పల్లి పంటను వదిలేస్తున్నపాలమూరు రైతులు.. పలకని గిట్టుబాటు ధర.. ఏటేటా పెరిగిపోతున్న సీడ్‌‌ ధరలు, పెట్టుబడులు

పల్లి పంటను  వదిలేస్తున్నపాలమూరు రైతులు.. పలకని గిట్టుబాటు ధర.. ఏటేటా పెరిగిపోతున్న  సీడ్‌‌ ధరలు, పెట్టుబడులు
  • వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా పడిపోతున్న దిగుబడులు
  • సరైన మార్కెటింగ్ లేక ముంచుతున్న దళారులు
  • గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 51 వేల ఎకరాలకు పైగా తగ్గిన సాగు
  • ఏటేటా పెరిగిపోతున్న  సీడ్‌‌ ధరలు, పెట్టుబడులు
  • చేతికొచ్చిన పంటకు దక్కని ధర
  • ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్న రైతులు

మహబూబ్‌‌నగర్, వెలుగు : పల్లి సాగుకు ఫేమస్ అయిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పంట సాగు క్రమంగా తగ్గిపోతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు పల్లి సాగుకు అనుకూలించకపోవడంతో దిగుబడి గణనీయంగా పడిపోతోంది. 

దీనికి తోడు సరైన మార్కెటింగ్ వసతి లేక మద్దతు ధర దక్కడం లేదు. దీంతో పల్లి సాగును తగ్గిస్తున్న రైతులు.. ప్రత్యామ్నాయ పంటలైన వరి, మినుము, ఆముదం, మక్కల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది రెండు లక్షల ఎకరాలకు పైగా పల్లి సాగు జరుగగా.. ఈ సారి 1.50 లక్షల ఎకరాలకు లోపే సాగైంది. గత యాసంగి సీజన్‌‌లో అత్యధికంగా సాగైన పంటల్లో పల్లి రెండో స్థానంలో నిలవగా.. ఈ యాసంగిలో మాత్రం మూడో స్థానానికి పడిపోయినట్లు ఆఫీసర్లు తెలిపారు.

వాతావరణ మార్పులతో పడిపోయిన దిగుబడి

గత మూడేండ్లుగా పల్లి దిగుబడి తగ్గిపోతూ వస్తోంది. గతేడాది నవంబరు, డిసెంబర్‌‌ నెలల్లో అకాల వర్షాలు .. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో తీవ్రమైన చలిగాలులు.. దీనికి తోడు ఆకాశం మబ్బుపట్టి ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వెలుతురు సరిగా లేకపోవడంతో పూత, ఊడల దశలో పల్లి పంటకు తెగుళ్లు సోకాయి. ఈ ప్రభావం దిగుబడులపై పడింది. 

ప్రధానంగా ఊడ తెగులు సోకిన టైంలో పల్లి మొక్క ఊడలకు కాయలు పట్టక కాపు తగ్గిపోగా, ఆకుమచ్చ తెగులు సోకిన టైంలో పల్లికాయలు లొట్టపోయాయి. వీటికి తోడు ఆకుముడత తెగులు, లద్దె పురుగు ఆశించడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు 30 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా.. 12 బస్తాలు కూడా రాకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

మార్కెట్‌‌లో దక్కని మద్దతు ధర

ఒక ఎకరంలో వేరుశనగ సాగుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గినా.. వచ్చిన పంటనైనా అమ్ముకుందామని మార్కెట్లకు తరలిస్తే అక్కడా నిరాశే ఎదురవుతోంది. 

రెండు, మూడేండ్ల నుంచి పల్లికి మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాల్‌‌ పల్లికాయ రూ.8 వేల నుంచి రూ.9 వేలు పలకాల్సి ఉన్నా ఆ రేటు చెల్లించేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. 2023 జనవరి సీజన్‌‌ మొదట్లో క్వింటాల్‌‌ పల్లి రూ.9 వేల వద్ద ప్రారంభమై రూ.8,500, తర్వాత రూ.8 వేలకు చేరుకొని సీజన్‌‌ చివరికి వచ్చే సరికి రూ.7,100కు చేరింది. 

తర్వాత సీజన్‌‌ మొదట్లోనే రేట్లు అమాంతం పడిపోయాయి. ఆ సీజన్‌‌లో క్వింటాల్‌‌ కాయకు రూ.5,800 నుంచి రూ.6,210కు మించి రాలేదు. ధరలు భారీగా తగ్గిపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదంటూ రైతులు వేరుశనగ సాగుకు దూరంగా ఉంటున్నారు.