ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్.. రైతులను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు?

ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్.. రైతులను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు?

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ మరోమారు విరుచుకుపడ్డారు. తమ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని మోడీ విమర్శించారు. ఈ చట్టాలపై కాంగ్రెస్ అసత్యాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. రాజ్యసభలో రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆందోళనాజీవులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

‘ఎన్నాళ్ల నుంచో దేశ వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలను మేం తీసుకొచ్చాం. కొత్త అగ్రి చట్టాలపై కాంగ్రెస్ కావాలనే విమర్శలు చేస్తోంది. ఈ చట్టాల ఆవశ్యకత, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, అందులోని అంశాల గురించి విపక్షం మాట్లాడితే బాగుండేది. అలా చేస్తే చాలా బాగుండేది. చట్టాల్లో ఏవైనా సవరణలు చేసి రైతులకు అందించే వాళ్లం. ఇక రైతుల ఆందోళన విషయానికి వస్తే.. ఆందోళనలను ముగించాలని అన్నదాతలను సభ ద్వారా ప్రభుత్వం తరఫున కోరుతున్నాం. ఈ ఉద్యమం పంజాబ్‌‌లో మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా రైతులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంప్రదింపులు జరుపుతున్నారు, వారితో చర్చిస్తున్నారు. ఒకవేళ ఈ చట్టాల్లో లోపాలు ఉంటే రైతుల శ్రేయస్సు కోసం వీటిలో మార్పులు చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని మోడీ స్పష్టం చేశారు.

‘కొత్త అగ్రి చట్టాలను తీసుకొచ్చిన తర్వాత దేశంలో మండీలు బంద్ కాలేదు. కనీస మద్దతు ధర కొనసాగుతోంది. ఈ చట్టాలను తీసుకొచ్చాకే ఎంఎస్‌‌పీ పెరిగింది. ఈ చట్టాలపై కాంగ్రెస్ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల విశ్వాసాన్ని పొందలేరని విపక్షానికి హెచ్చరిస్తున్నాం. ఆందోళనకారులు వేరు.. ఆందోళనజీవులు వేరు. కొత్త అగ్రి చట్టాల వల్ల రైతులు ఇంతకుముందు పొందుతున్న ప్రయోజనాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అని రైతులను అడుగుతున్నాం. ఈ చట్టాలతో ఎవరికీ ఎలాంటి బంధనాలు విధించడం లేదు. కొత్త బడ్జెట్‌‌లో మండీలను ఆధునీకరించేందుకు ప్రత్యేక కేటాయింపులు చేశాం’ అని మోడీ చెప్పారు.