
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న ప్లేయర్లు కరోనా పాజిటివ్‌గా తేలినా తమ టీమ్స్‌తో కలిసి ఆడొచ్చు. ప్లేయర్లు కరోనా టెస్టులు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఈ టోర్నీలో పాల్గొనేవాళ్లకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. దాంతో, కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆంక్షలు లేకుండా జరుగుతున్న పెద్ద టోర్నీ ఇదే కానుంది. ఈ ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను తమ దేశం నుంచి బయటికి పంపించిన ఆసీస్ ప్రభుత్వం ఇప్పుడు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనివ్వడం ఆశ్యర్యం కలిగిస్తోంది.
కరోనా సంక్షోభ సమయంలో ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు విధించింది. అయితే, తమ దేశం వచ్చే వాళ్లు ముందుగా ఐసోలేషన్‌లో ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం గత వారం ఎత్తేసింది. దాంతో, వరల్డ్ కప్ నిర్వహణ ఐసీసీకి మరింత సులువు అయింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటికీ నుంచి తరచూ కఠినమైన బయో బబుల్స్‌లో ఉన్న ప్లేయర్లకు ఈ నిర్ణయంతో ఊపశమనం, స్వేచ్ఛ లభించింది.