మున్సిపాలిటీల్లో పర్మినెంట్​ డంపింగ్​ యార్డులు లేవు

మున్సిపాలిటీల్లో పర్మినెంట్​ డంపింగ్​ యార్డులు లేవు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో పర్మినెంట్​ డంపింగ్​ యార్డులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.‌‌‌‌రోజూవారి చెత్త అంతా జనావాసాల్లో,‌‌‌‌ వీధుల్లోపేరుకుపోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో చెత్తను‌‌‌‌ఎక్కడికక్కడే‌‌‌‌ కాల్చుతున్నారు.‌‌‌‌కాలనీల్లోకి పొగవ్యాపిస్తోంది.‌‌‌‌దీంతో‌‌‌‌ ప్రజలు రోగాలపాలవుతున్నారు. కొన్ని చోట్ల వాగుల్లో, గోదావరి ఒడ్డునున్న ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయి. ప్రభుత్వం పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక పద్ధతుల్లో పర్మినెంట్​ డంపింగ్​ యార్డులను నిర్మించాలని ఆదేశించింది. తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మికంపోస్ట్​గా మార్చడం, ప్లాస్లిక్​ వ్యర్థాలను అమ్మడం ద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం సమకూర్చుకోవాలని సూచించింది. కానీ ఏండ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. ఫలితంగా ప్రజలు వాయు, జల కాలుష్యంతో రోగాలబారిన పడుతున్నారు.‌‌‌‌

జిల్లా కేంద్రంలో అధ్వాన్నం..

‌‌‌‌మంచిర్యాల పట్టణం గ్రేడ్​1 మున్సిపాలిటీ హోదా పొందినా, జిల్లా కేంద్రంగా అవతరించి ఏడేండ్లు కావస్తున్నా పర్మినెంట్​ డంపింగ్​ యార్డు లేకపోవడం ప్రజలకు శాపంగా మారింది.‌‌‌‌ రోజుకు 40 మెట్రిక్​​ టన్నులకు పైగా చెత్త‌‌‌‌వెలువడుతోంది. దీనిని కొన్నేండ్ల నుంచి అండాళమ్మ కాలనీలోని తాత్కాలిక డంపింగ్​ యార్డులో పోస్తున్నారు.‌‌‌‌పక్కనే ఉన్న అండాళమ్మ కాలనీ వాసులు విషవాయువులను పీలుస్తూ శ్వాసకోశ, గుండె, కిడ్నీ వ్యాధులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేంపల్లి శివారులో 21 ఎకరాలను డంపింగ్​ యార్డు కోసం కేటాయించగా గ్రామస్తులు కోర్టుకు వెళ్లడంతో దానికి బ్రేక్​ పడింది. తర్వాత తిమ్మాపూర్​ శివారులో 8 ఎకరాలను కేటాయించినప్పటికీ అందులో పెద్ద గుంతలు ఉండడంతో చెత్త వాహనాలు వెళ్లేందుకు వీలుగా లేదని మానుకున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో అనువైన స్థలాల కోసం వెతుకుతున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. గతంలో గోదావరి ఒడ్డున చెత్తను వేయడం వల్ల వర్షాకాలంలో నది కలుషితమైంది. డంపింగ్ యార్డుతో వేగలేకపోతున్నామని అండాళమ్మ కాలనీ వాసులు కొన్నేండ్ల నుంచి ఆందోళనలను చేస్తున్నా వారి గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు.

‌‌‌‌మున్సిపాలిటీల్లో‌‌‌‌ఇదీ పరిస్థితి.... 

నస్పూర్​ మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు లేదు. ఆర్​కే 5 కాలనీ సమీపంలోని ముక్కిడి పోచమ్మ టెంపుల్​ ఏరియాలోని సింగరేణి ఖాళీ జాగలో డంపింగ్​ చేస్తున్నారు. పొగ, కాలుష్యంతో రోగాలు వస్తున్నాయని‌‌‌‌ఆందోళన చేస్తున్నారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీలో కూడా డంపింగ్​ యార్డు నిర్మించలేదు. గోదావరి ఒడ్డుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు భూముల్లో చెత్తను పోస్తున్నారు. 

బెల్లంపల్లి మున్సిపాలిటీలో పాలిటెక్నిక్​ కాలేజీ వెనుక ప్రాంతంలో చెత్తను డంప్​ చేస్తున్నారు. రాత్రివేళల్లో చెత్త కుప్పలకు నిప్పంటించడం వల్ల సమీపంలోని కాలనీలను పొగ కమ్మేస్తోంది. కన్నాలబస్తీ, టేకులబస్తీ, మధునన్న నగర్​, గ్రౌండ్​ బస్తీ, కాంట్రాక్టర్​ బస్తీ, బజార్​ ఏరియా వరకు పొగతో ఇబ్బందులు పడుతున్నారు.

క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో కూడా పర్మినెంట్​ డంపింగ్​ యార్డు లేదు. పట్టణంలో సేకరించిన చెత్తను ఖాళీ స్థలాల్లో డంపింగ్ చేస్తున్నారు. గతంలో మూతపడ్డ సింగరేణి టింబర్​ యార్డు ఎదురుగా ఖాళీ స్థలంలో చెత్తను పోస్తున్నారు.

చెన్నూర్​ మున్సిపాలిటీలో బుద్ధారం రోడ్​లో డంపింగ్​ యార్డును నిర్మిస్తున్నారు. చాలాకాలంగా చెత్తను అక్కడే పోస్తున్నారు. మందమర్రి మున్సిపాలిటీలో కేకే 5ఏ మైన్​, చెతులాపూర్​ ఏరియాలో ఓల్డ్​ డంపింగ్​ యార్డు ఉంది. పట్టణంలో వెలువడిన చెత్తను అక్కడే డంప్ చేస్తున్నారు.‌‌‌‌ 

‌‌‌‌‌‌‌‌‘వేస్ట్​ టు వెల్త్’ ఎక్కడ...?

ప్రభుత్వం సూర్యాపేట మున్సిపాలిటీలో అమలవుతున్న 'వేస్ట్​ టు వెల్త్​' కాన్సెప్ట్​ను‌‌‌‌ ఆదర్శంగా తీసుకుని ప్రతి మున్సిపాలిటీలో‌‌‌‌డంపింగ్​ యార్డులు నిర్మించాలని ఆదేశించింది. తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మికంపోస్ట్​ తయారు చేసి మున్సిపల్​ నర్సరీల్లో వినియోగించుకోగా మిగిలిన ఎరువుల అమ్మకం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని సూచించింది.‌‌‌‌డంపింగ్​ యార్డుల్లో కాలుష్య రహితంగా, పర్యావరణానికి ఎలాంటి హాని కలగని రీతిలో చెత్తను రీసైక్లింగ్​ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం పట్టించుకోవడం లేదు.‌‌‌‌