స్ట్రీమ్ ఎంగేజ్

స్ట్రీమ్ ఎంగేజ్

దివ్యకు ఏమైంది? 

టైటిల్‌‌: ఫాల్, కాస్ట్‌‌: అంజలి, ఎస్పీ చరణ్, సంతోష్ ప్రతాప్, సోనియా అగర్వాల్, లాంగ్వేజ్: తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ, ప్లాట్‌‌ఫాం: డిస్నీప్లస్ హాట్‌‌స్టార్, డైరెక్షన్‌‌: సిద్ధార్థ్ రామస్వామి

దివ్య(అంజలి)ది బాగా డబ్బున్న ఫ్యామిలీ. ఆమె తన తల్లితో గొడవ పడి విడి​గా ఉంటుంది. బతకడానికి స్పోర్ట్స్ సెంటర్ నడుపుతుంది. ఒకరోజు రాత్రి మలార్​ (సోనియా అగర్వాల్) కు డేనియల్(సంతోష్ ప్రతాప్) గురించి ఒక విషయం చెప్పాలని వాయిస్​ మెసేజ్ పెడుతుంది. అదే రోజు రాత్రి తను ఉంటున్న బిల్డింగ్​ మీద నుంచి కింద పడుతుంది. హాస్పిటల్​కి తీసుకెళ్తే కోమాలోకి వెళ్లిందని చెప్తారు డాక్టర్లు. కొన్ని నెలల పాటు కోమాలో ఉంటుంది. కోమా నుంచి బయటకు వస్తుంది. కానీ.. గతం మర్చిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె బిల్డింగ్​ నుంచి ఎలా కింద పడింది? అనేది వెబ్​ సిరీస్​ చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలే కాదు.. వెబ్​ సిరీస్​లను రీమేక్​ చేసే ట్రెండ్​ కూడా మొదలైంది. ఈ వెబ్​ సిరీస్​ ‘వర్టీజ్’ అనే కెనడా వెబ్ సిరీస్‌‌కి రీమేక్​. అయితే.. పూర్తి కథ తెలుసుకోవాలంటే మరికొన్ని ఎపిసోడ్లు రిలీజ్​ అయ్యేవరకు వెయిట్​ చేయాలి. ఈ సిరీస్​కు మైనస్​.. కథ చాలా స్లోగా నడపడం. 

ట్విన్స్​ 


టైటిల్‌‌: బ్లర్​​
కాస్ట్‌‌: తాప్సీ పన్ను, గుల్షన్ దేవయ్య, అభిలాష్​ తప్లియాల్​, కృతికా దేశాయ్
లాంగ్వేజ్: హిందీ 
ప్లాట్‌‌ఫాం: జీ5 
రన్​టైం: 146 నిమిషాలు 
డైరెక్షన్‌‌: అజయ్ బెహల్ 

మ్యుజిషియన్​ గౌతమి (తాప్సీ)కి కళ్లు కనిపించవు. సడెన్​గా ఒకరోజు తన ఇంట్లోనే ఉరేసుకుంటుంది. పోలీసులు ఇన్వెస్టిగేట్​ చేసి ఆమెది ఆత్మహత్య అని తేల్చేస్తారు. అది ఆత్మహత్య కాదని.. కచ్చితంగా ఎవరో హత్య చేశారని గౌతమి ట్విన్ సిస్టర్ గాయత్రి(తాప్సీ) అనుకుంటుంది. కానీ.. ఆమె మాటలను భర్త నీల్ (గుల్షన్ దేవయ్య) సహా పోలీసులు కూడా కొట్టిపారేస్తారు. అయినా.. తన సిస్టర్​ చావుకు కారణమేంటో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. అప్పటినుంచి ఆమెను ఎవరో వెంటాడటం మొదలుపెడతారు. అంతేకాదు.. గాయత్రికి డీజనరేటివ్ ఐ డిజార్డర్ వస్తుంది. ఈ జబ్బు వచ్చినవాళ్లకు నెమ్మదిగా చూపు తగ్గుతూ చివరికి కళ్లు పూర్తిగా కనిపించవు. అయితే.. ఆమెకు జబ్బు రావడానికి కారణమేంటి? ఆమెను వెంటాడేది ఎవరు? గౌతమిది ఆత్మహత్యా? హత్యా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ఈ సినిమా స్పానిష్ ఫిల్మ్ జూలియ‌‌స్ ఐస్‌‌కు రీమేక్‌‌గా తెర‌‌కెక్కింది. వాస్తవానికి ఇది సింపుల్​ స్టోరీ. చాలా తక్కువ టైంలో చెప్పేయొచ్చు. కానీ.. దీనికి కొన్ని ట్విస్ట్​లు యాడ్​ చేసి, సైక‌‌లాజిక‌‌ల్ థ్రిల్లర్​గా మలిచారు. కొన్నిసార్లు కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. తాప్సీని వెంటాడుతున్నది ఎవరనేది తెలుసుకోవాలనే ఆసక్తిని ఆడియెన్స్​లో కలిగిస్తూ కథను ముందుకు నడిపించాడు. స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్​గా ఉంటే బాగుండేది. తాప్సీ యాక్టింగ్​ సినిమాకు ప్లస్​ అయింది. 

పెండ్లి గోల

టైటిల్‌‌: కాఫీ విత్​ కాదల్​, కాస్ట్‌‌: జీవా, జై, శ్రీకాంత్, యోగి బాబు, మాళవిక శర్మ, అమృత అయ్యర్, రైజా విల్సన్​, 
లాంగ్వేజ్: తమిళం, ప్లాట్‌‌ఫాం: జీ5, రన్​టైం: 160 నిమిషాలు
డైరెక్షన్‌‌: సుందర్. సి.

ముగ్గురు అన్నదమ్ములు తమకున్న రిలేషన్​షిప్స్​ వల్ల ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లలో పెద్దోడు రవి (శ్రీకాంత్).. రాధిక (సంయుక్త)ని పెండ్లి చేసుకుంటాడు. కానీ.. సారా (రైజా విల్సన్)తో వన్-నైట్ స్టాండ్ రిలేషన్​ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్​ ఏంటంటే.. ఆ తర్వాత ఆమెతోనే తన తమ్ముడు శరవణన్ (జీవా)కు పెండ్లి నిశ్చయం అవుతుంది. దాంతో రవి వాళ్ల పెండ్లి ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. శరవణన్ అప్పటికే ఒక అమ్మాయి చేతిలో మోసపోతాడు. తర్వాత తన తమ్ముడికి కాబోయే భార్య దియా (మాళవిక శర్మ)తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా శరవణన్​ని ప్రేమిస్తుంది. కానీ.. తన తమ్ముడు కతిర్ (జై) కోసం తన ప్రేమను తనలోనే దాచుకుంటాడు. కతిర్​ కూడా తన చిన్ననాటి ఫ్రెండ్​ అభి (అమృత అయ్యర్)ని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విషయం అతనికి రియలైజ్​ అయ్యేలోపే పెండ్లి ఫిక్స్​ అవుతుంది. దాంతో అభి వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేసుకుంటుంది. ఇన్ని కన్​ఫ్యూజన్ల మధ్య కథ నడుస్తుంటుంది. అయితే.. చివరికి ఎవరు ఎవరిని చేసుకున్నారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఈ సినిమాలో కన్​ఫ్యూజన్​ వల్లే కామెడీ పుడుతుంది. చివరి 20 నిమిషాలు మాత్రం సినిమా బోరింగ్​గా ఉంటుంది. యోగిబాబు కామెడీ సినిమాకే హైలైట్. యాక్టింగ్​ విషయానికి వస్తే..అందరూ బాగానే నటించారు. కొన్ని కామెడీ ట్రాక్​లు ఇదివరకే ఎక్కడో చూశామనిపిస్తుంది.