పద్మ అవార్డు గ్రహితల గురించి తెలుసుకోవాలన్న ప్రధాని

 పద్మ అవార్డు గ్రహితల గురించి తెలుసుకోవాలన్న ప్రధాని

ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు అందుకున్న వారి జీవిత చరిత్రల గురించి తెలుసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 97వ ఎడిషన్, 2023లో మొదటి మన్ కీ బాత్ రేడీయో కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. ఈ సారి పద్మ అవార్డు గ్రహితలలో చాలా మంది గిరిజన సంఘాలు, గిరిజన సమాజంతో సంబంధం ఉన్న వ్యక్తులే ఉన్నట్టు చెప్పారు. ఆదివాసీ ప్రాంతాలకు చెందిన చిత్రకారులు, సంగీతకారులు, రైతులు, కళాకారులు పద్మ అవార్డులను అందుకున్నారన్నారు. దేశ ప్రజలందరూ వారి స్ఫూర్తిదాయకమైన కథలు చదవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ సూచించారు.

టోటో, హో, కుయ్, కువి, మందా వంటి గిరిజన భాషలపై కృషి చేసిన పలువురు ప్రముఖులకు కూడా పద్మ అవార్డులు వరించాయని స్పష్టం చేశారు. గిరిజన జీవితం నగర జీవితానికి చాలా భిన్నంగా ఉంటుందన్న ప్రధాని.. వారు జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారని చెప్పారు. అయినప్పటికీ వారి సంప్రదాయాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారని కొనియాడారు. అంతే కాకుండా సిద్ధి, జార్వా, ఒంగే తెగలతో పనిచేసే వ్యక్తులు కూడా ఈ సారి పద్మ అవార్డులు పొందారని మోడీ తెలిపారు. ఈశాన్య ప్రజలు తమ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందుతూ.. పద్మ అవార్డుల్లోనూ మెరిశారని చెప్పారు.