ఇతని ప్రవర్తనలో మార్పు రావాలని  పిడి యాక్టు నమోదు చేసి  కడప సెంట్రల్ జైలుకి తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. రాజకీయ అండదండలున్నట్లు చెలామణి కావడంతో మొదట్లో కేసులు లేకుండా చూసుకున్నాడు. అయితే రానురాను మరీ మితిమీరడంతో తమకు చెడ్డపేరొస్తుందని గుర్తించిన నేతలు కూడా రామకృష్ణను దూరం పెట్టారని సమాచారం. దీంతో బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో పోలీసు కేసులు నమోదు చేశారు. ఎప్పుడో 2003 సంవత్సరంలోనే రాజకీయాల్లో చేరిన రామకృష్ణ చాలా కాలం తనపై కేసులు నమోదు కాకుండా చూసుకున్నాడు.  అనేక కేసుల్లో సాక్షాధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. బాధితుల సంఖ్య పెరగడంతో.. చివరకు  కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ నెంబర్ 167 గా నమోదు అయింది. ఒక్కసారి పోలీసు రికార్డులకెక్కడంతో ఇక ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో  2016 నుండి ఇప్పటివరకు 14 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు తాము చేసిన ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోలేదంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలో  ప్రత్యర్థి రాజకీయ పార్టీల వారే కాదు.. సొంత పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న రామకృష్ణ యాదవ్ ను జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలతో కర్నూలు తాలుకా సిఐ విక్రమసింహో ఇవాళ శనివారం తన సిబ్బందితో రౌండ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. గట్టి బందోబస్తు మధ్య కడప సెంట్రల్ జైలుకి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఆదాయం లేక 31 స్టేషన్లు మూసివేయనున్న దక్షిణ మధ్య రైల్వే

ఒకప్పుడు క్వింటం పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది

పీఆర్సీపై టీచర్ల ఆగ్రహం.. త్రివేణి సంగమంలో పీఆర్సీ ప్రతుల నిమజ్జనం

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ

రాష్ట్రంలో ఆర్టీఐ యాక్ట్ బేఖాతర్ : ఇన్ఫర్మేషన్ దాస్తున్నరు!