లిక్క‌ర్ షాపులు మూసేయాలి: ఢిల్లీ హైకోర్టులో ఎన్జీవో పిటిష‌న్

లిక్క‌ర్ షాపులు మూసేయాలి: ఢిల్లీ హైకోర్టులో ఎన్జీవో పిటిష‌న్

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం మార్చి 24 నుంచి దేశ‌మంతా లాక్ డౌన్ లో ఉంది. ఇప్ప‌టి రెండు సార్లు లాక్ డౌన్ ను పొడిగించింది కేంద్ర ప్ర‌భుత్వం. తాజాగా మే 3తో ముగిసిన లాక్ డౌన్ ను 17వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీని నాలుగు రోజుల క్రితం ప్ర‌క‌టించిన కేంద్రం.. ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను య‌థావిధిగా న‌డిసేందుకు దేశాన్ని జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభ‌జించింది. అన్ని జోన్ల‌లోనూ భారీగా స‌డ‌లింపులు ప్ర‌క‌టించింది. గ్రీన్ జోన‌ల్లో లిక్క‌ర్ షాపుల‌ను కూడా తెరిచేందుకు కేంద్రం అనుమ‌తి ఇచ్చింది.

డాక్ట‌ర్లు, పోలీసుల శ్ర‌మంతా వృథా అవుతోంది

ప‌లు రాష్ట్రాల్లో మే 4 నుంచి వైన్ షాపులు తెర‌వ‌డంతో మ‌ద్యం ప్రియులు వంద‌లాదిగా క్యూలు క‌ట్టారు. చాలా చోట్ల సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌న్న నిబంధ‌న‌ను గాలికి వ‌దిలేశారు. అనేక చోట్ల తోపులాట‌లు కూడా జ‌రిగాయి. జ‌నాల‌ను కంట్రోల్ చేయ‌లేక పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వ‌చ్చింది. ఇలా ఒక్క‌సారిగా భారీ సంఖ్య‌లో మ‌ద్యం కోసం క్యూల్లో నిల‌బ‌డ‌డం, క‌నీస దూరం పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌య్యే ముప్పు ఉందంటూ ప్ర‌జా సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. దాదాపు రెండు నెలలుగా డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ప‌గలు రాత్రి అన్న తేడా లేకుండా ప‌డిన క‌ష్ట‌మంతా లిక్క‌ర్ షాపులు తెర‌వ‌డంతో బూడిద‌లో పోసిన ప‌న్నీరులా అవుతోందంటూ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వెంట‌నే షాపులు క్లోజ్ చేయాలి..

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న స‌మ‌యంలో లిక్క‌ర్ షాపులు తెర‌వ‌డంతో లాక్ డౌన్ నిబంధ‌న‌లు పూర్తిగా ఉల్లంఘ‌న జ‌రుగుతున్నాయంటూ సివిల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఎన్జీవో ఢిల్లీ హైకోర్టులో పిల్ వేసింది. ఢిల్లీలో వెంట‌నే లిక్క‌ర్ షాపుల‌ను మూసేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసింది. మ‌ద్యం దుకాణాల ద‌గ్గ‌ర భారీగా గుంపులు చేయ‌డంతో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి తీసుకుంటున్న చర్య‌ల‌న్నీ గాలిలో పెట్టిన దీపంలా మారే ప‌రిస్థితి వ‌స్తోంద‌ని పిటిష‌నర్ కోర్టుకు వివ‌రించారు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వెంట‌నే లిక్క‌ర్ షాపులు క్లోజ్ చేసేలా ప్ర‌భుత్వాని ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు.