5 రోజులు పోరాడి ఓడిన పీజీ స్టూడెంట్

5 రోజులు పోరాడి ఓడిన పీజీ స్టూడెంట్
  • ఫలించని నిమ్స్‌‌ డాక్టర్ల ప్రయత్నాలు
  • ప్రీతి మరణానికి కారణమేంటో తేల్చని సర్కార్
  • టాక్సికాలజీ రిపోర్ట్ బయటపెట్టని పోలీసులు
  • తమ బిడ్డను హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ

హైదరాబాద్, పాలకుర్తి (కొడకండ్ల), వెలుగు: పీజీ మెడికల్​ స్టూడెంట్ ప్రీతి కన్నుమూసింది. 5 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. ప్రీతి బ్రెయిన్ పని చేయడం పూర్తిగా ఆగిపోయిందని ఆదివారం మధ్యాహ్నమే కుటుంబ సభ్యులకు తెలియజేసిన నిమ్స్ డాక్టర్లు.. చివరకు రాత్రి 9:10 గంటలకు ఆమె మరణించిందని వెల్లడించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్‌‌ నిమ్మ సత్యనారాయణ బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. ప్రీతి కోలుకుంటుందని ఐదు రోజులుగా ఎదురు చూసిన ఫ్రెండ్స్, బంధువులు విషాదంలో మునిగిపోయారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటూ పేరెంట్స్ కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేశారని వారు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, ప్రీతి చావుకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వేధింపులకు పాల్పడాలనే ఆలోచన వచ్చినా భయం కలిగేలా శిక్ష ఉండాలన్నారు. ఇందులో ఇంకా ఎవరు ఉన్నారనేది ఎంక్వైరీలో తేల్చి, వాళ్లందరికీ శిక్ష పడేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

దాపరికం ఎందుకు?

ప్రీతి సడెన్‌‌గా కొలాప్స్ అవడానికి కారణం ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆమెది ఆత్మహత్యాయత్నమని తొలుత చెప్పిన కుటుంబ సభ్యులు, ఇప్పుడు హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రీతి వాట్సప్ చాట్, గూగుల్ సెర్చ్, ఇతర ఆధారాలను బట్టి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నామని వరంగల్ సీపీ రంగనాథ్‌‌ చెప్పగా.. ఆత్మహత్యకు యత్నించినట్లుగా తమకు అనిపించడం లేదని ఎంజీఎంలో ట్రీట్‌‌మెంట్‌‌ చేసిన డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పుకొచ్చారు. నిమ్స్‌‌ డాక్టర్లు, యాజమాన్యం ప్రీతి ట్రీట్‌‌మెంట్ గురించి తప్పితే, ఆమె పరిస్థితికి కారణం ఏంటన్న దానిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో టాక్సికాలజీ రిపోర్ట్ కీలకంగా మారింది. ప్రీతి శరీరంలో విష పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి 4 రోజుల క్రితమే ఆమె బ్లడ్, ఇతర శాంపిల్స్‌‌ను టెస్టు కోసం పంపించారు. ఆ రిపోర్ట్‌‌ వచ్చినా బయటపెట్టలేదు. ఈ దాపరికం మరిన్ని అనుమానాలకు తావిచ్చేదిగా ఉందని డాక్టర్లు విమర్శిస్తున్నారు.

అసలేం జరిగింది?

కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌‌ ప్రీతి, సెకండ్ ఇయర్ స్టూడెంట్‌‌ డాక్టర్ సైఫ్‌‌కు నడుమ కొంత కాలంగా గొడవ జరుగుతోంది. వృత్తి పరమైన వివాదంతో మొదలై వేధింపులకు దాకా ఇది దారి తీసింది. ఈ నెల 18న ఓ కేసు షీట్‌‌కు సంబంధించి ప్రీతి పనితీరును తప్పుబడుతూ.. వాట్సప్‌‌ గ్రూపుల్లో సైఫ్‌‌ మెసేజ్‌‌లు పెట్టాడు. తనను అవమానపరిచేలా సైఫ్ వ్యవహరిస్తుండడాన్ని ప్రీతి తప్పుబట్టింది. ఏదైనా ఉంటే హెచ్‌‌వోడీకి ఫిర్యాదు చేయాలని, అందరిలో అవమానించేలా మెసేజ్‌‌లు పెట్టడమేందని సైఫ్‌‌ను ప్రశ్నించింది. దీంతో గొడవ మరింత ముదిరింది. ప్రీతికి బుర్ర లేదని, ఆమెకు సహకరించొద్దని సైఫ్‌‌ తన బ్యాచ్‌‌మేట్స్‌‌కు పర్సనల్‌‌గా మెసేజ్‌‌లు పెట్టాడు. ఈ విషయం ప్రీతికి తెలియడంతో ఒత్తిడికి గురైంది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని బాధ పడింది. ఈ నెల 20న ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో, 21వ తేదీన అనస్థీషియా హెచ్‌‌వోడీ నాగార్జునరెడ్డి.. ప్రీతి, సైఫ్‌‌ను పిలిచి ఇద్దరితో వేర్వేరుగా మాట్లాడాడు. అదే రోజు రాత్రి ప్రీతి నైట్‌‌ డ్యూటీకి వెళ్లింది. రాత్రి వచ్చిన ఎమర్జెన్సీ, ఇతర సర్జరీలకు హాజరైంది. అయితే తెల్లవారుజామున తనకు తలనొప్పి, చాతినొప్పి ఉందని ప్రీతి రూమ్‌‌కు వెళ్లిందని, తర్వాత నర్స్‌‌ వెళ్లి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉందని ఎంజీఎం సూపరింటెండెంట్‌‌ ప్రకటించారు. వెంటనే ట్రీట్‌‌మెంట్ ప్రారంభించినా కోలుకోలేదన్నారు. ఆమె తనకు ఉన్న అనారోగ్య సమస్యకు ఇంజక్షన్ తీసుకుందని, ఆత్మహత్య చేసుకోవడానికి ఇంజక్షన్ తీసుకుందని వేర్వేరు ప్రచారాలు జరిగాయి. సైఫ్ వేధింపులతో ప్రీతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పగా, ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆధారాలు లేవని ఎంజీఎం డాక్టర్లు చెప్పుకొచ్చారు. సైఫ్‌‌కు, ప్రీతికి నడుమ చిన్న గొడవే తప్పితే, ఆత్మహత్య చేసుకునేంత వివాదం లేదని జూడాలు చెప్పుకొచ్చారు. ప్రీతి తండ్రి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు.. వేధింపులు నిజమేనని తేల్చి సైఫ్‌‌ను అరెస్ట్‌‌ చేశారు. సూసైడ్ కోసం ప్రీతి ఇంజక్షన్ తీసుకుందో లేదో తేల్చడానికి బ్లడ్, ఇతర శాంపిల్స్‌‌ను ల్యాబ్‌‌కు పంపించారు. కానీ ఆ రిపోర్ట్‌‌లను ఇప్పటిదాకా బయటపెట్టలేదు.

సూర్యాపేట - జనగామ హైవేపై బైఠాయించిన గిర్నితండా వాసులు

మెడికో ప్రీతి చనిపోయిందని తెలియగానే ఆమె సొంత గ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలోని ప్రజలు.. సూర్యాపేట – జనగామ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ తండా బిడ్డ ప్రీతి మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేసారు. ప్రీతికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. దాదాపు గంటపాటు ధర్నా చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ప్రీతి కుటుంబానికి 10 లక్షల పరిహారం: ఎర్రబెల్లి

మెడికో ప్రీతి మరణం పట్ల మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రీతి మరణం బాధాకరమని, ఆమె మృతికి కారకులైన వారిని తప్పకుండా శిక్షిస్తామని దయాకర్‌‌రావు అన్నారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. 

ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..  

మెడికో ప్రీతి మరణం మనసును కలచివేసింది. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యే. సీనియర్ వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసినా సర్కార్ పట్టించుకోకపోవడంతోనే ఈ దారుణం జరిగింది. ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల సాయం.. ఆ తల్లిదండ్రుల గుండెకోతను తీరుస్తదా? ఈ దారుణ ఘటనపై ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? గిరిజన విద్యార్థి కాబట్టి ఏమైనా పరవాలేదని అనుకుంటున్నారా? ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రీతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించే వరకూ పోరాడతాం. ప్రీతి మరణవార్త నుంచి కోలుకోకముందే ర్యాగింగ్ భూతానికి నర్సంపేటలో బీటెక్ స్టూడెంట్ రక్షిత బలికావడం తీవ్ర దిగ్ర్భాంతి కలిగిస్తోంది. కేసీఆర్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. 

- బండి సంజయ్, బీజేపీ స్టేట్ చీఫ్

నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి

ప్రీతి మరణం బాధాకరం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. 

- రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్

దోషులను కఠినంగా శిక్షించాలి

మెడికో ప్రీతి మరణం బాధాకరం. ఆమె మృతిపై అనేక అనుమానాలున్నాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. 

- షర్మిల, వైఎస్సార్ టీపీ చీఫ్

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి 

మెడికో​ ప్రీతి ఆత్మహత్యపై సిట్టింగ్​జడ్జితో విచారణ జరిపించాలి. సీనియర్ సైఫ్​తనను వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు చేసినా పట్టించుకోని కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్​ఓడీ, ర్యాంగింగ్​ను నియంత్రించని కేసీఆర్ ​ప్రభుత్వం, పోలీసులు ఆమె మరణానికి బాధ్యత వహించాలి. సైఫ్​పై హత్య కేసు పెట్టాలి. 

- డీకే అరుణ, 
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు