
కుల సంస్కరణకు సంబంధించి ఏవైనా పేర్లు చెప్పమని యాక్టివిస్టులనో, కుల సంఘాలను నడిపే నాయకులనో అడిగితే చెప్పే పేర్లు డా. బీఆర్ అంబేద్కర్, రెండోది జ్యోతిబాపూలే. వారి నేపథ్యం బహుజనవాదాన్ని బలోపేతం చేసిన మాట నిజమే. కానీ పేర్ల పక్కన కులంపేరును తగిలించుకొని కుల సంఘాలను నడిపేవారే ‘కుల నిర్మూలన’ను గురించి మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. పెద్ద కులాలుగా చెప్పేవారి ‘సంఘశక్తి’ అంతా ‘రాజకీయ అధికారం’ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక బీసీ కులాల వారంతా చిన్నచిన్న సమూహాలుగా విడిపోయి ఉంటారు. వృత్తి ఆధారంగా జీవించే కులాల్లో ‘బంధం’ బాగా ఉంటుంది. కుల గౌరవాలు, పౌరుషాలుగా మారినపుడే రాజకీయ పార్టీలు ఆయా కులాలను గౌరవించడం మొదలుపెట్టాయి. ఏదో ఒక పదవిలో ఉండాలి కాబట్టి ఆయా కులాలు వాళ్ళ కులస్తులను మాత్రమే నమ్ముతాయి. ఓట్ల సంఖ్యను బట్టి ఎజెండా తయారయ్యే స్థితికి ఈ చిన్న సమూహాలే పార్టీలను దారిలోకి తేగలిగాయి. ‘కుల నిర్మూలన’ అనే గ్రంథం రాసి ‘కులం చట్రంలో మీరు ఓ జాతిని, నీతినిగానీ నిర్మించలేరు’ అని చెప్పిన అంబేద్కర్ పేరు చెబుతూనే ‘కుల భవనాలు’ నిర్మిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తానికి ఇపుడు మనకు కుల నిర్మూలన కావాలా? కులతత్వ నిర్మూలన కావాలా? అన్నది ప్రశ్న. నిజానికి భారతీయ సమాజంలో కులం ఓ బలం, బలహీనత. సామాజిక సామరస్య నిర్మాణం చేసే సదుద్దేశంతో ఎంతోమంది భారతీయ దృక్కోణంతో ‘కుల సంస్కరణ’ మొదలుపెట్టారు.
‘నందనార్’ జీవితం గురించి పట్టిందా?
15 వందల ఏళ్ల క్రితమే దళిత జాతి ఉద్ధరణకు కృషిచేసి, అందులో భాగంగా తన ప్రాణం వదలిన ‘నందనార్’ జీవితం గురించి ఎవరికైనా పట్టిందా? ఆళ్వార్లు, నయనార్లలో స్త్రీ, శూద్ర, దళిత కులస్తులు ఉన్నారన్న స్పృహ ‘సోకాల్డ్’ కుల సంస్కరణవాదులకు తెలుసా? శ్రీరంగంలో లోక సారంగముని వంటి కులవాది మెడలు వంచి ‘మునివాహన సేవ’ పొందిన తిరుప్పాణి ఆళ్వార్ శ్రీరంగనాథుడికి ప్రీతిపాత్రుడు. రామానుజుడు చేసిన పని ఎంత విశిష్టమైందనే విషయం ఎప్పుడైనా ఆలోచించామా? 12వ శతాబ్దంలోనే ఈనాటి పార్లమెంటులా ‘అనుభవ మంటపం’ స్థాపించి అందులో అన్ని కులాల వాళ్లకు స్థానమిచ్చిన మహాత్మా బసవేశ్వరుడి వచనం ముఖం చూడనివారు కుల నిర్మూలన గురించి మాట్లాడుతుంటారు. అదే కోవలో 12వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు చాపకూడు,15వ శతాబ్దంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, అన్నమయ్యలు అందరిదీ సంస్కరణా దృష్టే. అలాగే మీరాబాయి, తుకారం, చొఖ్రామేళా, జ్ఞాన్దేవ్, శంకర్‌దేవ్, చైతన్య మహాప్రభు, నర్సీ మెహతా వంటి మధ్యయుగ సంస్కర్తల భక్తి ఉద్యమం ఈ దేశంలో జడలు విప్పిన కులతత్వం పై చేసిన మహాయుద్ధం.
నిశ్శబ్ద తాత్విక విప్లవం
దయానందసరస్వతి, వివేకనంద స్వామి, స్వామి శ్రద్ధానంద, మహాత్మా గాంధీ, రామ్ మనోహర్ లోహియా హృదయపూర్వకంగా కులంపై తిరుగుబాటు చేసినవారే. మధ్యభారతంలో 1725-–95 వరకు జీవించి ఎన్నో విద్యాలయాలు, గుడులు నిర్మించి గొప్ప పరిపాలనా దక్షత చూపిన రాణీ అహల్యాబాయి హెూల్కర్ బహుజన (ధనడ్) కులస్తురాలన్న విషయం విస్మరిస్తాం. నారాయణగురు సాగించిన ‘ధర్మ పరిపాలన యోగం’ కేరళలో కులం కుళ్లును కడిగేసింది. ఇదంతా తాత్వికంగా సాగించిన నిశ్శబ్ద విప్లవం. మరి ఇటీవల ఏం జరుగుతుంది? బహుజనవాదం దిక్సూచి లేకుండా ముందుకు వెళ్తుంది.
మహాత్ములెందరో..
కన్నడ ప్రాంతంలో చౌక్ (సర్కిల్) ను 'వృత్త' అని పిలుస్తారు. కనకదాస వృత్త, మడివాలు మాచయ్య వృత్త, గాణద కన్నప్ప వృత్త.. అంటూ అన్ని కులాలూ తమ తమ ప్రాంతాల్లో స్థానికంగా పుట్టిన మహాత్ములను గౌరవిస్తుంటారు. అలాగే దక్షిణ భారతంలో నారాయణ గురు చేసిన ఉద్యమం అనన్యసామాన్యం. ఎజువా - అంటే మన ప్రాంతంలో గౌడ కులస్థుడైన నారాయణ గురు ‘నారాయణ ధర్మపరిపాలన యోగం' పేరుతో 'ధిక్కారం' చేసి కుల సంస్కరణను సమానత్వం స్థాయికి తీసుకెళ్ళాడు. బీసీ కులాల అస్తిత్వం పూర్తిగా వెల్లడి కాకపోగా ఎప్పటికప్పుడు ఉద్యమస్ఫూర్తి చల్లారిపోతోంది. ‘చరిత్ర’లో స్థానం సంపాదించాలంటే బలమైన పునాదులు ఉండాలి. ‘పరాయీకరణ చెందిన మనస్తత్వం'తో ఆలోచిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందనడంలో సందేహం లేదు.
బీసీవాదం పదవులతో సరి!
పి.వి.సింధు ప్రపంచ చాంపియన్ కాగానే ఆమె కులం ఏమిటని కోట్లమంది ఇంటర్నెట్లో వెతికారు. పేదవారి ఉన్నతికి సహాయపడాల్సిన కులసంఘాల నాయకులు ఆయా కులాల సంఖ్య చూపించి పదవులు పొందడం, 'ఇదే కులసంఘాల పరమార్థం' అని సమాజానికి బోధించడం విడ్డూరంగా ఉంది. ప్రతి కుల సంఘ నాయకుడు ఏదో ఒక డిమాండ్ తరచుగా వినిపించడం, తనకు పదవిరాగానే మన్ను తిన్న పాముగా మారిపోవడం చూస్తున్నాం. అన్ని విషయాల్లో ఆధునిక దేశాల వైపు చూసే మనం కులం విషయంలో ఇంత సంకుచితంగా ఎందుకు వ్యవహరిస్తున్నామో అర్థం కావడం లేదు. ఐకాన్ సరిగ్గా ఉన్నప్పుడే ఉద్యమం సఫలీకృతం అవుతుంది. అంబేద్కర్‌ను దళిత వర్గాలు స్పష్టంగా అంగీకరించారు కాబట్టే ఆ సంఘాలు, నాయకులు చెల్లుబాటులో ఉన్నారు. బీసీ కులాలు మహాత్మా ఫూలేను పట్టుకున్నా, 12వ శతాబ్దంలోనే కుల సంస్కరణ ఫలాలను తన కాలంలో కళ్ళతో చూసిన మహాత్మా బసవేశ్వరుడున్నాడని చాలా మందికి తెలియదు.