
చంబ్లీ (యూఎస్): అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో చిన్న విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా అందులో ఉన్న నలుగురూ చనిపోయారు. అట్లాంటా నార్త్ ఈస్ట్ సబర్బ్‌లోని టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిందని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సింగిల్ ఇంజన్ సెస్నా 210 విమానం.. డికాల్బ్ పీచ్ ట్రీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం 1:10 గంటలకు క్రాష్ అయ్యి మంటలు చెలరేగాయని చెప్పారు. మంటలను కంట్రోల్ చేయడానికి 15 మంది స్టాఫ్ ప్రయత్నించారని ఫైర్ ఆఫీసర్ జేసన్ డేనియల్స్ అన్నారు. మరణించిన వారి వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు ఎంక్వైరీ చేస్తుందని అధికారులు తెలిపారు.