
తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూస్తుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. గోదావరిఖని మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారుల నిర్లక్ష్యం వల్లే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (RFCL)లో సాంకేతిక లోపాలు తలెత్తాయని కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించామన్నారు.
50 వేల టన్నుల యూరియా
తెలంగాణకు వచ్చే కోటాను పూర్తిస్థాయిలో అందించాలని కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. తొమ్మిది లక్షల టన్నుల యూరియాకు గాను నాలుగున్నర లక్షల టన్నులను మాత్రమే ఇచ్చారని అన్నారు. తెలంగాణకు 50 వేల టన్నుల యూరియాను అందిస్తామని నడ్డా హామీ ఇచ్చారని ఎంపీ వంశీ తెలిపారు. వచ్చే వారం పది రోజుల్లో 25 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి అందిస్తామని చెప్పారన్నారు. దేశ ప్రధాని గ్రౌండ్ లెవల్ లోకి వచ్చి ఫ్యాక్టరీలో జరిగే లోపాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈఎస్ఐ ఆస్పత్రికి టెండర్
రామగుండం విమానాశ్రయంపై ఇప్పటికే కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు ఎంపీ వంశీ. ఎయిర్ పోర్టుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి కు ఎనిమిది నుంచి పది విమానాశ్రయాలు ఉంటే తెలంగాణలో మాత్రం ఒకే ఒక విమానాశ్రయం ఉందన్నారు. రామగుండం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని పార్లమెంటులో ప్రస్తావించామన్నారు. త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఆసుపత్రిని నెలకొల్పాలని కోరామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ESI ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల కలిశామని చెప్పారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే 150 కోట్లతో ESI ఆసుపత్రి టెండర్ పనులకు పిలిచిందన్నారు.
►ALSO READ | ఇంటి నెంబర్ అలాట్ చేయడానికి లంచం.. కరీంనగర్ జిల్లాలో ఏసీబీ చేతికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
కన్నాల బ్రిడ్జికి రూ. 80కోట్లు
పాలకుర్తి మండలం కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కేంద్ర మంత్రులను రైల్వే అధికారులను కలిశామన్నారు ఎంపీ వంశీ. రూ. 80 కోట్ల నిధులతో నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. త్వరితగతిన పనులను ప్రారంభించి ప్రజా రవాణా మెరుగుపడేలా చూస్తామన్నారు ఎంపీ వంశీ. ఫ్లడ్ ఏరియాల్లో మునిగిన పంట పొలాలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందన్నారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వంశీ. భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సహాయం కావాలన్నా అధికారులకు , ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని చెప్పారు ఎంపీ వంశీ.
బీజేపీకి భయం
ప్రజల్లో ఉనికి కోల్పోతామనే భయం బీజేపీకి పట్టుకుందన్నారు ఎంపీ వంశీ. బీజేపీ ఓటు చోరీ చేసిందని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. ప్రశ్నించే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కు ను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతామన్నారు.