ఆండ్రాయిడ్ మినీ ఫోన్..అధునాతన ఫీచర్లు

ఆండ్రాయిడ్ మినీ ఫోన్..అధునాతన ఫీచర్లు

స్మార్ట్ ఫోన్ అంటే ఎలా ఉండాలి...భారీ సైజులో స్క్రీన్..అద్భుతమైన ఫీచర్లు. ఇలాంటి ఫోన్లకే ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఎంత తక్కువకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో అందిస్తున్నా...వినియోగదారులు మాత్రం  స్క్రీన్ సైజుతో పాటు అధునాతన ఫీచర్లు ఉంటేనే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం పెద్ద ఫోన్లను వాడేందుకు ఇష్టపడరు. తమ జేబులో ఇమిడే విధంగా లేదా..పర్సు సైజులో ఫోన్లు ఉంటే బాగుండు అనుకుంటారు. అలాంటి వారి కోసం పెబుల్  అనే స్మార్ట్‌వాచ్‌ తయారీ కంపెనీ.. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ మినీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ మినీ ఫోన్‌ కోసం పెబుల్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎరిక్‌ మిగికోవ్‌స్కీ  ఆండ్రాయిడ్ ఫోన్ ప్రాజెక్ట్‌ ను 2022 మేలో  ప్రారంభించారు. దీని ద్వారా గూగుల్, శామ్ సంగ్ వంటి  పెద్ద కంపెనీలతో కలిసి మినీ  ఆండ్రాయిడ్ ఫోన్‌ తరహా ఫీచర్స్‌తో ఆండ్రాయిడ్ మినీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించారు.  అయితే ఇందుకు  పెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు  ఆసక్తి కనబరచలేదు. దీంతో అతనే  తన కంపెనీ ద్వారా మినీ  ఆండ్రాయిడ్ ఫోన్‌ను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నారు. 

ఫీచర్లు ఎలా ఉంటాయంటే..

మినీ ఆండ్రాయిడ్ ఫోన్ ప్రాజెక్ట్ గురించి  చర్చలు కొనసాగుతున్నాయి.  స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసే టీమ్  ప్రస్తుతం ఫోన్ డిస్‌ప్లే ఎంత ఉండాలి...స్మార్ట్‌ఫోన్ యొక్క బాడీ వంటి వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. ఈ  ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి అవసరమైన నిధులను సేకరించేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎరిక్ మాత్రం మినీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను వెల్లడించారు. పెబుల్ కంపెనీ తయారు చేసే ఈ ఫోన్   ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేయనుందని చెప్పారు. చేతిలో ఇమిడిపోయే డిజైన్‌ తో పాటు.. అత్యుత్తమ క్వాలిటీ కెమెరా లెన్స్‌  ఉంటాయన్నారు.  బ్యాటరీ కెపాసిటీ కూడా సాధారణ స్మార్ట్ ఫోన్ కు ధీటుగా ఉంటుందని తెలిపారు.  తాము మినీ ఆండ్రాయిడ్ ఫోన్ ను తయారు చేసిన తర్వాత గూగుల్, శాంసంగ్‌ వంటి కంపెనీలు సైతం ఈ మినీ మోడల్స్‌ను తయారు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 
గతంలో ఆపిల్..

గతంలో యాపిల్‌  కంపెనీ చిన్న స్క్రీన్‌తో ఐఫోన్ SE ఫోన్ ను లాంఛ్ చేసింది. దీనికి అప్‌గ్రేడేషన్‌లో భాగంగా తీసుకువచ్చిన  ఐఫోన్‌ SE 2, SE 3 మోడ్సల్ స్క్రీన్‌ సైజ్‌లను పెంచింది. ఆ  తర్వాత ఐఫోన్‌ 13 మోడల్‌లో మినీ వేరియంట్‌ను పరిచయం చేసింది. అయితే ఈ ఫోన్ అమ్మకాల పరంగా సక్సెస్ కాలేదు. దీంతో వాటి తయారీని నిలిపివేసింది. తాజాగా పెబుల్ స్మార్ట్‌వాచ్‌ తయారీ కంపెనీ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ మినీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.