యాదాద్రికి పోటెత్తిన జనం.. ధర్మదర్శనానికి 4 గంటలు

యాదాద్రికి పోటెత్తిన జనం.. ధర్మదర్శనానికి 4 గంటలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ‌ప్రాంతాలు కిటకిటలాడాయి. పార్కింగ్ ఏరియా, రింగు రోడ్డు, ఘాట్ రోడ్డు భక్తుల వెహికల్స్​తో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో కొందరు భక్తులు ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం గుండా కొండపైకి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. దర్శన క్యూలైన్లు నిండిపోవడంతో ఎస్పీఎఫ్ పోలీసుల సహకారంతో తాత్కాలిక క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకునేలా డైవర్షన్లు పెట్టి దర్శన భాగ్యం కల్పించారు. ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. వివిధ పూజల ద్వారా రూ.59,04,585 ఇన్ కం రాగా.. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.27,79,300, కొండపైకి వెహికల్స్​ప్రవేశంతో రూ.6 లక్షలు, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5.13 లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.4.80 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3,86,400, సత్యనారాయణస్వామి వ్రత పూజల ద్వారా రూ.2,56,700 ఆదాయం వచ్చిందని ఆలయ ఆఫీసర్లు చెప్పారు. ఆదివారం వీఐపీ టికెట్ దర్శనాలతో 3,200 మంది, బ్రేక్ దర్శన టికెట్లతో 1,288 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

శిల్ప కళాశాల షురూ

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో వైటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ శిల్ప కళాశాలను ఆదివారం ఆలయ ఈవో గీతారెడ్డి ప్రారంభించారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన శిల్ప కళాశాలలో ప్రత్యేక పూజలు చేసి క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో గీతారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి శిల్ప కళాశాల అని తెలిపారు. ఏపీలో తిరుపతిలో ఉండగా.. తెలంగాణలో మరో తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్టలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కాలేజీకి జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉందని చెప్పారు. ఇప్పటికే అడ్మిషన్స్ పూర్తయ్యాయని, అడ్మిషన్ తీసుకున్న 15 మంది స్టూడెంట్లకు ఆదివారం నుంచి క్లాసులు స్టార్ట్ అయ్యాయని తెలిపారు. అనుభవజ్ఞులైన స్తపతులతో ఆలయ సంప్రదాయ, శిల్ప, వాస్తు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, వైటీడీఏ డిప్యూటీ స్తపతి మోతీలాల్, అసిస్టెంట్ స్తపతి హేమాద్రి, యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.