ఇంటినే సాగు భూమిగా మార్చుకున్నాడు

ఇంటినే సాగు భూమిగా మార్చుకున్నాడు

సాగు చేయడానికి ఎకరాల కొద్దీ స్థలం లేదు. సరిపడా నీళ్లూ లేవు. కానీ, మూడు అంతస్తుల ఇల్లు ఉంది. దాంతో ఆ ఇంటినే సాగు భూమిగా మార్చుకున్నాడు. బాల్కనీ, టెర్రస్​​తో పాటు ఇంట్లో ఉన్న ఇంకొంత ఖాళీ స్థలంలో పదివేల మొక్కలు పెంచుతున్నాడు. అది కూడా మట్టితో పనిలేకుండా, అతి తక్కువ నీళ్లతో. ఇలా సాగు చేసిన పంటలతో సంవత్సరానికి అక్షరాల డెబ్భై  లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న ఇతని పేరు రామ్​వీర్​ సింగ్​. ఉత్తర ప్రదేశ్​లోని ​బరేలీలో ఉంటాడు రామ్​వీర్​ సింగ్​. వృత్తిరీత్యా జర్నలిస్ట్​. సాధారణంగా చిన్నప్పట్నించీ వ్యవసాయంపై అవగాహన ఉన్నవాళ్లు టెర్రస్​, బాల్కనీ గార్డెనింగ్ చేస్తుంటారు. కానీ, రామ్​వీర్​ సింగ్​ మాత్రం ఒక సమస్యకి పరిష్కారంగా సాగు మొదలుపెట్టాడు. 

ఉద్యోగం వదిలేసి.. 
కొన్నేండ్ల కిందట రామ్​వీర్​ సింగ్ ఫ్రెండ్​ వాళ్ల మామయ్య క్యాన్సర్​ బారిన పడ్డాడు.  అతన్ని చూడ్డానికెళ్లిన రామ్​వీర్​కి ఆ క్యాన్సర్​కి కారణం కెమికల్స్​తో నిండిన కూరగాయలే అని తెలిసింది. ‘‘ఈ పరిస్థితే నా భార్యాబిడ్డలకి వస్తే’’ అన్న ఆలోచన తట్టుకోలేకపోయాడు రామ్​వీర్​. ఆ ఆలోచనే అతన్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించింది. అప్పటివరకు చేస్తున్న​ ఉద్యోగాన్ని వదిలేసి, ఫ్రీలాన్స్​ జర్నలిస్ట్​గా మారాడు. తనకున్న కొద్దిపాటి భూమిలోనే సాగు మొదలుపెట్టాడు. అయితే, తనుంటున్న ఇంటి నుంచి ఆ పొలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది. రోజూ అంత దూరం ప్రయాణం అంటే కొన్నాళ్లకు ఇబ్బంది అనిపించింది. అయినా ప్రయత్నాన్ని ఆపడం ఇష్టంలేక మరోదారి  వెతికాడు. సరిగ్గా అప్పుడే దుబాయి​లో జరుగుతున్న ఒక అగ్రికల్చర్ ఈవెంట్​కి పిలుపొచ్చింది రామ్​సింగ్​కి. అక్కడే మట్టితో  పనిలేకుండా అతి తక్కువ నీళ్లతో చేసే హైడ్రోపోనిక్​ వ్యవసాయం గురించి తెలిసింది. పైగా ఈ పద్ధతితో తెగులు సమస్య కూడా ఉండదని తెలుసుకున్నాడు. ఇంట్రెస్టింగ్​గా అనిపించడంతో అక్కడే కొన్నిరోజులు ఉండి, చుట్టుపక్కల ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న  రైతుల్ని కలిశాడు. వాళ్ల ద్వారా హైడ్రోపోనిక్​ సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాడు. 

750 చదరపు మీటర్లలో...  
 ఇండియాకి వచ్చాక తన ఇంట్లోనే హైడ్రోపోనిక్​ పద్ధతిలో సాగు చేయాలనుకున్నాడు. అనుకున్నట్టే రెండు అంగుళాలున్న కుండీల్లో వరిపొట్టు, వర్మిక్యులేట్, క్లే బాల్స్​​ వేసి విత్తనాలు నాటాడు. అవి కొంచెం పెరిగాక.. పీవీసీ పైపులను నిలువు వరుసల్లో ఏర్పాటు చేశాడు.  వాటికి రంధ్రాలు పెట్టి, ఆ రంధ్రాల్లో ఆ కుండీలని పెట్టాడు. అలా తన మూడు అంతస్తుల ఇంట్లోని 750 చదరపు మీటర్ల  ఖాళీ స్థలంలో వెయ్యికి పైగా మొక్కలు పెంచుతున్నాడు.  మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్​, నైట్రోజన్​, జింక్​ లాంటి పదహారు రకాల పోషకాలను​ నీళ్లలో కలిపి ప్లాస్టిక్​ గొట్టాలతో  మొక్కల వేళ్లకి పెడుతున్నాడు. మామూలు పద్ధతితో పోలిస్తే హైడ్రోపోనిక్ సాగు ద్వారా ​ 90 శాతం నీళ్లు ఆదా అవుతున్నాయి.  

అన్నిరకాల పండ్లు, కూరగాయలు 
మిర్చి, క్యాప్సికం, సొరకాయ, టొమాటో, క్యాలీ ఫ్లవర్​, క్యాబేజీ,  స్ట్రాబెర్రీ, బెండ, పచ్చి బఠాణీతో పాటు అన్ని రకాలు ఆకుకూరలు, సీజనల్​ ఫ్రూట్స్, మరికొన్ని వెజిటబుల్స్​  పండిస్తున్నాడు రామ్​సింగ్​. ‘వింప ఆర్గానిక్​ అండ్​ హైడ్రోపోనిక్’​ అనే కంపెనీ పెట్టి, దాని ద్వారా తను పండించిన పంటను మార్కెట్​లోకి తీసుకొస్తున్నాడు. ఏడాదికి డెబ్భై లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నాడు. అలాగే చుట్టుపక్కలుంటున్న వాళ్లకి ఈ సాగు గురించి అవగాహన​ కల్పిస్తున్నాడు. వీలైనంత ఎక్కువమందిని రసాయనాల బారిన పడకుండా ​ కాపాడటమే నా లక్ష్యం అంటున్నాడు రామ్​సింగ్​.
‘‘కెమికల్స్​తో నిండిన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల క్యాన్సర్​ లాంటి ప్రమాదకర జబ్బులు వస్తాయి. వాటి నుంచి నా కుటుంబాన్ని, చుట్టూ ఉన్న వాళ్లని కాపాడాలన్న ఆలోచనతోనే హైడ్రోపోనిక్​ సాగు మొదలుపెట్టా. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పద్ధతిలో​ సాగు చేయొచ్చు. ఈ సాగు వల్ల మట్టిలో ఉండే చెడు బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు నుంచి బయట పడొచ్చు. కలుపు సమస్య ఉండదు. చీడపీడల బెడద ఉండదు. అన్నింటికీ మించి నీరు ఆదా అవుతుంది’’ అని చెప్తున్నాడు రామ్​సింగ్​.