
- భారీగా కేసుల నమోదు
- వెల్లడించిన లీగల్ సావీ
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో లోన్ల చెల్లింపుల్లో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. బకాయిలు కట్టకపోవడంతో సంస్థలు, రుణగ్రహీతల మధ్య ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా లోన్ల వేధింపుల కేసులు గణనీయంగా పెరిగాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2024లో ఈ రెండు రాష్ట్రాల్లో వేధింపుల కేసులు 41శాతం పెరిగాయి. 2023లో 25,488 కేసులు నమోదు కాగా, 2024లో 35,944కు పెరిగాయి. వ్యక్తిగత లోన్ల చెల్లింపులు ఆరు క్వార్టర్లలో ఎప్పుడూ లేనంతగా 3.6 శాతానికి పెరిగాయి.
లోన్ రిజల్యూషన్ ఫర్మ్ .. లీగల్ సావీ ప్రకారం, 2024 నుంచి ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో 11 వేల మందికిపైగా రుణగ్రహీతలు రూ. 270 కోట్లకుపైగా లోన్లను లీగల్ సెటిల్మెంట్ల ద్వారా తిరిగి చెల్లించారు. పదేపదే ఫోన్ కాల్స్, మానసిక వేధింపులు, బహిరంగ అవమానాలు వంటివి రుణగ్రహీతలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఏపీలో సెటిల్మెంట్ల విలువ రూ. 110 కోట్లు కాగా, తెలంగాణలో రూ. 160 కోట్లు దాటింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్‌లలో కేసులు ఎక్కువగా ఉన్నాయని లీగల్ సావీ తెలిపింది.