పెట్రోల్‌‌ బంకులు రెట్టింపైతే.. కొన్నిటికి నష్టాలే

పెట్రోల్‌‌ బంకులు రెట్టింపైతే.. కొన్నిటికి నష్టాలే

న్యూఢిల్లీ : దేశంలోని పెట్రోల్‌‌ బంకులను రెట్టింపు చేయాలనే ప్రభుత్వ ఆలోచన ఆర్థికపరంగా సరైన నిర్ణయం కాదని క్రిసిల్‌‌ రిపోర్టు వెల్లడించింది. పోటీ పెరిగి ఒక పెట్రోల్‌‌ పంపు వ్యాపారం మరొక పంపుకు వెళ్తుందని, ఫలితంగా కొన్ని పెట్రోల్‌‌ పంపులు నష్టాలపాలవుతాయని హెచ్చరించింది. ఇండియాలో కొత్తగా 78,493 పెట్రోల్‌‌ పంపుల జారీ కోసం ప్రభుత్వ రంగ ఆయిల్‌‌ మార్కెటింగ్‌‌ కంపెనీలు మూడూ.. ఇండియన్‌‌ ఆయిల్‌‌, భారత్‌‌ పెట్రోలియమ్‌‌, హిందుస్థాన్‌‌ పెట్రోలియమ్‌‌లు ప్రకటనలు ఇచ్చాయి. ఇండియాలో ఇప్పటికే 64,624 పెట్రోల్‌‌ పంపులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్‌‌ మార్కెటింగ్‌‌ కంపెనీలకు తోడు ప్రైవేటు రంగంలోని కంపెనీలూ మరిన్ని పెట్రోలు పంపులు తెరుస్తున్నాయి. రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌–బీపీ పీఎల్‌‌సీల జాయింట్‌‌ వెంచర్‌‌, నయారా ఎనర్జీ లిమిటెడ్‌‌ (గతంలో ఎస్సార్‌‌ ఆయిల్‌‌)లు రాబోయే మూడేళ్లలో ఒక్కొక్కటి,  కొత్తగా 2,000 పెట్రోల్‌‌ పంపులు తెరవాలని ప్లాన్‌‌ చేస్తున్నాయి. ఇంచుమించుగా ఇదే కాలంలో  రాయల్‌‌ డచ్‌‌ షెల్‌‌ పీఎల్‌‌సీ కూడా 150 నుంచి 200 పెట్రోల్‌‌ పంపులు తెరవాలనుకుంటోందని క్రిసిల్‌‌ తన రిపోర్టులో తెలిపింది. ఒక వైపు కొత్త పెట్రోల్‌‌ పంపులు వస్తుంటే, మరోవైపు ఆర్థికంగా లాభసాటిగా లేని కొన్ని పెట్రోల్‌‌ పంపులు మూతపడతాయని క్రిసిల్‌‌ పేర్కొంది.

2030 దాకా చూస్తే ప్రైవేటు రంగ కంపెనీలు మొత్తం 8,000 పెట్రోల్‌‌ పంపులు తెరవాలనుకుంటున్నాయి. ఆ కంపెనీల ప్రణాళికలు, వాటికి వచ్చిన అనుమతులు చూస్తే ఇది అర్థమవుతోందని తెలిపింది. 78 వేలకు పైగా పెట్రోల్‌‌ పంపులను తెరవడం లాభసాటి కాదని క్రిసిల్‌‌ అభిప్రాయపడుతోంది. కొత్తగా 30 వేల పెట్రోల్‌‌ పంపుల వరకే మార్కెట్లో ఆస్కారం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఉన్న పెట్రోల్‌‌ పంపుల అమ్మకాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే, కొత్తగా వచ్చేవి 30 వేల కంటే మించడం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడుతోంది. ప్రతిపాదించిన 78 వేలలో 30 శాతం అంటే 30 వేల పెట్రోలు పంపులు మొదలైతే, రాబోయే 12 ఏళ్లలో అవి మనుగడ కొనసాగించగలుగుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఒక్కో పెట్రోల్‌‌ పంపు నెలకు 160 కిలో లీటర్ల చొప్పున అమ్మకాలు సాగిస్తున్నాయని, డీలర్లకు 12 నుంచి 15 శాతం రిటర్న్‌‌ లభిస్తోందని క్రిసిల్‌‌ స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం మొత్తం 78 వేల పంపులకు అనుమతి ఇస్తే, చాలా పెట్రోల్‌‌ పంపుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వెల్లడించింది. 1994 లో అమెరికాలో 2,02,800 ఉన్న పెట్రోల్‌‌ పంపుల సంఖ్య ప్రస్తుతం 1,50,000కి చేరిందని తెలిపింది.

అమెరికాలోని పెట్రోల్‌‌ పంపుల అమ్మకాలతో పోలిస్తే ఇండియాలోని పెట్రోల్‌‌ పంపుల అమ్మకాలు సగం కంటే తక్కువేనని క్రిసిల్‌‌ వివరించింది. ప్రైవేటు రంగంలోని ఆయిల్‌‌ కంపెనీల పెట్రోల్‌‌ పంపుల అమ్మకాలు ప్రభుత్వ రంగంలోని కంపెనీల కంటే మెరుగ్గా ఉంటున్నాయని చెబుతూ, పట్టణ ప్రాంతాలు–హైవేల మీదే అవి దృష్టి పెడుతున్నాయని తెలిపింది. అందుకే అవి ఎక్కువ అమ్మకాలు సాధించగలుగుతున్నాయని పేర్కొంది. ఇండియాలో పెట్రోలియమ్‌‌ ప్రొడక్ట్స్‌‌ డిమాండ్‌‌ ఏటా 3.8 శాతం చొప్పున తగ్గుతూ, 2030 నాటికి 132 మిలియన్‌‌ టన్నులకు పరిమితం కానుందని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఇంథనాలు, ఎలక్ట్రిక్‌‌ వాహనాల వినియోగం గణనీయంగా పెరగనున్న అంశాన్నీ దృష్టిలో పెట్టుకోవాలని క్రిసిల్‌‌ అభిప్రాయపడింది. ఎలక్ట్రిక్‌‌ వాహనాల వినియోగం ప్రభావం 2023 తర్వాత బాగా తెలుస్తుందని పేర్కొంది. ఎలక్ట్రిక్‌‌ వెహికిల్స్‌‌కు అవసరమైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ ఏర్పాటుతోపాటు, వాటి కొనుగోలుకు ఇన్సెంటివ్స్‌‌ కూడా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్‌‌ పంపుల సంఖ్య పెంపు అంతగా మంచి నిర్ణయం కాబోదని క్రిసిల్ రిపోర్టు అభిప్రాయపడింది.