గ్రీవెన్స్ ద్వారా పరిష్కారం కానీ సమస్యలు

గ్రీవెన్స్ ద్వారా పరిష్కారం కానీ సమస్యలు

గ్రీవెన్స్ అప్లికేషన్లపై ఫాలో అప్ కరువు
నిరాశ చెందుతున్న ప్రజలు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : గ్రీవెన్స్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటున్న ప్రజలకు  నిరాశే మిగులుతోంది. ప్రజావాణిలో అర్జీలు సమర్పించిన తర్వాత సిబ్బంది ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదు. పైగా అర్జీల పరిష్కారంపైనా పట్టింపు కరువైంది.  జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ప్రతి వారం నిర్వహించే గ్రీవెన్స్ లో ఇదే తంతు కనిపిస్తోంది. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో బాధితులకు ఎలాంటి రశీదులు ఇవ్వకపోగా.. కలెక్టర్ భవేశ్ మిశ్రా అర్జీలు పరిశీలించి 15రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పడం కనిపించింది.

కొందరి వినతిపత్రాలను పరిశీలన చేయకుండానే డీఆర్డీవో, ఆర్డీవో ఆఫీసుకు వెళ్లి ఇవ్వండని ఫిర్యాదుదారులను పంపించేశారు. భూసమస్యల విషయంలో మరికొందరిని సివిల్ కోర్టుకు వెళ్లండని సూచించారు. అయితే గతంలో అర్జీలు స్వీకరించి, బాధితులకు రశీదులు కూడా ఇచ్చే వారు. వాటి ఆధారంగా మండల ఆఫీసులకు వెళ్లి, తమ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకునే వాళ్లు. ఇప్పుడు అవేమీ లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన జనం నిరాశ చెందుతున్నారు.

సర్పంచ్​ను సస్పెండ్​ చేయాలి
జనగామ అర్బన్: జనగామ జిల్లా రఘునాథపల్లి సర్పంచ్ పై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం దారుణమని.. మండలానికి చెందిన గణేశ్​ఠాకూర్, మొగిలి సంతోష్​కలెక్టరేట్ లో ఆందోళన చేశారు. అనంతరం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. సదరు సర్పంచ్ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించి సస్పెండ్ చేయాలన్నారు. ఇదిలా ఉండగా.. జనగామ గ్రీవెన్స్ లో మొత్తం 45 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ శివలింగయ్య వాటిని పరిశీలించి, సంబంధిత ఆఫీసర్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఇన్​చార్జి జడ్పీ సీఈవో వసంత, డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి తదితరులున్నారు.

అప్లికేషన్లు వెంటనే పరిష్కరించాలి..
హనుమకొండ సిటీ, వరంగల్ సిటీ: గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లో గ్రీవెన్స్ నిర్వహించగా.. మొత్తం 90 అప్లికేషన్లు వచ్చాయి. వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా.. వరంగల్ బల్దియాలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 61 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి 12, మంచినీటి సరఫరాకు12, టౌన్ ప్లానింగ్  కు ----27, పన్నుల విభాగానికి ఏడు అర్జీలు వచ్చాయి.

ఆమనగల్లులో భూములు ఆగమాగం..
గ్రీవెన్స్ లో  ఫిర్యాదు చేసిన బాధితులు
మహబూబాబాద్:
మహబూబాబాద్ మండలం ఆమనగల్లు గ్రామంలో 250 ఎకరాల భూమి.. ధరణిలో చూపించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్ల సమన్వయ లోపం రైతులకు శాపంగా మారింది. గతంలో ఈ భూములు రెవెన్యూ కింద ఉండగా.. 2017లో ఫారెస్ట్, అసైన్డ్ ల్యాండ్స్ కింద ఉన్నాయని చెప్పి, హోల్డ్ లో పెట్టారు. 2018లో జాయింట్ సర్వే నిర్వహించగా.. ఫారెస్ట్ భూములు లేవని తేల్చారు. కానీ ధరణి 50 ఎకరాలు మాత్రమే పట్టా భూమి అని, మిగిలినది అసైన్డ్, ఫారెస్ట్ భూములుగా చూపుతోంది. వారసత్వంగా అన్నదమ్ముల్లకు వచ్చిన భూముల్లోనూ ఒకరికి పట్టాగా, మరొకరికి అసైన్డ్ గా చూపుతోంది. ఆఫీసుల చుట్టూ తిరిగిన రైతులు.. విసిగివేసారి సోమవారం మహబూబాబాద్ లోని గ్రీవెన్స్ కు వచ్చారు. కలెక్టర్ కు అర్జీలు సమర్పించి, సమస్య పరిష్కరించాలని కోరారు.